వీఆర్వో పట్టుకున్న ట్రాక్టర్లు
వీఆర్వోపై ఇసుక మాఫియా దాడి
Published Mon, Nov 7 2016 10:53 PM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM
– ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టుకున్నాడని దాడి
– తాలుకా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన నిడ్జూరు వీఆర్వో నాగన్న
– కేసు వెనక్కి తీసుకోవాలని అధికారపార్టీ నేతల ఒత్తిడి
కర్నూలు సీక్యాంప్: ఇసుకమాఫియా బరితెగించింది. నిడ్జూరు సమీపంలో తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్న నిడ్జూరు వీఆర్వో నాగన్నపై సోమవారం దాడికి పాల్పడింది. దీనిపై వీఆర్వో తాలుకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎలాగైనా కేసు వెనక్కి తీసుకోవాలని ట్రాక్టర్‌యజమానుల తరఫున అధికారపార్టీనేతలు రంగంలోకి దిగారు. పెద్దసంఖ్యలో ఆ పార్టీ నేతలు తహశీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. అయితే, తహసీల్దార్ కార్యాలయంలో లేకపోవడంతో అక్కడే మధ్యాహ్నం వరకు వేచి ఉన్నారు. చివరకు ఆళ్లగడ్డకు చెందిన ముఖ్యనేత బంధువు, కోడుమూరు నియోజకవర్గ ముఖ్య నేతలు ఇద్దరు తహసీల్దార్‌కు ఫోన్‌లు చేసి తమ వారిపై కేసులు పెట్టవద్దని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
గడువు ముగిసినా ఇసుక రవాణా
కర్నూలు మండలం నిడ్జూరు వద్ద ఇసుక రీచ్ ఉండేది. ఇప్పుడు దాని గడువు పూర్తి అయిపోయింది. ఇకఅక్కడ ఇసుకతీయరాదని అధికారులు నిర్ణయించారు. ఇసుక తీయడం వల్ల తుంగభద్రనదిలో భూగర్భ జలాలు ఇంకిపోయి తాగునీటి సమస్య వస్తుందని రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులకు, వ్యాపారులకు చాలా సార్లు విన్నవించారు. ఇవేవి తమకు పట్టవన్నుట్టు వ్యాపారులు నదిలో నుంచి ట్రాక్టర్లలో యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు సోమవారం ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను నిడ్డూరు వద్ద స్థానిక వీఆర్వో పట్టుకున్నాడు. తమ దందాను అడ్డుకుంటావని అక్రమార్కులు వీఆర్వోపై దాడికి పాల్పడ్డాడు.
దాడిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం: టీవీ రమేష్‌బాబు, తహసీల్దార్, కర్నూలు
నిబంధనలకు విరుద్ధంగా ఇసుక వ్యాపారం చేస్తున్న రెండుట్రాక్టర్లను వీఆర్వో పట్టుకున్నందుకు ఆయనపై దాడి చేశారు. దీనిపై వీఆర్వో తాలుకా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇసుక తరలిస్తే ఉపేక్షించేది లేదు. దాడి కేసు వెనక్కి తీసుకోవాలని మాకు ఎటువంటి ఒత్తిళ్లు రాలేదు.
Advertisement