మంత్రాలయం: స్వర్ణరథంపై శ్రీరాఘవేంద్ర స్వామి దివ్యతేజస్సును దర్శించుకున్న భక్తజనం తన్మయత్వంలో మునిగిపోయింది. పోటెత్తిన భక్తజనంతో శ్రీమఠం కిటకిటలాడింది. భువన మోహనుడి ఆరాధన సప్తరాత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం మధ్యారాధన అత్యంత వైభవంగా సాగింది. రాఘవేంద్ర స్వామి సశరీరంగా బృందావన ప్రవేశం చేసిన శుభదినం కావడంతో వేడుకలు వెలుగులీనాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు రాయరు మూల బృందావనానికి మహా పంచామృతాభిషేకం చేశారు.
రెండుగంటల పాాటు ఎంతో వైభవంగా అభిషేక క్రతువు సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం సమర్పించిన పట్టువ్రస్తాలు, సుమమాలలతో సుందరంగా బృందావనాన్ని అలంకరించారు. అనంతరం శ్రీరాఘవేంద్రుడి బంగారు ప్రతిమను స్వర్ణ రథంపై కొలువుంచగా మంగళ హారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. అశేష భక్తజనుల హర్షధ్వానాలు, పండితుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో రథయాత్ర రమణీయంగా సాగింది.
టీటీడీ పట్టు వ్రస్తాల సమర్పణ
ఆనవాయితీలో భాగంగా శ్రీరాఘవేంద్రస్వామికి పట్టు వ్రస్తాలను టీటీడీ జేఈవో వీరబ్రహ్మేంద్ర సమర్పించారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు పట్టు వ్రస్తాలను శాస్త్రోక్తంగా స్వీకరించి శిరస్సున ఉంచుకుని ప్రాంగణ వీధుల్లో ఊరేగారు. ఊంజల మంటపంలో పీఠాధిపతిని టీటీడీ అధికారులు సత్కరించారు. అనంతరం పట్టు వ్రస్తాలను రాఘవేంద్రుల మూల బృందావనంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
మధ్యారాధన వేడుకలకు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి శ్రీశానంద, కన్నడ సినీ నటుడు జగ్గేష్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యుడు వై.ప్రదీప్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి 30 వేలకు పైగా భక్తులు తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment