నయనానందకరం.. రాఘవుడి ఉత్సవం
నయనానందకరం.. రాఘవుడి ఉత్సవం
Published Sun, Mar 5 2017 9:55 PM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM
- దేదీప్యమానంగా జగద్గురుడి జన్మదినం
- ఆకట్టుకున్న కళార్చనలు
- నవరత్న రథంపై ఊరేగిన రాఘవేంద్రుడు
మంత్రాలయం: వేద పరిమళాలు.. సుస్వరనాద హారాలు.. కళాకారుల కళార్చనలు.. పుష్పశోభిత వెంకన్న పట్టువస్త్రధారణలో రాఘవేంద్రుల మూలబృందావన సుందరరూపాన్ని చూడ రెండు కన్నులు చాల లేదు. విశ్వమోహనుడు జగద్గురు శ్రీరాఘవేంద్రస్వామి జన్మదిన పర్వం ఆధ్యంతం మంగళకరంగా సాగింది. మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆధ్వర్యంలో ఆదివారం రాఘవేంద్రుల 422వ జన్మదిన వేడుకలు దేదీప్యమానంగా నిర్వహించారు. పీఠాధిపతి మూలబృందావనం విశేష పంచామృతాభిషేకం, విశిష్టపూజలతో వేడుకలకు అంకురార్పణ పలికారు. పూలమందిరంలో మూలరాముల పూజలు చేపట్టారు. అంతకుముందు గ్రామ దేవత మంచాలమ్మకు పీఠాధిపతి పట్టువస్త్రాలు, బంగారు పతకం ధారణతో హారతులు పట్టారు.
వెంకన్న పట్టువస్త్రాలంకరణలో రాఘవుడు
జన్మదినాన్ని పురష్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారి గురురాజారావు పట్టువస్త్రాలు సమర్పించారు. పీఠాధిపతి పట్టువస్త్రాలు శాస్త్రోక్తంగా స్వీకరించి డోలోత్సవ మండపం చేరుకుని ఊంజలపై కొలువుదీరిన తుంభర సహిత రాఘవేంద్రుల ప్రతిమతో పట్టువస్త్రాలను ఉంచారు. టీటీడీ అధికారులు పీఠాధిపతిని సాదరంగా సన్మానించారు. పీఠాధిపతి వేంకటనాథుడు, రాఘవేంద్రస్వామి అనుబంధాన్ని భక్తులకు ప్రవచించారు. అనంతరం పట్టువస్త్రాలను మూలబృందావనం దరిచేర్చి ప్రత్యేకపూజలు, మంగళహారతులు పట్టారు. బృందావనాన్ని బెంగళూరు నుంచి తెప్పించిన పుష్పాలు, తులసీమాల, వెంకన్న పట్టు వస్త్రాలతో విశేషంగా అలంకరించారు. భక్తులు మూలరూపాన్ని దర్శించి భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. జన్మదినం సందర్భంగా మధ్యాహ్నం శ్రీరాఘవేంద్రస్వామి విరాట్‌ను నవరత్న రథంపై ఊరేగించారు. ముందుగా రథంపై రాఘవేంద్రుల రచించిన పవిత్ర గ్రంథాలు, విరాట్‌ను కొలువుంచారు. పీఠాధిపతి పుష్పార్చన, మంత్రాంక్షితలు, దివిటీ సేవ, మంగళహారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. మంగళవాయిద్యాలు.. హరిదాస నృత్యాలు.. చిన్నారుల కోలాటాలు స్వాగతిస్తుండగా రథయాత్ర శ్రీమఠం మాడవీధుల్లో రమణీయంగా సాగింది.
సుమధురం.. నాదహారం
తమిళనాడుకు చెందిన శ్రీరాఘవేంద్ర నాదహార సేవా ట్రస్టు ఆధ్వర్యంలో నాదహారం కానిచ్చారు. వేణువు.. డమరుకం.. గిటార్, వీణ, తుంబుర, మేళతాలాల మధ్య ఆలపించిన గోవిందుడి కీర్తనలు వీనుల విందు చేశాయి. 450 మంది సంగీత విద్వాంసులు చేసిన స్వరనాద అభిషేకం సుమధురంగా సాగింది. పీఠాధిపతి సైతం భక్తిగేయాలు ఆలపించి తన్మయత్వం పొందారు. ట్రస్టు ఆధ్వర్యంలో రూ.18.50 లక్షలు విలువ జేసే బంగారు కమండలం, బంగారు గొలుసును మఠానికి విరాళంగా అందజేశారు. అలాగే అమరావతికి చెందిన మహిళలు ఆలపించిన భక్తిసంకీర్తనలు భక్తులను అలరించాయి.
శ్రీమఠంలో ప్రముఖులు:
వేడుకను తిలకించేందుకు పలువురు ప్రముఖులు మంత్రాలయం విచ్చేశారు. తెలుగుసినీ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి, నిర్మాతలు నాగిరెడ్డి, దేవేంద్రరెడ్డి, కన్నడ నటుడు జయరాం కార్తీక్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యుడు వై.ప్రదీప్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే ఎస్‌ఆర్ రెడ్డి, తమిళనాడు హౌసింగ్ మంత్రి రాధాకృష్ణన్ వచ్చారు. ముందుగా గ్రామదేవతను దర్శించుకుని మూలబృందావనం దర్శనం చేసుకున్నారు. వేడుకలో మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, దివాన్ వాదీరాజాచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు.
Advertisement
Advertisement