హంద్రీనీవాతో సీమ సస్యశ్యామలం
హాలహర్వి : దివంగత ముఖ్యమంత్రి ఽవైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా సాగు, తాగునీరు అందించి సీమ జిల్లాలను సస్యశ్యామలం చేశారని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. బుధవారం ఆయన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో కలిసి మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయం, హర్ధగేరి హెల్త్ ఏటీఎంను ప్రారంభించారు. జిల్లాలో ఆలూరు నియోజకవర్గం అత్యంత వెనకబడిందని, ఈ ప్రాంత రైతులు వర్షాధారంపై ఏటా పంటలను సాగుచేసి నష్టపోతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కరువు రైతులను ఆదుకునేందుకు దివంగత మహానేత వైఎస్సార్ అప్పట్లోనే హాలహర్వి మండలం గూళ్యం తుంగభద్ర వృథా జలాలను ఆపేందుకు వేదావతి ప్రాజెక్టును నిర్మించేందుకు యత్నించారని, ఆయన మరణంతో ఆ ప్రాజెక్టు నిర్మాణం జరగలేదన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు గూళ్యం వద్ద దాదాపు రూ.650 కోట్లతో ప్రాజెక్టు చేపడతామని హామీ ఇచ్చారని, ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలోని హాలహర్వి, హొళగుంద, ఆస్పరి, ఆలూరు మండలాలకు తాగు, సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలో ఉన్న చెరువులను నింపేందుకు హంద్రీనీవా కాలువను వెడల్పు చేస్తానని, అందుకు రూ.120 కోట్లు ఖర్చు పెడతానని ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆ ప్రచారాలను కట్టిబెట్టి హంద్రీనీవా ఽద్వారా చెరువులు నింపే కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు కేంద్ర పథకాలను తమవిగా గొప్పలు చెప్పుకుంటున్నారన్నారని ఎద్దేవా చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ భీమప్పచౌదరి, ఎంపీపీ బసప్ప, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, జెడ్పీటీసీ సభ్యుడు రేగులరమణ, హర్ధగేరి సర్పంచు తిప్పారెడ్డి, ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్, రాష్ట్ర జలవనరుల శాఖ అఫెక్స్ మెంబర్ కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.