వరినాట్లు పూర్తి
వరినాట్లు పూర్తి
Published Sun, Sep 14 2014 12:26 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
సాక్షి ప్రతినిధి, గుంటూరు :
మునుపెన్నడూలేని రీతిలో ఈ ఖరీఫ్ సీజన్‌లో వరినాట్లు వేగంగా ముగిశాయి. సాగునీరు విడుదల చేసిన నెల రోజుల్లోనే వరినాట్లు పూర్తికావడంతో దిగుబడులపైనా రైతులు ఆశాభావంతో ఉన్నారు. తొలుత వర్షాభావం, అరకొరగా సాగునీటి సరఫరా కారణంగా ఈ సీజన్‌లో ఎక్కువ మంది రైతులు వెద పద్ధతిలో వరి సాగు చేపట్టారు. నీటి విడుదలలో జరిగిన జాప్యం నుంచి రైతులను కొంతవరకైనా కాపాడేందుకు సాగు నీటిశాఖ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగు విస్తీర్ణంలో 85 శాతం వరకు వరినాట్లు పూర్తయ్యాయి.
సాధారణంగా జూలై రెండో వారంలో కాలువలకు సాగునీటిని విడుదల చేయాల్సిన ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 5న విడుదల చేసింది. ఈ పరిస్థితుల్లో నారుమడులు పోసి, నెల రోజుల తరువాత వరినాట్లు వేస్తే సాగు ఆలస్యమై దిగుబడి తగ్గుతుందని రైతులు భావించి వెద విధానాన్ని అనుసరించారు. ఆగస్టు 10 నుంచి కాలువలకు పూర్తిస్థాయిలో విడుదలైన నీటిని వాడుకుని పంటను కాపాడుకున్నారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సుమారు 12 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు 10.20 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడగా, ఇందులో 2.75 లక్షల ఎకరాల్లో వెద విధానాన్ని పాటించారు. కాలువ చివరి భూములు, తీర ప్రాంతాల్లోని భూముల్లోనే ఇంకా వరి నాట్లు పడాల్సి ఉంది.
గుంటూరు జిల్లాలో 5.70 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. సాగర్ నుంచి నీరు విడుదలైనా ప్రకాశం బ్యారేజి నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు పూర్తిస్థాయిలో విడుదల జరగలేదు. రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని బ్యారేజి నుంచి విడుదల చేస్తే గుంటూరుకు 3,500 క్యూసెక్కులకు మించి విడుదల చేయలేదు.
సాగునీటి ఎద్దడి కారణంగా రైతులు వెద విధానాన్ని ఎక్కువగా అనుసరించారు. దాదాపు రెండు లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఈ విధానాన్ని అమలు పరిచారు.
వరినాట్ల కన్నా విత్తటం వల్ల లాభాలు ఎక్కువగా ఉన్నాయని గుంటూరు జిల్లాలో కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. లాం ప్రాంతీయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కోటపాటి గురవారెడ్డి ఈ ప్రాంత రైతుల్లో చైతన్యం తీసుకురావడంతో రెండు లక్షల ఎకరాల్లో వెద విధానాన్ని పాటించారు.
జిల్లాలోని అనేక మంది రైతులు గతంలోనూ ఈ విధానాన్ని అనుసరించడంతో సాగు ఖర్చులు ఎకరాకు రూ. 5 వేలు త గ్గినట్టుగా గుర్తించారు. దిగుబడి కూడా తగ్గకపోవడంతో ఈ విధానాన్ని రైతులు ఎక్కువగా పాటించారు.
కృష్ణా జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుంటే ఇప్పటి వరకు 5.40 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. ఇందులో 75 వేల ఎకరాల్లో వెద విధానాన్ని అనుసరించారు.
కృత్తివెన్ను, బంటుమిల్లి, బందరు, అవనిగడ్డ, కోడూరు వంటి తీరప్రాంతాలు, కాలువ చివరి భూముల్లోనే వరినాట్లు మిగిలాయి. ఇరిగేషన్‌శాఖ నీటి సరఫరాపై ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో తక్కువ కాలంలో వరినాట్లు పూర్తయ్యాయి.
{పకాశం బ్యారేజి వద్ద నీటిని గరిష్ట స్థాయిలో నిల్వ ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. దిగువ ప్రాంతాల రైతులకు నీటి సరఫరాలో ప్రాధాన్యం ఇచ్చారు. రైతుల నుంచి సాగునీటి విడుదలపై ఏ ఫిర్యాదు వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవడంతో ఈ ఖరీఫ్‌లో జెట్ స్పీడ్‌లో వరినాట్లు పూర్తయ్యాయి.
Advertisement
Advertisement