కృష్ణా, తుంగభద్ర పరవళ్లు | Water release from Sunkesula Dam | Sakshi
Sakshi News home page

కృష్ణా, తుంగభద్ర పరవళ్లు

Published Mon, Aug 4 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM

Water release from Sunkesula Dam

* జూరాల నిండుకుండ
* శ్రీశైలానికి జల సిరి.. 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
* తుంగభద్ర, సుంకేశుల డ్యాం గేట్ల ఎత్తివేత
* సాగర్‌కు వస్తోంది 13,800 క్యూసెక్కులే
 
సాక్షి యంత్రాంగం: కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో కర్ణాటకలోని ప్రాజెక్టులు దాదాపు నిండిపోయాయి. ఫలితంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి దగ్గరవుతోంది. అందువల్ల 33 గేట్లను ఎత్తి రిజర్వాయర్‌లోకి చేరుతున్న నీటి పరిమాణానికి సమానంగా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలోకి 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

మరోవైపు ఒక్క టీఎంసీ నీరు చేరితే జూరాల పూర్తిగా నిండుతుంది. దీంతో ప్రాజెక్టులోకి వస్తున్న నీటిని యథావిధిగా కిందకు వదలిపెడుతున్నారు. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 1.46 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జూరాల నుంచే కాకుండా తుంగభద్ర నుంచి విడుదలైన నీరు రోజా గేజింగ్ పాయింట్ ద్వారా శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది. జూరాల నుంచి 1,65,304 క్యూసెక్కులు, రోజా గేజింగ్ పాయింట్ నుంచి 46 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు 11 టీఎంసీలకు పైగా నీరు డ్యాంలో చేరింది. పీక్‌లోడ్ అవర్స్‌లో విద్యుదుత్పాదన చేస్తూ నాగార్జునసాగర్‌కు 9,402 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

సుంకేసుల జలాశయానికి కూడా భారీగా వరద నీరు వస్తోంది. సుంకేసులకు ఆదివారం రాత్రి 7గంటల ప్రాంతంలో 1.65 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీంతో సుంకేసుల నుంచి 29 గేట్లు ఎత్తి తుంగభద్ర నది నుంచి శ్రీశైలం వైపునకు 1.10 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. అదే విధంగా కడప-కర్నూలు (కేసీ) కాలువకు 2,200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఎగువ ప్రాజెక్టులన్నీ దాదాపు నిండే దశలో ఉన్న నేపథ్యంలో.. ఆ ప్రాంతాల్లో మరో వారం రోజులు వర్షాలు భారీగా కురిస్తే శ్రీశైలంలో నీటి మట్టం బాగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. 

నాగార్జునసాగర్‌కు అతి తక్కువగా 13,800 క్యూసెక్కుల నీరు వస్తోంది. మొత్తం మీద ఈ ఏడాది కంటే గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు మెరుగ్గా ఉన్నాయి. గత ఏడాది ఇదే రోజుకు శ్రీశైలంలో 183 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నాగార్జునసాగర్‌లోనూ 230 టీఎంసీల నీరు ఉంది. గోదావరి బేసిన్‌కు ఎగువున వర్షాలు లేకపోవడంతో తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. తెలంగాణ, ఏపీలో వర్షాలు కురవడంతో దిగువున ధవళేశ్వరం వద్ద 1.90 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతుండగా..1.89 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.
 
తుంగభద్ర తీరప్రాంతాల్లో హై అలర్ట్
తుంగభద్రకు భారీ వరద ఉధృతి కొనసాగుతోంది. భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆర్డీఎస్‌కు ఎగువనున్న కౌతాళం, కోసిగి పరిధిలో పత్తి, సజ్జ తదితర పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. తుంగభద్ర జలాశయానికి ప్రస్తుతం రెండు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని, దీంతో డ్యాంకున్న 33 గేట్లను ఎత్తి దిగువకు అదే పరిమాణంలో నీటిని వదులుతున్నట్లు తుంగభద్ర బోర్డు సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం సాయంత్రానికి కర్నూలు జిల్లా సరిహద్దు ప్రాంతానికి వరదనీరు చేరుకుంది. మంత్రాలయం వద్ద వరద నీరు 1.45 లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. భారీ ఎత్తున వరద నీరు వస్తుండటంతో కర్నూలు జిల్లా కలెక్టర్ విజయమోహన్ నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
 
ముఖం చాటేస్తున్న అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ముఖం చాటేస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపు రావాల్సిన ఈ అల్పపీడనం వాయవ్య, ఉత్తర బంగాళాఖాతం మీదుగా కోల్‌కతా తీరం వైపు పయనిస్తోంది.  దీని ప్రభావం ఏపీ, తెలంగాణలపై ఉండబోవని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి కొనసాగడం వల్ల కోస్తాంధ్ర, తెలంగాణలో కొన్ని చోట్ల జల్లులు పడొచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement