the kharif season
-
వరినాట్లు పూర్తి
సాక్షి ప్రతినిధి, గుంటూరు : మునుపెన్నడూలేని రీతిలో ఈ ఖరీఫ్ సీజన్లో వరినాట్లు వేగంగా ముగిశాయి. సాగునీరు విడుదల చేసిన నెల రోజుల్లోనే వరినాట్లు పూర్తికావడంతో దిగుబడులపైనా రైతులు ఆశాభావంతో ఉన్నారు. తొలుత వర్షాభావం, అరకొరగా సాగునీటి సరఫరా కారణంగా ఈ సీజన్లో ఎక్కువ మంది రైతులు వెద పద్ధతిలో వరి సాగు చేపట్టారు. నీటి విడుదలలో జరిగిన జాప్యం నుంచి రైతులను కొంతవరకైనా కాపాడేందుకు సాగు నీటిశాఖ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగు విస్తీర్ణంలో 85 శాతం వరకు వరినాట్లు పూర్తయ్యాయి. సాధారణంగా జూలై రెండో వారంలో కాలువలకు సాగునీటిని విడుదల చేయాల్సిన ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 5న విడుదల చేసింది. ఈ పరిస్థితుల్లో నారుమడులు పోసి, నెల రోజుల తరువాత వరినాట్లు వేస్తే సాగు ఆలస్యమై దిగుబడి తగ్గుతుందని రైతులు భావించి వెద విధానాన్ని అనుసరించారు. ఆగస్టు 10 నుంచి కాలువలకు పూర్తిస్థాయిలో విడుదలైన నీటిని వాడుకుని పంటను కాపాడుకున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సుమారు 12 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు 10.20 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడగా, ఇందులో 2.75 లక్షల ఎకరాల్లో వెద విధానాన్ని పాటించారు. కాలువ చివరి భూములు, తీర ప్రాంతాల్లోని భూముల్లోనే ఇంకా వరి నాట్లు పడాల్సి ఉంది. గుంటూరు జిల్లాలో 5.70 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. సాగర్ నుంచి నీరు విడుదలైనా ప్రకాశం బ్యారేజి నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు పూర్తిస్థాయిలో విడుదల జరగలేదు. రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని బ్యారేజి నుంచి విడుదల చేస్తే గుంటూరుకు 3,500 క్యూసెక్కులకు మించి విడుదల చేయలేదు. సాగునీటి ఎద్దడి కారణంగా రైతులు వెద విధానాన్ని ఎక్కువగా అనుసరించారు. దాదాపు రెండు లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఈ విధానాన్ని అమలు పరిచారు. వరినాట్ల కన్నా విత్తటం వల్ల లాభాలు ఎక్కువగా ఉన్నాయని గుంటూరు జిల్లాలో కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. లాం ప్రాంతీయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కోటపాటి గురవారెడ్డి ఈ ప్రాంత రైతుల్లో చైతన్యం తీసుకురావడంతో రెండు లక్షల ఎకరాల్లో వెద విధానాన్ని పాటించారు. జిల్లాలోని అనేక మంది రైతులు గతంలోనూ ఈ విధానాన్ని అనుసరించడంతో సాగు ఖర్చులు ఎకరాకు రూ. 5 వేలు త గ్గినట్టుగా గుర్తించారు. దిగుబడి కూడా తగ్గకపోవడంతో ఈ విధానాన్ని రైతులు ఎక్కువగా పాటించారు. కృష్ణా జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుంటే ఇప్పటి వరకు 5.40 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. ఇందులో 75 వేల ఎకరాల్లో వెద విధానాన్ని అనుసరించారు. కృత్తివెన్ను, బంటుమిల్లి, బందరు, అవనిగడ్డ, కోడూరు వంటి తీరప్రాంతాలు, కాలువ చివరి భూముల్లోనే వరినాట్లు మిగిలాయి. ఇరిగేషన్‌శాఖ నీటి సరఫరాపై ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో తక్కువ కాలంలో వరినాట్లు పూర్తయ్యాయి. {పకాశం బ్యారేజి వద్ద నీటిని గరిష్ట స్థాయిలో నిల్వ ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. దిగువ ప్రాంతాల రైతులకు నీటి సరఫరాలో ప్రాధాన్యం ఇచ్చారు. రైతుల నుంచి సాగునీటి విడుదలపై ఏ ఫిర్యాదు వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవడంతో ఈ ఖరీఫ్‌లో జెట్ స్పీడ్‌లో వరినాట్లు పూర్తయ్యాయి. -
ఇప్పటికే 60 టీఎంసీలు నది పాలు
పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఏటా కనీసం 200 టీఎంసీల నీరు నదికి టీబీ డ్యాంకు వరద కాల్వ నిర్మాణాలపై మీనమేషాలు అనంతపురం జిల్లాకు వరద కాలువ నిర్మాణంపై వీడని అశ్రద్ధ సాక్షి, బళ్లారి : ఈ ఏడాది తుంగభద్ర డ్యాం నుంచి ఇప్పటికే 60 టీఎంసీల నీరు నది పాలైంది. డ్యాం పూర్తి కెపాసిటీ 100 టీఎంసీలు. అంటే ఇంకో టీబీ డ్యాం ఉండిఉంటే అది 60 శాంతం నిండి ఉండేది. ఇలా ఏటా కనీసం 200 టీఎంసీల నీరు నది పాలు అవుతోంది. అంటే మరో రెండు టీబీ డ్యాంలు నిండి ఉండేవి. ఇంత స్థాయిలో నీరు నది పాలు అవుతున్నా పాలకులు మొద్దు నిద్ర వీడడం లేదు. ప్రస్తుతం రోజూ డ్యాం నుంచి లక్షా ఐదు వేల క్యూసెక్కులకు పైగా డ్యాంకు ఉన్న 33 క్రస్టుగేట్లు ద్వారా నదికి వదులుతున్నారు. సోమవారం నాటికే 60 టీఎంసీల నీరు నది ద్వారా బయటకు వెళ్లితే ఇక ఖరీఫ్ సీజన్ మొత్తంలో మరెన్ని టీఎంసీలు నీరు బయటకు వెళతాయోనన్నది వరుణుడి కృపపై ఆధారపడి ఉంటుంది. అయితే 10 సంవత్సరాలుగా తుంగభద్ర డ్యాంలోకి వచ్చే నీటిని లెక్కిస్తే డ్యాం నుంచి ఏటా కనీసం 200 టీఎంసీల నీరు నది ద్వారా బయటకు వెళ్లిపోతోంది. తుంగభద్ర డ్యాం నుంచి వెళ్లిన నీరు శ్రీశైలం, నాగార్జున సాగర్, విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీకి చేరుకుని చివరకు సముద్రం పాలవుతోంది. ఇంత పెద్ద స్థాయిలో తుంగభద్ర డ్యాం నుంచి వెళ్లిన నీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు చాలా మేలు చేస్తున్నప్పటికి, తుంగభద్రకు సమీపంలోని బళ్లారి, అనంతపురం జిల్లాలకు డ్యాం నీటిని మరింత సద్వినియోగం చేసుకునే దానిపై పాలకులు దృష్టికి పెట్టకపోవడంతో రెండు జిల్లాలకు చెందిన రైతులు తీవ్ర కరువు కాటకాలతో దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా పూర్తిగా కరువు కోరల్లో చిక్కుకుంది. ఈ జిల్లాకు తుంగభద్ర డ్యాం నుంచి వరద కాల్వ ద్వారా నీటిని తీసుకెళ్లితే కరువు జిల్లాకు కాస్త ఉపయోగపడుతుంది. తుంగభద్ర వరద కాల్వపై గతంలో కర్ణాటకలోని బళ్లారి జిల్లా రైతులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం వరద కాల్వ నిర్మాణాలపై బళ్లారి జిల్లా రైతులు సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం తుంగభద్ర డ్యాం సలహా సమితి అధ్వర్యంలో బళ్లారి జిల్లా రైతులు సమావేశం నిర్వహించుకుని వరద కాల్వపై ప్రధానంగా చర్చించారు. ఇందుకు రైతుల నుంచి సానుకూలత వ్యక్తం అయినప్పటికీ పాలకుల్లో కదిలిక లేదు. తుంగభద్ర డ్యాం ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో బోర్డు అనుమతితో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని వరద కాల్వలపై సమీక్ష నిర్వహిస్తే కాల్వ నిర్మాణ ం ఫైలు కదులుతుందని బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. 10 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు డ్యాంను సందర్శించినప్పుడు వరద కాల్వ ఏర్పాటు చేస్తే ఏ మేరకు మేలు జరుగుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. తీవ్ర కరువు కాటకాలతో అలమటిస్తున్న అనంతపురం జిల్లాకు శాశ్వత కరువు నివారణ జరగాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో వరద కాల్వ ఒక్కటే శరణ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. తుంగభద్ర డ్యాం పూర్తి నిండినప్పుడు నెల రోజుల పాటు నది ద్వారా లక్షలాది క్యూసెక్కుల నీరు బయటకు వెళతాయి. అయితే వరద కాల్వ నిర్మిస్తే డ్యాం నుంచి నది ద్వారా బయటకు వెళ్లే నీటిని ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా కాలువకు మళ్లిస్తే రెండు జిల్లాలకు చాలా మేలు జరుగుతుంది. ఈ విషయంపై అనంతపురం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని సీఎంను ఒప్పించి వరద కాల్వ నిర్మాణ ంపై చర్యలు తీసుకుంటే అనంతపురం దుర్భిక్ష పరిస్థితులు కాస్త ఉపశమనం పొందేందుకు వీలవుతుందని చెప్పవచ్చు. ఇటీవల తుంగభద్ర డ్యాంను సందర్శించి కాల్వ శ్రీనివాసులు వరద కాల్వ నిర్మాణ ంపై దృష్టి సారిస్తానని మాట ఇవ్వడంతో ఆయన ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తేనే వరద కాాల్వ నిర్మాణానికి సాధ్యం అవుతుందని రైతులు ఆశిస్తున్నారు. -
పంటసాగుకు పైసలేవీ?
పలమనేరు: రుణమాఫీ మాట దేవుడెరుగు.. బ్యాంకులు రైతులకు కొత్త రుణాలను అస్సలివ్వడం లేదు. దీంతో పంట సాగుకోసం పెట్టుబడికి ఏం చేసేదిరా దేవుడా అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ రైతు చేతిలో చిల్లిగవ్వలేక సగానికి పైగా భూములు పంటలకు నోచుకోకుండా బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. రుణమాఫీకి సంబంధించి బ్యాంకులకు ఇప్పటివరకు స్పష్టమైన ఆదేశాలు అందలేదు. ఈ ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో కొత్త రుణాలు సైతం ఇప్పట్లో అందే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు ప్రైవేటు రుణాలు కూడా పుట్టడం లేదు. గత ఏడాది ఈ సమయానికి 95 శాతం మంది రైతులకు వేరుశెనగ పూర్తిగా సాగుచేశారు. ఇతర పంటల విస్తీర్ణం కూడా సరాసరి విస్తీర్ణానికి దగ్గరగా ఉండేది. కానీ ఈ దఫా ఆ పరిస్థితి కనిపించడం లేదు. గత ఏడాది 10వేల మంది రైతులకు రూ.70 కోట్ల రుణాలు పలమనేరు నియోజకవర్గంలోని 15 బ్యాంకులు గత ఏడాది 10వేల మంది రైతులకు రూ.70 కోట్లను రుణాలుగా అందించాయి. ఇందులో పంట రుణాలు 45 కోట్లు, బంగారం తనఖాపై రుణాలు 35 కోట్లు. ఈ రుణాల కారణంగా వ్యవసాయ పెట్టుబడులకు ఇబ్బంది లేకుండా పోయింది. ఫలితంగా నియోజకవర్గంలో వేరుశెనగతో పాటు ఇతర ముఖ్య పంటలైన చెరకు, వరి, కూరగాయ పంటల విస్తీర్ణం ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుత పరిస్థితి ఏమంటే.. ఈ ప్రాంతంలోని ఏ బ్యాంకు గానీ రైతులకు పంట రుణాల ను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం చెప్పినట్లు ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అది కూడా రూ.1.5 లక్షల వరకే రుణమాఫీ అని పేర్కొంది. దీంతో బ్యాంకర్లు సైతం ఆ మేరకు రుణాలు మాఫీ అయ్యే వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రుణమాఫీ పొందే రైతులు కేవలం 30 శాతం మంది మాత్ర మే. మిగిలిన 70 శాతం మంది రైతులకు ఆగస్టు మొదటి వారంలో నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఒకటిన్నర లక్షకంటే ఎక్కువగా రుణం తీసుకున్న రైతులు రీ షెడ్యూల్‌కు బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారు. కొత్త పంట రుణాలపై ఆశలు వదులుకున్నారు. బ్యాంకర్లను వీరు అప్పులడిగినా వారు ఇచ్చే పరిస్థితిలో లేరు. ఈ ఖరీఫ్‌లో ఇబ్బందులే చేసిన పంటలు చేతికి రాక తీసుకున్న అప్పులు కట్టలేక రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈసారి పంట సాగుకు పెట్టుబడి లేదు. కష్టమోనష్టమో వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతన్నల పరిస్థితి దుర్భరంగా తయారైంది. భూగర్భ జలాలు అడుగంటి సగానికి పైగా బోర్లు ఈ ప్రాంతంలో ఎండిపోయాయి. ఫలితంగా రైతులు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ తరుణంలో ఎకరా పొలంలో వేరుశెనగ సాగు చేయడానికి రూ.30వేల దాకా పెట్టుబడి లేకే సగం మంది రైతులు ఈ దఫా వేరుశెనగ పొలాలను బీడుగానే వదిలేశారు. ఇక ఇతర పంటల పరిస్థితి అలాగే ఉంది. గత పదేళ్లలో సరాసరి పంటల సాగు విస్తీర్ణం ఇంత ఘోరంగా తగ్గిపోవడం ఎప్పుడూ లేదని వ్యవసాయశాఖాధికారులే చెబుతున్నారు. పుట్టని ప్రైవేటు రుణాలు.. గిట్టుబాటుగాని సేద్యం పలమనేరు నియోజకవర్గంలో మొత్తం 3 లక్షల జనాభా, 60 వేల కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 40 వేల మందివి రైతు కుటుంబాలే. వీరికి వ్యవసాయమే జీవనాధారం. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో రైతుల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇక్కడ ఎక్కువగా పండించే వేరుశెనగ ఏటా రైతులను నిండా ముంచేస్తోంది. గత మూడేళ్లకు సంబంధించిన రూ.10 లక్షలకు పైగా ఇన్‌ఫుట్ సబ్సిడీ ఈ ప్రాంత రైతులకు ఇప్పటికీ అందలేదు. ఇక టమోట రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయారు. ఆరేళ్ల నుంచి రైతులకు ఈ కష్టాలు తప్పడం లేదు. చెరకు సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర లేక, ఫ్యాక్టరీలకు తరలించినా చేతికేమీ మిగలడం లేదు. గానుగలాడినా గిట్టుబాటు కావడం లేదు. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అప్పు చేయకపోతే సేద్యం చేయలేని పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొంది. ప్రైవేటు రుణాలూ దక్కడం లేదు. నూటికి రూ.5 నుంచి పది రూపాయల వడ్డీ ఇస్తామన్నా రైతులను నమ్మి వడ్డీ వ్యాపారులు అప్పులివ్వడం లేదు. కొత్త రుణాలను ఇచ్చే పరిస్థితి కనిపించలే ఈ దఫా బ్యాంకులు కొత్తగా క్రాప్ లోన్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం నుంచి రుణమాఫీపై గైడ్‌లైన్స్ వచ్చినాకే కొత్త లోన్ల గురించి ఆలోచిస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇప్పటికే పంటల సాగుకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ సారీ భూమి బీడు పెట్టాల్సిందే. - రవీంద్రారెడ్డి, కూర్మాయి, పలమనేరు మండలం వడ్డీ వ్యాపారుల వద్దా అప్పు పుట్టడం లేదు బ్యాంకులోకెళ్లి కొత్త లోన్లు అడుగుతుంటే ఇవ్వడం లేదు. వడ్డీ వ్యాపారుల దగ్గర నూటికి ఐదు రూపాయల వడ్డీ ఇస్తామన్నా వాళ్లు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో మాలాంటి రైతులు పంట చేయాలంటే డబ్బు ఎక్కడ్నుంచి తెచ్చేది. ఏ పంట సాగు చేయాలన్నా ఎకరాకు 40 వేలు కావాల్సిందే. -రవి, కేటిల్‌ఫామ్, పలమనేరు మండలం -
ధాన్యం కొనుగోళ్లు.. రూ.125 కోట్లు
68 పీఏసీఎస్‌ల ద్వారా 100 కేంద్రాలు సొసైటీలకు రూ.3.12 కోట్ల ఆదాయం మక్కల కొనుగోలుతో మరో రూ.35 లక్షలు హన్మకొండ సిటీ : రైతులకు మద్దతు ధర అందించడంతో పాటు వారి కొనుగోళ్లు సులువుగా పూర్తయేందుకు జిల్లా యంత్రాంగం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాన్నిస్తున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ, జీసీసీల ద్వారా ధాన్యం, మక్కల కొనుగోలుకు ఏర్పాటుచేస్తున్న కేంద్రాలతో రైతులకు లాభం చేకూరుతోంది. అంతేకాకుండా సంఘాలకు కూడా కమీషన్ రూపంలో ఆదాయం సమకూరుతోంది. పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో.. జిల్లాలో 91 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)లు ఉండగా ఈ రబీలో 68 సంఘాల ద్వారా 100 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. అంతేకాకుండా ఐకేపీల ద్వారా మరో 127 కేంద్రాలు, జీసీసీల ద్వారా 10 కేంద్రాలు కూ డా ఏర్పాటయ్యాయి. ఇందులో పీఏసీఎస్ కేంద్రాల్లో రూ.125 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా, కమీషన్ రూ పంలో సంఘాలకు రూ.3.12 కోట్ల ఆదాయం వచ్చింది. అంతేకాకుండా రూ.36.37 కోట్ల విలువైన మక్కలు కొనుగోలు చేయ గా, రూ.35 లక్షల ఆదాయం సమకూరింది. 2011-2012 ఖరీ ఫ్ సీజన్లో 16 సహకార సంఘాల ద్వారా 22 కేంద్రాల్లో ధా న్యం కొనుగోలు చేపట్టా, ప్రతి సీజన్‌కు కేంద్రాల సంఖ్య పెంచుతున్న అధికారులు ప్రస్తుత రబీలో 100కు చేర్చారు. ఇదే తీరులో కొనుగోలు చేసిన ధాన్యం విలువు, సంఘాల ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇటు సంఘాలు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తుండగా, మార్కెట్లు, వ్యాపారుల వద్దకు వెళ్లే ఇబ్బంది రైతులకు తప్పింది. అంతేకాకుండా నేరుగా అమ్ముకునే సౌకర్యం రావడంతో దళారుల దోపిడీ నుంచి బయటపడినట్లయింది. కాగా, ధాన్యం అమ్మిన రైతులకు సొమ్ము చెల్లించేందుకు జిల్లా సహకార అధికారి కార్యాలయంలో డీసీఓ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సెల్ ద్వారా ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోళ్ల వివరాలు తెలుసుకోవడంతో పాటు కొనుగోలు చేసిన ధా న్యం మిల్లులకు తరలింపు, ఆ తర్వాత రైతులకు డబ్బు చెల్లింపు వివరాలను పర్యవేక్షించారు. ఇబ్బందులను అధిగమిస్తే.. పీఏసీఎస్‌ల ద్వారా ధాన్యం, మక్కల కేంద్రాల ఏర్పాటుతో ఇరువర్గాలకు లాభం చేకూరుతున్నా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఈ మేరకు వచ్చే ఖరీఫ్ నాటిని ఆ ఇబ్బందులను సమీక్షించి ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే మరింత పెద్దమొత్తంలో కొనుగోళ్లు చేపట్టేందుకు అవకాశం లభిస్తుంది. వర్షాకాలంలో పంట దిగుబడులు వస్తున్నందున ధాన్యం ఆరబెట్టడానికి కల్లాల నిర్మాణం, సరుకు నిల్వ చేసేందుకు గోదాం లు నిర్మించాల్సిన అవసరముంది. నాబార్డు సాయంతో ఇప్పటికే కొన్ని సహకార సంఘాల పరిధిలో గోదాంలు నిర్మిస్తున్నా, అన్ని సంఘాలకు దీన్ని విస్తరిస్తే ధాన్యం నిల్వ చేయడం సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్లాలు, గోదాంల నిర్మాణానికి కృషి చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. ఇప్పటి నుంచే పనులు ప్రారంభిస్తే సీజన్ ముగిసే నాటికి అం దుబాటులోకి వస్తాయని ఈ మేరకు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. సొసైటీలను రైతులకు చేరువ చేశాం... ధాన్యం, మక్కల కొనుగోలు ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను రైతులకు మరింత చేరువ చేశాం. రైతులకు మద్దతు ధర లభించడమే కాకుండా మోసాల నుంచి బయటపడ్డారు. అరువుకు ధాన్యం ఇచ్చి వ్యాపారుల చుట్టూ తిరగాల్సి రావడం, దళారుల దోపిడీ వంటివి తప్పాయి. అయి తే, ప్రస్తుతం ఎదురైన కొన్ని ఇబ్బందులను వచ్చే ఖరీఫ్‌కు అధిగమిస్తాం. - సంజీవరెడ్డి, జిల్లా సహకార అధికారి