మనసే మంత్రాలయం
మనసే మంత్రాలయం
Published Sat, Mar 4 2017 11:03 PM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM
– ఆకట్టుకున్న సంస్థాన పూజలు
– అలరించిన దాసవాణి, వీణ కచేరీలు
– నేడు రాఘవేంద్రుల జన్మదినం వేడుక
మంత్రాలయం : వేదం వీణ గానమైంది.. మనసే మంత్రాలయాన్ని స్మరించింది. సద్గురు శ్రీరాఘవేంద్రస్వామి వైభవోత్సవాలతో తుంగభద్రమ్మ భక్తిగానం ఆలపించింది. శనివారంతో శ్రీగురు వైభవోత్సవాలు ఐదో రోజుకు చేరాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేకువ జాము నుంచే శ్రీమఠంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. రాఘవేంద్రుల మూలబృందావనానికి నిర్మల్య విసర్జన, పుష్ప, పంచామృతాభిషేకాలు, తులసీమాల ధారణ, కాషాయ పట్టువస్త్ర, పుష్పామాలంకరణ చేశారు. పూజా మందిరంలో మూలరాముల పూజ, బృందావన ప్రతిమకు బంగారు పల్లకీ సేవ, రాయరు పాద నిర్వహించారు.
గురుసార్వభౌమ దాససాహిత్య మండపంలో కర్ణాటక సంగీత కళాకారుల దాసవాణి, వీణ కచేరీలు ఎంతగానో భక్తులను ఆకట్టుకున్నాయి. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను అంబారీ, చెక్క, వెండి, బంగారు, నవరత్న రథాలపై కనుల పండువగా ఊరేగించారు. యోగీంద్ర మండపంలో బెంగళూరుకు చెందిన రూప, గీత సంగీత విభావరిలో ఆలపించిన భక్తిగేయాలు భక్తులను విశేషంగా అలరించాయి. బెంగళూరు ఆరాధన స్కూలు విద్యార్థులు నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. పీఠాధిపతి.. కళాకారులకు శేషవస్త్రం, రాఘవేంద్రుల జ్ఞాపిక బహూకరించి ఫల, పూల, మంత్రాక్షింతలతో ఆశీర్వదించారు. ఉత్సవంలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, దివాన్ వాదీరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి, డీఎం ఆనందరావు పాల్గొన్నారు.
నేడు రాఘవేంద్రుల జన్మదిన వేడుక
విశ్వ గురువు రాఘవేంద్రస్వామి జన్మదినం వేడుక ఆదివారం జరగనుంది. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేకువజామున రాఘవేంద్రుల మూలబృందావనంకు విశేష పంచామృతాభిషేకం చేస్తారు. రాయరు చిత్రపటాలను ర«థాలపై ఊరేగిస్తారు. డోలోత్సవ మండపంలో రాయరు జీవిత చరితను భక్తులకు ప్రవచిస్తారు. వేడుక సందర్భంగా పలువురు ప్రముఖులతోపాటు, వేలాదిగా భక్తులు తరలిరానున్నారు.
Advertisement