తుంగభద్ర నది ఉగ్ర రూపం.. కృష్ణానది విలయ తాండవం.. వెరసి జిల్లాకు జల ప్రళయం. కర్నూలు చరిత్రలో ఎన్నడూ చూడని వరద. పుష్కర కాలం గడిచినా ఆ కన్నీటి జ్ఞాపకాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. వాటిని తలుచుకుంటే హృదయం ద్రవిస్తుంది. 2009 సెప్టెంబర్ చివరిలో ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షాలకు నదులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అక్టోబర్ 2వ తేదీన తుంగభద్ర తీరంలో ఉన్న మంత్రాలయం మొదలు నదీ పరీవాహక ప్రాంతాలు జలమయం అయ్యాయి.
లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్ల పైనుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. సుంకేసుల ప్రాజెక్ట్ కట్టలు తెంచుకోవడం, కృష్ణానది జలాలు వెనక్కు ముంచెత్తడంతో కర్నూలు నగరం అతలాకుతలమైంది. కొండారెడ్డి బురుజు సగానికి మునిగిపోయింది. అంతటా హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ఆ రోజు రాత్రి కాళరాత్రిగా మారింది. తెల్లారేసరికి వేల మంది కట్టుబట్టలతో మిగిలారు. ఇళ్లల్లోకి బురద చేరి.. వ్యవసాయ భూములు కోతకు గురై.. ఎంతో మంది రోడ్డున బడ్డారు. దాదాపు 50 మంది మృత్యువాత పడ్డారు. రూ. కోట్లలో నష్టం వాటిల్లింది. కోలుకోవడానికి సంవత్సరాలు పట్టింది. నాటి వదర బీభత్సానికి నిదర్శనమే ఈ చిత్రాలు.. – కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment