శాంతించిన కృష్ణమ్మ | Heavy Water Flow In Krishna River Wanaparthy | Sakshi
Sakshi News home page

శాంతించిన కృష్ణమ్మ

Published Wed, Aug 14 2019 1:39 PM | Last Updated on Wed, Aug 14 2019 1:39 PM

Heavy Water Flow In Krishna River Wanaparthy - Sakshi

ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ క్రమంగా తగ్గుముఖం పట్టింది.. గతం వారం రోజులుగా అంతకంతకూ పెరుగుతూ వచ్చిన వరద ఆదివారం వరకు 8 లక్షల క్యూసెక్కులకు చేరింది.. ఈ క్రమంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని వేలాది ఎకరాల్లో పంట పొలాలు, పలు గ్రామాలు నీట మునగడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.. గత పదేళ్ల నాటి వరదలను దృష్టిలో ఉంచుకొని ఒకింత భయాందోళనకు గురయ్యారు.. అయితే వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో సోమవారం సాయంత్రం నుంచే వరద నీటి ప్రవాహం తగ్గుతూ వస్తోంది.. మంగళవారం వరకు ఏకంగా లక్ష క్యూసెక్కుల మేర తగ్గడంతో అధికారులు సైతం ఊపిరిపీల్చుకున్నారు..

సాక్షి, వనపర్తి : ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కృష్ణానది వరద రోజురోజుకు ఉగ్రరూపం దాల్చి.. మూడురోజులుగా జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలను ముంచెత్తింది. ఈ క్రమంలో మంగళవారం కృష్ణమ్మ శాంతించడంతో అధికారులు, రైతులు ఊపిరి పీల్చుకున్నాయి. శనివారం రాత్రి తొమ్మిది గంటలకు జూరాల నుంచి దిగువకు 6,30,642 క్యూసెక్కుల వరద నీరు వదిలారు. 24 గంటల వ్యవధిలోనే ఆదివారం తొమ్మిది గంటలకు వరద ఉధృతి పెరిగింది. దిగువకు వదులుతున్న నీరు 8,57,488 క్యూసెక్కులకు చేరింది. ఒక్కసారిగా లక్షల క్యూసెక్కుల నీరు పెరగడంతో కృష్ణానది తీర ప్రాంతాల్లోని సుమారు 11 గ్రామాల్లో పంట పొలాలు, పండ్లతోటలు, పలు గ్రామాలు నీట మునిగాయి. అప్రమత్తమైన అధికారులు 2009లో ముంచెత్తిన వరదలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని ఆత్మకూరు, అమరచింత, పెబ్బేరు, చిన్నంబావి మండలాల్లోని 23 గ్రామాల్లో ప్రమాదపు హెచ్చరికలు జారీ చేశారు.

ఒక్కో గ్రామానికి ఒక్కో అధికారిని కేటాయించి ఎప్పటికప్పుడు వరద ప్రభావాన్ని నమోదు చేసుకున్నారు. శనివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు వరద ఉధృతి పెరుగుతూ వచ్చింది. సోమవారం సాయంత్రం నుంచి కొద్దిగా తగ్గింది. పెరిగిన కృష్ణానది వరదకు తుంగభద్ర నదీ సోమవారం ఉదయం నుంచి పోటెత్తి సుమారు 2.20 లక్షల క్యూసెక్కుల నీటితో కృష్ణమ్మతో కలిసి శ్రీశైలానికి పరుగులు తీసింది. పొలాలు చాలా వరకు నీట మునిగిపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఎట్టకేలకు సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి కృష్ణమ్మ శాంతిస్తూ వస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు 8,67,099 క్యూసెక్కుల వరద నుంచి సాయంత్రం ఆరు గంటలకు 8,26,855కు తగ్గింది. రాత్రి తొమ్మిది గంటలకు 8,16,957 క్యూసెక్కులు వచ్చింది. 

నాలుగు గేట్ల మూసివేత 
సోమవారం ఉదయం నుంచి పన్నెండు గంటల వరకు వచ్చి వరదతో పోల్చితే మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి సుమారుగా లక్ష క్యూసెక్కుల వరద నీరు తగ్గింది. జూరాల వద్ద 62 క్రస్టుగేట్లతో దిగువకు వచ్చే వరద నీరు మంగళవారం మధ్యాహ్నం వరకు అధికారులు జూరాల వద్ద నాలుగు గేట్లను మూసివేసి 58 గేట్ల నుంచి దిగువకు వరద నీటిని వదులుతున్నారు. 

24 గంటల వ్యవధిలోనే.. 
దాదాపు 24 గంటల వ్యవధిలోనే కృష్ణమ్మ సుమారు లక్ష క్యూసెక్కుల వరద నీరు తగ్గి ప్రవహించడంతో జిల్లా పరిధిలోని నదీ పరివాహక ప్రాంతాల్లో సుమారు పది అడుగుల మేర వరద నీరు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో రైతులు తమ పంటలకు ఢోకా లేదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద పెరిగితే పరిస్థితి ఏంటి.. గ్రామాలు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తుందని భావించిన అధికారులకు మంగళవారం వరద ఉధృతి తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మంగళవారం సైతం గ్రామాల్లో రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు వరద ఉధృతిని నమోదు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తూనే ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement