subudhendratirthulu
-
రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డుల ప్రదానోత్సవం
కర్నూలు/మంత్రాలయం: శ్రీ రాఘవేంద్ర స్వామి గొప్ప తత్వవేత్త,మానవతావాది,కలియుగ కామధేను అని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కొనియాడారు.. గురువారం సాయంత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం 352 వ ఆరాధనోత్సవాల్లో భాగంగా మఠం ఆవరణలో రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులను ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో విశిష్ట వ్యక్తులుగా పేరు గాంచిన ప్రముఖులకు రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులను రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సమక్షంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో విశిష్ట వ్యక్తులు ఎన్.చంద్రశేఖరన్, టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ముంబై, విద్వాన్ రామ విఠలాచార్య, శతావధాని గరికపాటి నరసింహారావు, ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వనాథ్ డి.కరడ్, పూణే గార్లకు రాష్ట్ర గవర్నర్ సమక్షంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ చేతుల మీదుగా రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ శ్రీ రాఘవేంద్ర స్వామి మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారని, భక్త ప్రహ్లాద అవతారంగా భావిస్తారని పేర్కొన్నారు. తుంగ భద్రా తీరంలో వెలిసిన మంత్రాలయం ప్రముఖ పుణ్య క్షేత్రం అని ప్రశంసించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ప్రస్తుత పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో భక్తుల కోసం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. వ్యాస తీర్థ స్కీం, అన్నదాన స్కీం, ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్, ప్రాణదాన స్కీం, గోరక్షణ కేంద్రం వంటి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం సర్వ జన శాంతి పీఠం అని గవర్నర్ కొనియాడారు. శ్రీ రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులు పొందిన ప్రముఖులను ఈ సందర్భంగా గవర్నర్ అభినందించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం అందచేశారు. సన్మాన గ్రహీతలు చేస్తున్న సేవలను అభినందించారు. అవార్డులు అందుకున్న ప్రముఖులు ప్రసంగిస్తూ, శ్రీ రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులు పొందడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ వీర వెంకట శ్రీశానంద, శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ పూర్వాశ్రమ తండ్రి ఎస్.గిరియాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: అది వైఎస్సార్సీపీ ఘన చరిత్ర.. సంక్షేమానికి బంగారు బాట -
ఉత్కంఠ రేపుతున్న శ్రీమఠం ‘కరెన్సీ’ కథ
సాక్షి, మంత్రాలయం : కరెన్సీ కథ మలుపులు తిరుగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు సమస్య జటిలం కావడంతోపాటు ఉత్కంఠను రేపుతోంది. ఈనెల 18న రాఘవేంద్రస్వామి మహారథోత్సవం సందర్భంగా పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు రూ.100 కరెన్సీ నోట్లు విసరడంతో మొదలైన వివాదం ఆజ్యం పోసుకుంటోంది. నోట్లు విసిరి తొక్కిసలాటకు కారకులైన మఠాధీశులపై కేసు నమోదు చేయాలంటూ సీఐ కృష్ణయ్యకు 22న మంత్రాలయానికి చెందిన వి.నారాయణ ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మఠం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు మల్లగుల్లాలు పడి చివరకు మిన్నకుండిపోయారు. మఠం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పీఠాధిపతిపై కేసు నమోదుకు ఫిర్యాదు చేయడం ఇదే ప్రథమం. అయితే పీఠాధిపతిపై ఫిర్యాదు చేసిన నారాయణపై కేసు నమోదు చేయాలంటూ కోడుమూరుకు చెందిన అనిల్‌శర్మ అనే అర్చకుడు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం సాయంత్రం కర్నూలులో ఓఎస్డీ రామాంజనేయులుకు ఫిర్యాదు చేయగా మంత్రాలయం స్టేషన్‌కు ఎండార్స్ చేశారు. శనివారం అనిల్ శర్మ తన సహచరులతో కలిసి వచ్చి ఎస్ఐ మధుసూదన్‌కు ఫిర్యాదు అందజేశారు. పీఠాధిపతిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, గతంలోనూ పీఠాధిపతి పట్ల అనుచిత వాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా ఉండగా నారాయణ సైతం మరోమారు స్టేషన్ మెట్లెక్కారు. కొందరు మఠం ఉద్యోగులు శుక్రవారం తనపై అనుచిత వాఖ్యలు చేయడమే గాకుండా ఇంటిని ముట్టడిస్తామని చర్చించారని ఎస్ఐకి ఫిర్యాదు చేశాడు. ముగ్గురు ఉద్యోగుల నుంచి తనకు హాని ఉందని వారి పేర్లు, ఫోన్‌నంబర్లు ఎస్ఐకి అందజేశాడు. ఇలా ఫిర్యాదుల పర్వంతో కరెన్సీ కథ రక్తి కట్టిస్తోంది. రోజురోజుకు మలుపులు తిరుగుతుండటంతో ఆసక్తి నెలకొంది. ఎంత వరకు ఈ వ్యవహారం దారి తీస్తుందో వేచిచూద్దాం.. ఇది చదవండి : నోట్లు విసిరిన మంత్రాలయం మఠాధీశులు.. తీవ్ర వివాదం -
నోట్లు విసిరిన మంత్రాలయం మఠాధీశులు.. తీవ్ర వివాదం
సాక్షి, మంత్రాలయం : కరెన్సీ నోట్లు విసరడం శ్రీమఠంలో దుమారమే రేపుతోంది. మఠాధీశులను మొదలు అధికారులను ఓ కుదుటున కూర్చోనివ్వకుండా చేస్తోంది. అనుకోని పరిణామాలతో ఆందోళన రేకెత్తించింది. ఊహించని రీతిలో వి.నారాయణ అనే భక్తుడు పీఠాధిపతి సబుదేంద్రతీర్థులపై కేసు నమోదు చేయాలంటూ స్టేషన్ మెట్లు ఎక్కడం.. ఈ వార్త కర్ణాటక, ఆంధ్ర మీడియాల్లో హైలెట్ కావడంతో మఠంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు హడావుడి నెలకొంది. ఉదయం పీఠాధిపతికి మద్ధతుగా టీడీపీ నాయకులు ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత మఠం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సాయంత్రం ఏకమై భారీ ర్యాలీ చేపట్టాలని పిలుపు నిచ్చారు. ఈ మేరకు వందలాది మంది నాయకులు, అనునయులు మఠంలోనే తిష్ట వేసి పరిస్థితిపై మల్లాగుల్లాలు చేశారు. నాయకులు, అధికారులు చర్చించుకున్న తర్వాత సీఐ కృష్ణయ్యను పిలిచి కేసు విషయంపై ఆరా తీశారు. ఆందోళన చేయడంతో సమస్య మరింత జఠిలంగా మారే అవకాశం ఉందని ఆయన సూచించినట్లు సమాచారం. సాయంత్రం సంఘం నాయకులు ఇంజినీర్ సురేష్ కోనాపూర్ సూచన మేరకు ఉద్యోగులు, సంభావణ కార్మికులు ర్యాలీకి సమాయత్తమవుతున్న తరుణంలో అనుకోకుండా బ్రేక్ వేశారు. పీఠాధిపతి సూచన మేరకు ఆందోళన విరమించుకున్నట్లు ఉద్యోగులకు తెలపడంతో అందరూ గమ్మున ఇంటి ముఖం పట్టారు. ఫిర్యాదు దారుడిపై రివర్స్ కేసుకు యోచన 18 వ తేదీన రాఘవేంద్రుల మహారథంపై నుంచి పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు రూ.100 కరెన్సీ నోట్లు విసరడంతో కాస్త తొక్కిసలాట జరిగింది. దీనికి కారకులైన పీఠాధిపతిపై కేసు నమోదు చేయాలని స్థానిక భక్తుడు వి.నారాయణ గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం అధికారులు, సన్నిహితులతో కలిసి పీఠాధిపతి మంతనాలు చేశారు. నారాయణపై రివర్స్ కేసు పెట్టాలని యోచించారు. విషయాన్ని పెద్దది చేయడం ఎందుకని సూచించడంతో పీఠాధిపతి రివర్స్ కేసు అంశాన్ని వెనక్కి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా అనుకోని సంఘటన దుమారం రేగడంతో మఠంలో ఉత్కంఠ నెలకొంది. ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. -
మనసే మంత్రాలయం
– ఆకట్టుకున్న సంస్థాన పూజలు – అలరించిన దాసవాణి, వీణ కచేరీలు – నేడు రాఘవేంద్రుల జన్మదినం వేడుక మంత్రాలయం : వేదం వీణ గానమైంది.. మనసే మంత్రాలయాన్ని స్మరించింది. సద్గురు శ్రీరాఘవేంద్రస్వామి వైభవోత్సవాలతో తుంగభద్రమ్మ భక్తిగానం ఆలపించింది. శనివారంతో శ్రీగురు వైభవోత్సవాలు ఐదో రోజుకు చేరాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేకువ జాము నుంచే శ్రీమఠంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. రాఘవేంద్రుల మూలబృందావనానికి నిర్మల్య విసర్జన, పుష్ప, పంచామృతాభిషేకాలు, తులసీమాల ధారణ, కాషాయ పట్టువస్త్ర, పుష్పామాలంకరణ చేశారు. పూజా మందిరంలో మూలరాముల పూజ, బృందావన ప్రతిమకు బంగారు పల్లకీ సేవ, రాయరు పాద నిర్వహించారు. గురుసార్వభౌమ దాససాహిత్య మండపంలో కర్ణాటక సంగీత కళాకారుల దాసవాణి, వీణ కచేరీలు ఎంతగానో భక్తులను ఆకట్టుకున్నాయి. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను అంబారీ, చెక్క, వెండి, బంగారు, నవరత్న రథాలపై కనుల పండువగా ఊరేగించారు. యోగీంద్ర మండపంలో బెంగళూరుకు చెందిన రూప, గీత సంగీత విభావరిలో ఆలపించిన భక్తిగేయాలు భక్తులను విశేషంగా అలరించాయి. బెంగళూరు ఆరాధన స్కూలు విద్యార్థులు నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. పీఠాధిపతి.. కళాకారులకు శేషవస్త్రం, రాఘవేంద్రుల జ్ఞాపిక బహూకరించి ఫల, పూల, మంత్రాక్షింతలతో ఆశీర్వదించారు. ఉత్సవంలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, దివాన్ వాదీరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి, డీఎం ఆనందరావు పాల్గొన్నారు. నేడు రాఘవేంద్రుల జన్మదిన వేడుక విశ్వ గురువు రాఘవేంద్రస్వామి జన్మదినం వేడుక ఆదివారం జరగనుంది. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేకువజామున రాఘవేంద్రుల మూలబృందావనంకు విశేష పంచామృతాభిషేకం చేస్తారు. రాయరు చిత్రపటాలను ర«థాలపై ఊరేగిస్తారు. డోలోత్సవ మండపంలో రాయరు జీవిత చరితను భక్తులకు ప్రవచిస్తారు. వేడుక సందర్భంగా పలువురు ప్రముఖులతోపాటు, వేలాదిగా భక్తులు తరలిరానున్నారు.