హంద్రీలో పేరుకపోయిన ముళ్ళ కంప, హంద్రీలోని రాళ్ళు
– దివంగత వైఎస్‌ఆర్ హయాంలో రూ. 244 కోట్లు మంజూరు
- ఆయన అకాల మరణంతో నిలిచిపోయిన పనులు
– చేతులెత్తేసిన ప్రస్తుత ప్రభుత్వం
- రెండున్నర ఏళ్లు గడిచినా అమలుకు నోచుకోని ఎమ్మెల్యే హామీ
– రక్షణ గోడకు బదులు పూడికతీతతోనే సరిపెట్టేందుకు ఎత్తుగడ
కర్నూలు సిటీ: కర్నూలు నగరానికి ఒక వైపు తుంగభద్ర, మధ్యలో హంద్రీనది ప్రవహిస్తోంది. ఈ నదులు రెండుమూడు సార్లు ఉగ్రరూపం దాల్చి నగర రూపురేఖలను ఛిన్నభినం చేశాయి. ఎందరో నిరాశ్రయులయ్యారు. మళ్లీ ఈ పరి స్థితి పునరావృతం కాకూడదని 2008లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరద రక్షణ గోడ నిర్మాణానికి రూ. 244 కోట్లు మంజూరు చేశారు. అదే ఏడాది డిసెంబర్ 11న పనులకు శంకుస్థాపన చేశారు. అయితే, ఆయన అకాల మరణంతో అధికారం చేపట్టిన పాలకులు పట్టించుకోకపోవడంతో పనులు ప్రారంభదశలోనే నిలిచిపోయాయి. ఈ లోపు రాష్ట్ర విభజన జరగడం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడంతో రక్షణ గోడ అటకెక్కింది. ఆయకట్టు లేనప్పుడు అంత మొత్తంలో నిధులు ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. త్వరలో నగర పాలక సంస్థకు ఎన్నికల రానుండడంతో అందులో లబ్ధిపొందేందుకు హంద్రీనదిలో పూడికతీత తీసేందుకు నీరు–చెట్టు కింద 29.86 కోట్లు, సుద్దవాగుకు వాల్, పూడికతీతకు 39 కోట్లు, జోహరాపురం దగ్గర వంతెనకు 19 కోట్లతో అంచనాలు వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
పూడితతీతో సరిపెట్టేందుకు అధికారి పార్టీ ఎత్తుగడ!
త్వలరలో నగరపాలక సంస్థ ఎన్నికలు రానుండడంతో ప్రజలను మరో సారి మభ్య పెట్టేందుకు అధికారపార్టీ నేతలు యత్నిస్తున్నారు. గతంలో ఇచ్చిన రక్షణ గోడ హామీని వదిలేసి పూడికతీతతో సరిపెట్టేందుకు ఎత్తుగడ వేశారు. నీరు–చెట్టు కార్యక్రమం కింద రూ.29.86 కోట్లతో 44వ జాతీయ రహదారి దగ్గర ఉన్న హంద్రీ బ్రిడ్జి నుంచి జోహరాపురం వరకు పూడికతీసేందుకు అంచనాలు వేశారు. మొత్తం హంద్రీ 0.కిమీ నుంచి 5.4 కి.మీ వరకు ఉన్న 12,02, 096 క్యుబిక్ మీటర్ల పూడిక, ముళ్ల కంప, 59339 క్యుబిక్ మీటర్ల రాక్, 2626 క్యుబిక్ మీటర్ల కాంక్రీట్ దిమ్మెలను తొలగించనున్నారు. సుద్దవాగులో పూడిక తీసేందుకు రూ.39 కోట్లు, జోహరాపురం దగ్గర వంతెన నిర్మాణానికి 19 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
హామీని మరచిన ఎమ్మెల్యే!
2008, 2009 సంవత్సరాఽల్లో హంద్రీ, తుంగభద్ర నదులు పోటెత్తి నగర ప్రజలకు ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి. వర్షం వస్తే చాలు ఇప్పటికీ నాటి భయంకర పరిస్థితులు వారికి గుర్తుకు వస్తాయి. తనను గెలిపిస్తే నగరాన్ని శాశ్వతంగా వరదల నుంచి కాపాడేందుకు రక్షణ గోడ నిర్మిస్తానని కర్నూలు ఎమ్మెల్యే గత ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీచ్చారు. కానీ గెలిచి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఆ హామీ ప్రకటనకే పరిమితమైంది.
పూడికతీతకు ప్రతిపాదనలు పంపాం – మల్లికార్జునరెడ్డి, ఎఫ్‌ఆర్‌ఎల్,ఈఈ
హంద్రీ, సుద్దవాగులో పేరుకుపోయిన పూడిక తీసేందుకు అంచనాలు వేసి సీఈ ద్వారా ఇటీవలే ప్రభుత్వానికి పంపించాం. నీరు–చెట్టు కింద పూడికతీత పనులు చేపడతాం. జోహరాపురం వద్ద వంతెన నిర్మాణానికి రూ. 19 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపించాం.