ఆదోని, న్యూస్‌లైన్: తుంగభద్ర దిగువ కాల్వ అక్రమార్కులకు కల్ప వృక్షమైంది. జిల్లా పశ్చిమ ప్రాంతాలతో పాటు బళ్లారి జిల్లాలోని బీడు భూములను సస్యశ్యామలం చేసే ఎల్లెల్సీలో అవినీతి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నాలుగు రోజుల క్రితం మోకా గ్రామం సమీపంలో కాల్వకు పడిన గండిని పూడ్చి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సీసీ లైనింగ్ జరిగిన స్థలంలోనే గండి పడి వేల క్యూసెక్కుల నీరు వృథా అయింది. ఇందుకు బాధ్యులు అవినీతి కాంట్రాక్టరా, పర్యవేక్షించాల్సిన అధికారులదా తెలియలేదు. పర్సెంటేజీలు తీసుకున్న ఉన్నతాధికారులు గండికి కారకులైన వారిపై చర్యలు తీసుకునేందుకు సాహసిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్ర, కర్ణాటక ఉమ్మడి రాష్ట్రాల ప్రాజెక్ట్ కావడంతో దిగువ కాలువ అభివృద్ధి, నిర్వహణకు అవసరమైన నిధులను రెండు రాష్ట్రాలు సమకూర్చుతున్నాయి. అయితే రాజకీయ జోక్యం, అధికారులు, కాంట్రాక్టర్ల స్వార్థం కారణంగా ప్రజా ధనం ఏటా రూ.కోట్లలో దుర్వినియోగం అవుతోంది. 50 శాతంకు పైగా నిధులు స్వార్థపరుల జేబుల్లోకి వెళ్తున్నట్లు అంచనా. కాంట్రాక్టర్లు నీటిని విడుదల చేసే సమయంలో పనులను తూతూ మంత్రంగా చేస్తుండగా, అధికారులు నీటి విడుదల పూర్తయిన తరువాత పనులను పరిశీలించకుండానే అధికారులు బిల్లులు చెలిస్తున్నారు.
కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఇదంతా జరుగుతుందనేది బహిరంగ రహస్యం. ప్రస్తుతం 120వ కిలో మీటరు వద్ద పడిన గండి సంఘటనపై విచారించి నాణ్యతా లోపమే ఇందుకు కారణమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి రంగారెడ్డి ప్రకటించారు. అయితే గతంలో కూడా పలువురు అధికారులు ఇలాంటి ప్రకటనలు చేసినా ఇంత వరకు ఒక్కరిపై కూడా చర్యలు లేవు. దీంతో కారయదర్శి చేసిన ప్రకటన కూడా వాస్తవ రూపం దాల్చక పోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే బాధ్యతలు చేపట్టడంతో కాల్వ స్వార్థపరులకు ఎంత పట్టు ఉందో తెలియక కార్యదర్శి స్పందించి ఉండొచ్చని భావిస్తున్నారు.
అక్రమార్కులపై చర్యలు తీసుకుంటారని తుంగభద్ర బోర్డు బళ్లారి ఈఈ నారాయణ నాయక్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ‘దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన పనులలో నాణ్యత ఉందా లేదా?అని ఇప్పుడు ఎలా చెప్పగలమని అన్నారు. సీసీ లైనింగ్ జరిగిన చోట గండి పడకూడదని ఎలా అనుకోగలం’ ఆయన కాంట్రాక్టర్లను వెనకేసుకొచ్చారు.