తుంగా స్నానం..ఎంతో కష్టం
► పుణ్యస్నానాలకు పడరాని పాట్లు
► ఎండిన తుంగభద్ర.. కానరాని ప్రత్యామ్నాయం
► భక్తుల ఇబ్బందులను గాలికి వదిలేసిన శ్రీమఠం
మంత్రాలయం తుంగా స్నానం పాప హరణం. ఇది భక్తుల ప్రగాఢ నమ్మకం. రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన ప్రతి భక్తుడూ తుంగభద్రమ్మ ఒడిలో పుణ్యస్నానాలు ఆచరించడం ఆచారం. ప్రస్తుతం చుక్కనీరు లేక తుంగభద్ర నది పూర్తిగా ఎండిపోయింది. భక్తులకు పుణ్యస్నానాలు కరువయ్యాయి. శ్రీమఠం అధికారులు సైతం భక్తుల కష్టాలను గాలికి వదిలేశారు. కారణంగా భక్తులు స్నానాలకు పడరాని పాట్లు పడుతున్నారు. పేరు గొప్ప.. కష్టాల దిబ్బ అన్న చందంగా క్షేత్రంలో భక్తుల పరిస్థితి మారింది.
వేడుక చూస్తున్న శ్రీమఠం..
రాఘవేంద్రస్వామి దర్శనార్థం రోజుకు 2-3 వేలు మంది భక్తులు ఇక్కడి వస్తారు. వేసవి సెలవులు రావడంతో భక్తుల తాకిడి పెరిగిపోయింది. అయితే భక్తులు పుణ్యస్నానాల చేసుకోవడానికి నీరులేక అల్లాడిపోతున్నారు. నదిలో ఓచోట మడుగులో నిల్చిన కలుషిత నీటిలోనే ముక్కు మూసుకుని ఒళ్లు తడుపుకుంటున్నారు. నీరు పచ్చగా మారి వాసన వస్తున్నా వేరే గత్యంతరం లేక స్నానాలు చేస్తున్నారు. అందులో స్నానం చేయడంతో ఒళ్లు దద్దులు, దురద వేస్తోందని భక్తులు వాపోతున్నారు. ఆ మడుగులో నీరింకితే అగమ్య గోచరమే. వర్షాభావ పరిస్థితుల్లో భక్తులకు ఇక్కట్లు వస్తాయని తెలిసినా కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారు.
కోనేరును కూల్చే యోచన..
తిరుపతి, మహానంది, యాగంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులు కోనేరుల్లో ఎంతో ఆనందంగా స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడి భక్తులకు ఆ భాగ్యం ఎప్పటి నుంచో లేదు. చెంతనే తుంగభద్ర నది ఉన్నా పుష్కరిణి నిర్మించలేకపోయారు. ఏడేళ్ల క్రితం భక్తుల సౌకర్యార్థం అంచనా వ్యయం రూ.16 లక్షలతో మఠం వెనుకభాగం తులసీవనం సమీపంలో పుష్కరిణి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కోనేరు ప్రాకారం, వాటర్ ఫౌంటెన్ నిర్మాణాలు సైతం పూర్తి చేశారు. అయితే మఠం అధికారులు అర్ధంతరంగా పనులు నిలిపేశారు. కట్టిన అరకొర కట్టడాల కోనేరును సైతం ప్రస్తుత అధికారులు కూల్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భక్తులు పుణ్యస్నానాలకు కనీసం నీళ్ల ట్యాంకర్లు ఏర్పాటు చేసినా పర్వాలేదు. అధికారులకూ ఇవేమీ పట్టడం లేదు. భక్తులను కష్టాలకు వదిలేసి వేడుక చూస్తున్నారు. పుణ్యస్నానాల విషయంలో వచ్చిన ప్రతి భక్తుడూ శ్రీమఠం అధికారులను నిట్టూరుస్తున్నా స్పందించని వైనం.