adhoni
-
వంకలో ఒరిగిన ఆర్టీసీ బస్సు
హొళగుంద: కర్నూలు జిల్లా హొళగుంద–ఆదోని మార్గంలోని హెబ్బటం వద్దనున్న చెళ్లవంకలో ఆదోని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ 21జెడ్ 0133) ఓ పక్కకు ఒరిగిపోయింది. అక్కడే ఉన్న హెబ్బటం గ్రామ రైతులు, కూలీలు వెంటనే స్పందించి ప్రయాణికులను కాపాడడంతో అంతా సురక్షితంగా బయట పడ్డారు. సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు హొళగుంద నుంచి ఆదోనికి బయలు దేరింది. అందులో డ్రైవర్, కండక్టర్‌తో పాటు ఎనిమిది మంది పెద్దలు, ఇద్దరు చిన్నారులున్నారు. ఎగువన కురిసిన వర్షానికి చెళ్లవంక ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినప్పటికీ డ్రైవర్ కల్వర్టు మీదుగా వంకను దాటడానికి బస్సును ముందుకు నడిపాడు. అది ఓ పక్కకు ఒరిగిపోయింది. సమీప పొలాల్లో ఉన్న రైతులు, కూలీలు వెంటనే అక్కడికి చేరుకుని బస్సులో ఉన్న ప్రయాణికులను క్షేమంగా బయటకు తీశారు. డ్రైవర్‌కు కల్వర్టు సరిగా కనపడక వంకలోకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
ఓటుకు పోటు!
కర్నూలు, ఆదోని: ఓట్లు తొలగించాలని కోరుతూ ఆదోని నియోజకవర్గంలో మరో వెయ్యి దరఖాస్తులు ఆన్లైన్లో దాఖలయ్యాయి. దీంతో ఓట్ల తొలగింపు కోసం దాఖలైన దరఖాస్తుల సంఖ్య 7వేలు దాటింది. గంపగుత్తగా దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా వచ్చి పడుతుండడంతో రెవెన్యూ అధికారుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో తహసీల్దార్ విశ్వనాథ్ ఆదివారం.. టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు దరఖాస్తులను ఆన్లైన్లో ఎవరు ఎక్కడి నుంచి దాఖలు చేశారో విచారించి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఐపీసీ 182, 419 అండ్ 66డి ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మీసేవా కేంద్రాలు, సెల్‌ఫోన్ సర్వీస్ సెంటర్ల నిర్వాహకులు ఫాం–7కింద ఓటరు తొలగింపుకు దరఖాస్తులు ఆన్లైన్ చేయడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అక్రమాలకు ఆస్కారం ఇస్తే చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుందని తహసీల్దార్ హెచ్చరించారు. టీడీపీ వారి పనే... తెలుగుదేశం నాయకులే ఓట్ల తొలగింపు కుట్రకు తెరతీసినట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికే తహసీల్దార్ విశ్వనాథ్‌కు ఫిర్యాదు చేశారు. తమ ఫొటోలు, పేర్లు వినియోగంచుకొని తమ పార్టీ మద్దతు దారుల ఓట్లను తొలగించి రాజకీయ లబ్ధి పొందేందుకే టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు శేషిరెడ్డి, బీమా, నర్సప్ప, చిన్న స్వామి గౌడ్ మరికొంత మంది ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా..ఎన్నికల నాటికి తమ ఓట్లు ఉంటాయో, ఉండవో తెలియని అయోమయ పరిస్థితుల్లో నిర్ధారించుకోవడానికి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఓటర్లు తిరుగుతున్నారు. తొలగింపునకు తమపేరుపై దరఖాస్తు దాఖలు కావడం చూసి పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సీపీఎస్ వద్దే వద్దు
ఆదోని అర్బన్: కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నాయకులు నినదించారు. ఆదివారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఢణాపురం నుంచి ఆదోని ఆర్ట్స్ కళాశాల వరకు బైకు, జీపుజాత, ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ బాబురెడ్డి, సెక్రటరీ హృదయరాజు మాట్లాడారు. సీపీఎస్ రద్దుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ జాప్యం చేస్తున్నారన్నారు. సీపీఎస్ కారణంగా రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులు పింఛన్ భద్రతను కోల్పోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ ఆర్డీఏ బిల్లును, రాష్ట్ర ప్రభుత్వం 653, 654, 655 జీఓలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ సమస్య పరిష్కరించేంత వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1న సామూహిక సెలవు పెడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు తిమ్మన్న, సురేష్‌కుమార్, రామశేషయ్య, మాణిక్య రాజు, రంగన్న, నర్సింహులు, సోమశేషాద్రిరెడ్డి, ప్రేమ్ కుమార్, క్రిష్ణ, రఘు, జయరాజు, హనుమంతు, నాగురాజు, సునీల్‌కుమార్, క్రిష్ణమూర్తి, ఉరుకుందప్ప, రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్య రోగం
ఆదోని టౌన్: జిల్లా పశ్చిమ ప్రాంతంలోని దాదాపు 15 లక్షల మందికి ఆదోని ప్రభుత్వ ఏరియా రెఫరల్ ఆసుపత్రి పెద్ద దిక్కు. పేరుకు మాత్రమే వంద పడకల వైద్యశాల.. సౌకర్యాలు మాత్రం పీహెచ్సీ స్థాయిలోనే. అధికారుల నిర్లక్ష్యంతో నిధులున్నా వినియోగించని దుస్థితి. అనారోగ్యంతో ఈ ఆసుపత్రికి వస్తే నరకం చూడాల్సిందే. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్న అధికారుల మాటలకు చేతలకు పొంతన లేదు. ఏడాది క్రితం సమావేశమైన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఆ తర్వాత జాడ లేదు. గత సమావేశంలో ఆమోదించిన అంశాలను గాలికొదిలేశారు. తీర్మానించిన అంశాలు గత ఏడాది నవంబర్ 17వ తేదీన ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశమైంది. ఇందులో ఆర్డీఓ ఓబులేసు, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ లింగన్న హాజరై పలు అంశాలపై తీర్మానం చేశారు. ఆధార్ బేసిక్ బయోమెట్రిక్ మిషన్ కొనుగోలు, కంప్యూటర్ కొనుగోలు, మైనర్ రిపేర్లు, ప్రత్యేక రూములకు డ్రైనేజ్ మెరుగు, సీసీ రోడ్లు నిర్మాణం, మురికి కాల్వల మరమ్మతులు చేయాలని తీర్మానించారు. కాగా రెండు ఏసీలు, కంప్యూటర్ కొనుగోలు, రెండు వార్డులలో జాలరీ మాత్రమే ఏర్పాటు చేసి చేతులెత్తేశారు. మురుగుతున్న రూ.42 లక్షలు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులు రూ.30 లక్షలు, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ పథకం కింద రూ.12 లక్షలు మొత్తం 42 లక్షలు నిధులు బ్యాంకుల ఖాతాల్లో మురుగుతున్నాయి. భవిష్యత్‌లో ఆడిట్ ఇబ్బందులు ఎదురవుతా యని భావించి ఆసుపత్రి అధికారులు పనులు చేయిం చ లేకపోతున్నారు. ఉన్నతాధికారులకు పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలు కావడంతో ఆసుపత్రి అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆసుపత్రిని వేధిస్తున్న సమస్యలు ♦ ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట కంకర తేలిన రోడ్డుపై నడవ లేని పరిస్థితి ఏర్పడింది. ♦ 108 సిబ్బందికి గది లేక పోవడంతో ఆసుపత్రి ఆవరణలో సేద తీరుతున్నారు. ♦ మురుగు కాల్వలు అధ్వానంగా ఉన్నాయి. ♦ మహిళల, పిల్లల, పురుషుల మెడికల్ వార్డుల్లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. తప్పని పరిస్థి తుల్లో రోగులు వినియోగించుకుంటున్నారు. ♦ నీట సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ♦ సింటెక్స్ ట్యాంక్‌లు నిత్యం నిండుతూ గోడలన్నీ తడిసి బీటలువారాయి. ♦ ఆసుపత్రిలోని పది స్పెషల్ గదుల్లో నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన ఆరు గదులకు డ్రైనేజ్, నీటి సరఫరా లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. ♦ కిటికీలకు అద్దాలు, జాలరీ లేకపోవడంతో దోమలతో రోగులు జాగారం. ♦ ఆసుపత్రి ఆవరణలో ఎక్కడా పచ్చదనం కనిపించడం లేదు. ♦ దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థతో వేలాడుతున్న తీగలు భయపెడుతున్నాయి. ♦ మంచాలపై పరుపులకు రెగ్జిన్ లేవు. ♦ ఐవీ స్టాండ్లు, విండో కర్టన్స్ లేక వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. -
సార్.. నేను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను...
ఆదోని: సర్, నేను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయింది. దానిపై ఉన్న నెంబర్లు చెబితే అన్‌లాక్ చేస్తాం అని ఓ అఘంతకుడు ఫోన్ చేయగానే పట్టణంలోని సంతపేటకు చెందిన రిటైర్డ్ టీచర్ ఆరీఫుల్లా వెనకాముందు ఆలోచించకుండా ఏటీఎం కార్డుపై ఉన్న నంబరును చెప్పేశారు. 20నిమిషాల వ్యవధిలో రూ.41,900, 47,900 మొత్తం రూ.96,800 అరీఫుల్లా బ్యాంక్ అకౌంట్ నుంచి డ్రా అయ్యాయి. అయితే తన అకౌంట్ నుంచి రెండు విడతల్లో మొత్తం రూ.96,800 డ్రా అయినట్లు గురువారం తన సెల్‌ఫోన్‌కు మెస్సేజ్ రావడంతో ఆరీఫుల్లా అవాక్కయ్యారు. వెంటనే తన అకౌంట్ ఉన్న స్టేట్ బ్యాంక్‌కు వెళ్ళి విచారించారు. సదరుమొత్తం బెంగుళూరులోని ఓ ఏటీఎం నుంచి డ్రా అయినట్లు మేనేజర్ తెలిపారు. దిక్కు తోచని రిటైర్డ్ టీచర్ వన్ టౌన్ పోలీసుల వద్దకు వెళ్ళి తన గోడు వెళ్ళబోసుకున్నారు. గుర్తు తెలియని అఘంతకులు ఫోన్ చేసి అడిగితే ఏటీఎం నంబరు ఎలా చెప్పారంటూ ఎస్ఐ రామయ్య అడిగిన ప్రశ్నకు బాధితుడి నోట మాట రాలేదు. అగంతకులు ఎలా మోసాలకు పాల్పడుతున్నారో పత్రికలు, టీవీల్లో విస్తృతంగా కథనాలు వస్తున్నా అమాయకులు బలవుతూనే ఉన్నారని చెప్పేందుకు అరీఫుల్లా తాజా ఉదాహరణ. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 420ఛీటింగ్, 66సి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ రామయ్య తెలిపారు. రెండు విడతల్లో డ్రా అయిన మొత్తం ఫ్లిప్‌కాట్, అమెజాన్ సంస్థల బ్యాంక్ అకౌంట్లకు జమ అయినట్లు బెంగుళూరులో ఉన్న అరీఫుల్లా బంధువుల ద్వారా తెలిసిందని, అఘంతకులు ఆ రెండు సంస్థల్లో పలు వస్తువులు కొనుగోలు చేసి అరీఫుల్లా ఏటీఎం కార్డును దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోందని ఎస్ఐ రామయ్య అన్నారు. వస్తువులు ఇంకా సంబంధిత వ్యక్తులకు పంపలేదని, ఆ రెండు సంస్థల ద్వారా అగంతకులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చెప్పారు. -
కర్నూలు జిల్లాలో హత్య : పాత కక్షలే కారణం!
-
కలల గలగలలు పారేనా?
ఆదోని, న్యూస్‌లైన్: తుంగభద్ర దిగువ కాలువ.. జిల్లా పశ్చిమ ప్రాంత రైతుల వరప్రదాయిని. అయితే ఆధునికీకరణ పనుల్లో అంతులేని జాప్యం కారణంగా ప్రతీ ఏటా నీటి వాటా కోల్పోవాల్సి వస్తోంది. ఈ ఏడాదీ అదే పరిస్థితి నెలకొంది. దీంతో కాలువ బాగు పడేదెన్నడో, బీడు భూమలు పచ్చని పైరుతో కళకళలాడేదెన్నడోనని రైతులు దిగాలు చెందుతున్నారు. జిల్లాలో ఆదోని, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1.51 లక్షల ఎకరాలకు తుంగభద్ర దిగువ కాలువ నీరు అందాల్సి ఉంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా నిర్వహణను గాలి కొదిలేయడంతో కాలువ లైనింగ్, గట్టు బాగా దెబ్బతింది. బలహీనంగా మారిన గట్టుకు ఎక్కడ పడితే అక్కడ గండ్లు పడుతున్నాయి. దీంతో నీటి సరఫరాలో తీవ్ర అంతరాయం చోటు చేసుకుంటోంది. దీనికి తోడు కర్ణాటకలో రాష్ట్ర వాటా నీటిని పెద్ద ఎత్తున మళ్లించుకుంటున్నారు. ఫలితంగా ఏటా 4 నుంచి 6 టీఎంసీల నీటిని జిల్లా ప్రజలు నష్టపోతున్నారు. ఒక టీఎంసీ నీటితో పది వేల ఎకరాల్లో ఆరు తడి పంటలు సాగు చేయవచ్చు. ఏటా దాదాపు 60 వేల ఎకరాలకు సరిపోయే నీటిని రైతుల నష్టపోవాల్సి వస్తోంది. దీంతో ఏటా 40 నుంచి 60 వేల ఎకరాలకు మించి సాగు నీరు అందడం లేదు. సాగు అవుతున్న భూములకు కూడా కీలకమైన సమయంలో నీటి కొరత ఏర్పడి ఎంతో మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాగు నీరు అందక ఏటా లక్షా పది వేల నుంచి 90 వేల ఎకరాలలో రైతులు వర్షాధార పంటలు సాగు చేసుకోవాల్సి వస్తోంది. వర్షాలు సక్రమంగా కరువక పంటలు చేతిక అందక అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. సా..గుతున్న పనులు రైతుల కన్నీటిని తుడిచేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008లో కాలువ ఆధునీకరణకు రూ.175 కోట్లు మంజూరు చేశారు. సాగు నీటి శాఖ అధికారులు.. ఆధునీకరణ పనులను 18 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిచిచారు. పనులు పూర్తి చేసేందుకు రెండేళ్లు గడువు పెట్టారు. ఇప్పటికి ఆరేళ్లు కావస్తుండగా 18 ప్యాకేజీల్లో 3ఈ, 3బి, 3సి, 3డి, 7 మాత్రం పూర్తి అయ్యాయి. కాలువకు గత మార్చి నాలుగో వారంతో నీటి సరఫరా నిలిపివేశారు. నీటి సరఫరా నిలిపి వేసిన తరువాత 1సి, 3ఎ, 6సి, 4బి మాత్రం ప్రారంభం అయ్యాయి. మిగిలిన తొమ్మిది ప్యాకేజీలలో ఇంకా పనులు ప్రారంభం కాలేదు. జూలై రెండో వారంలో కాలువకు నీటి సరఫరాను పునరుద్ధరిస్తారు. ఆ లోగా పనులు పూర్తి చేయాల్సి ఉంది. నెలన్నర రోజులలో కాంట్రాక్టర్లు యంత్రాలు, నిర్మాణ సామగ్రిని తరలించుకుని పనులు పూర్తి చేయడం సాధ్యమయ్యే అవకాశాలు లేవని రైతులు పేర్కొంటున్నారు. జాప్యానికి కారణాలు ఇవే.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత కారణంగా ఆధునికీకరణ పనులు నత్తనడకను తలపించాయి. గడువును పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఆ మేరకు నిధులు విడుదల చేయాలి. అయితే అవసరం అయిన నిధుల్లో సగం కూడా విడుదల కావడం లేదు. దాదాపు మూడేళ్లుగా అత్యంత కీలకమైన ఈఈ పోస్టు ఖాళీగా ఉంది. దీనికి తోడు కాంట్రాక్టర్లు కూడా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మార్చి చివరి వారం నుంచి జూలై రెండో వారం వరకు కాలువలో నీటి సరఫరా ఉండదు. ఆ సమయంలో పనులు నిరాటంకంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆ దిశగా పనులు జరిగిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ ఏడాది మార్చి నాలుగో వారంలో నీటి సరఫరా నిలిపి వేయగా ఇంకా 9 ప్యాకేజీలలో పనులు ప్రారంభం కాకపోవడమే ఇందుకు నిదర్శనం. నీటి సరఫరా నిలిచిపోయిన వెంటనే పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. ఆ దిశగా ఇటు అధికారులు, అటు కాంట్రాక్టర్లు దృష్టి సారించక పోవడం దిగువ కాలువ రైతులకు శాపం అవుతోంది. అన్ని ప్యాకేజీల్లో పనులు ప్రారంభిస్తాం: భాస్కర్‌రెడ్డి, ఇన్చార్జ్ ఈఈ ఇప్పటికే నాలుగు ప్యాకేజీల్లో పనులు ప్రారంభం అయ్యాయి. మిగిలిన ప్యాకేజీల్లో పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నాం. ఒక ప్యాకేజీలో సాంకేతిక సమస్య ఉంది. ఈ ఏడాది పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాం. వేసవిలో కూడా మధ్యలో తాగునీటి కోసం కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పనులకు ఆటంకం ఏర్పడుతోంది. -
అడ్డు తొలగించుకున్నారు!
ఆదోని శివారులోని సాదాపురం గ్రామ సమీపంలో మంగళవారం కనిపించిన దృశ్యాలు క్రైం సినిమాను తలపించాయి. వందలాది జనం.. పదుల సంఖ్యలో పోలీసులు.. అధికారులూ జతకలిశారు. సంకెళ్లు వేసిన వ్యక్తిని పోలీసులు తీసుకెళ్తుండగా.. ఏమి జరిగిందో తెలియని ఉత్కంఠ. చుట్టూ ముళ్ల కంపలు.. మధ్యలో ఎండిపోయిన వాగు.. అందరూ గుమికూడారు. ఆ ప్రాంతంలో తవ్వగా వ్యక్తి మృతదేహం బయటపడింది. అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. అక్క మొగుడు(బావ) మోజులో భర్తను భార్యే హత్య చేయించిన ఉదంతం బాధిత కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. పెళ్లికి ముందు కలిగి ఉన్న వివాహేతర సంబంధంతోనే పథకం ప్రకారం ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు విచారణలో వెల్లడైంది. ఆదోని టౌన్, న్యూస్‌లైన్: ఆస్పరికి చెందిన మునిరాజు(23) ఈనెల 9వ తేదీన అదృశ్యం కాగా.. 19 రోజుల తర్వాత శవమై కనిపించాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు మిస్టరీని ఛేదించారు. మునిరాజుకు మూడేళ్ల క్రితం పత్తికొండకు చెందిన భారతితో వివాహమైంది. ఆ తర్వాత ఏడాదికే వీరు స్థానికంగానే వేరు కాపురం పెట్టి వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. భారతి అక్క తిరుపతమ్మ ఆస్పరి సమీపంలోని మొలగవళ్లిలో ఉంటోంది. ఈమె భర్త వేమన్న ఆటో డ్రైవర్. అతనితో భారతికి పెళ్లికి ముందే వివాహేతర సంబంధం ఉంది. దీంతో అప్పుడప్పుడు ఆస్పరిలోని మరదలు ఇంటికి వచ్చివెళ్లేవాడు. చివరకు వీరిద్దరూ మునిరాజును వదిలించుకునేందుకు నిర్ణయించుకున్నారు. జీవనోపాధికి కొద్ది రోజుల క్రితం మునిరాజు భార్యతో కలసి గుంటూరు వెళ్లాడు. ఇటీవల తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సమయంలో వేమన్న, భారతి కలసి మునిరాజు హత్యకు కుట్ర పన్నారు. ఆటో ఫైనాన్స్ కంపెనీకి రూ. 10 వేలు కంతు కట్టాలని మునిరాజును అప్పు ఇవ్వాలని వేమన్న కోరాడు. ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో ఈనెల 9న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇద్దరూ కలసి డబ్బు కట్టేందుకు ఆటోలో ఆదోనికి బయలుదేరారు. అప్పటికే ఆటోలో మద్యం, బిర్యానీ సిద్ధంగా ఉంచడంతో మద్యం సేవించేందుకు మార్గమధ్యంలో సాదాపురం బస్టాప్ చేరువలోని ఏడు మోరీల వాగు వద్దకు వెళ్లారు. ఈ సమయంలో మునిరాజుకు మద్యాన్ని అధికంగా తాపి, వేమన్న ఎక్కువగా తాగినట్లు నటించా డు. ఆ తర్వాత మునిరాజును వాగు గట్టుపై నుంచి కిందకు తోసేయడంతో మృతి చెందాడు. అక్కడి నుంచి వేమన్న ఇంటికి చేరుకుని గడ్డపార, సలికె తీసుకుని హత్య చేసిన ప్రాంతానికి తిరిగి వెళ్లాడు. వాగు మధ్యలోనే గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చి పైన బండ రాళ్లు వేసి ఏమి తెలియనట్లు ఇంటికి చేరుకున్నాడు. మలుపులు తిరిగిన విచారణ: 9వ తేదీ రాత్రి పొద్దుపోయినా మునిరాజు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు, అన్న హనుమన్న స్నేహితులను విచారించినా ఫలితం లేకపోయింది. 11వ తేదీ ఆస్పరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటికే భారతితో వేమన్నకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుసుకున్న పోలీసలు వారిని అనుమానించారు. ఆ దిశగా విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న వేమన్న కేసు నుంచి తప్పించుకునేందుకు ఈనెల 21వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు నటించి చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. 24వ తేదీన డిశ్చార్జ్ అయిన వేమన్నను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. అయితే విచారణలో తనకేమీ తెలియదని చెప్పాడు. దీంతో వేమన్నను పోలీసులు ఇంటికి పంపారు. చివరకు భారతి, వేమన్న సెల్ఫోన్ల కాల్ డేటా ఆధారంగా కూపీ లాగారు. విచారణ చివరి దశకు వస్తున్న సమయంలో వేమన్న సోమవారం ఆస్పరి వీఆర్ఓ సుధాకర్ ఎదుట లొంగిపోయి మునిరాజును హత్య చేసినట్లు అంగీకరించాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలానికి తీసుకెళ్లారు. ఆదోని తహశీల్దార్ అన్వర్ హుసేన్, ఫోరెన్సిక్ నిపుణులు ప్రభాకర్ సమక్షంలో తానే హత్యచేసి శవాన్ని పూడ్చిపెట్టినట్లు అంగీకరించడంతో తహశీల్దార్ రికార్డు చేశారు. అనంతరం శవానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఆలూరు సీఐ శంకర్, ఆస్పరి ఎస్ఐ లక్ష్మీ నారాయణ తెలిపారు. మునిరాజు హత్యకేసులో వేమన్న ఒక్కడే చేశాడా, ఇతరులు ఎవరైనా సాయం చేశా రా అనే కోణాల్లో కేసు విచారిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఐదు నెలల క్రితం భారతి గుంతకల్లు ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చిందని, అయితే మునిరాజు పోలికలతో నల్లగా ఉండటంతో భారతి, వేమన్న శిశువు గొంతునులిమి చంపినట్లు బంధువులు ఆరోపిస్తున్నారని తెలి పారు. హత్య కేసు విచారణ చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, ప్రజలు పెద్ద ఎత్తున సాదాపురం చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి తల్లి సుంకమ్మ రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. భారతిని పోలీ సులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
అమ్మబోతే.. అవస్థలే
ఆదోని, న్యూస్‌లైన్: ఆయిల్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో వేరుశనగ దిగుబడులను అమ్ముకునేందుకు రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. జిల్లాలో నాలుగు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటి వరకు కర్నూలు, ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులకే పరిమితమయ్యాయి. ఎమ్మిగనూరులో హమాలీల సమస్య అడ్డంకిగా మారింది. ఆలూరులో కొనుగోలు కేంద్రం ఊసే కరువైంది. ప్రారంభమైన రెండు కేంద్రాల్లోనూ సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ కారణంగా కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో వేరుశనగ 1.30 లక్షల హెక్టార్లలో సాగయింది. అయితే సకాలంలో వర్షాలు కురవకపోవడం, తెగుళ్ల కారణంగా దిగుబడులు బాగా తగ్గిపోయాయి. ఎకరాకు ఐదారు బస్తాల దిగుబడి కూడా చేతికందని పరిస్థితి. అరకొర దిగుబడులకు మార్కెట్లోనూ ఆశించిన ధర పలుకకపోవడం రైతులను నిరాశపరుస్తోంది. నాణ్యతను బట్టి క్వింటాలు ధర రూ.2309 నుంచి రూ.3580 మించలేదు. అప్పులు, ఇతర ఆర్థిక అవసరాల కారణంగా గిట్టుబాటు ధర లేకపోయినా రైతులు నష్టాలకే దిగుబడులను తెగనమ్ముకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ పూర్తయి దాదాపు రెండు నెలలైంది. అప్పులోళ్ల ఒత్తిళ్లు, ఆర్థిక అవసరాలతో ఇప్పటికే దాదాపు 70 శాతం రైతులు తమ దిగుబడులను అమ్ముకున్నట్లు అంచనా. ప్రభుత్వం క్వింటాలు రూ.4 వేల ధరతో కొనుగోలుకు ముందుకొచ్చినా.. ఇప్పటికే దిగుబడులను అమ్మేసుకున్న 70 శాతం రైతులకు లబ్ధి చేకూరు పరిస్థితి కరువైంది. ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం పట్ల రైతుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదోని, కర్నూలులో ఈ నెల 10న కేంద్రాలు ప్రారంభం కాగా శుక్రవారం వరకు ఆదోనిలో 2526 క్వింటాళ్లు, కర్నూలులో దాదాపు 3వేలు క్వింటాళ్లు మాత్రం ఆయిల్‌ఫెడ్ అధికారులు కొనుగోలు చేశారు. మందకొడిగా కొనుగోళ్లు: కేంద్రాల్లో వేరుశనగ కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ఒకే అధికారి శ్యాంపిళ్లను పరిశీలించి కొనుగోలుపై నిర్ణయం తీసుకోవడంతో పాటు బిల్లులు, తూకాలు చూసుకోవాల్సి వస్తోంది. విధిలేని పరిస్థితుల్లో తూకాలకు వ్యవసాయ కూలీలను నియమించారు. వీరికి సరైన అవగాహన లేక తూకాలు నిదానమవుతుండటంతో రైతులు రెండు మూడు రోజులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ నెల చివరి వరకే కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత రైతులు మళ్లీ మార్కెట్లనే ఆశ్రయించాల్సి ఉంది. ఈ దృష్ట్యా కొనుగోలు కేంద్రాలను మరికొంత కాలం నిర్వహించాలని.. అదేవిధంగా అదనపు సిబ్బందిని నియమించాలని రైతులు కోరుతున్నారు. మూడో రోజు అమ్ముకున్నాను: ఆయిల్‌ఫెడ్ కేంద్రంలో అమ్ముకోవడానికి మూడు రోజులు నిరీక్షించాల్సి వచ్చింది. ముఖ్యంగా హమాలీల కొరత ఉంది. ఉన్న వారికి తూకాలు వేయడం, సంచుల్లో నింపడం తెలియడం లేదు. ప్రభుత్వం రైతులకు మేలు చేకూర్చడం మరుస్తోంది. కేశవరెడ్డి, వేరు శనగ రైతు, పత్తికొండ మూడింట రెండొంతులు అమ్ముకున్నారు: మా గ్రామంలో ఇప్పటికే మూడింట రెండొంతుల మంది రైతులు దిగుబడులు అమ్మేసుకున్నారు. సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లయితే అందరికీ లబ్ధి కలిగేది. ఇప్పుడు ఏర్పాటు చేయడం కంటితుడుపు చర్యే. వీరభద్రుడు, రైతు, ఎద్దులదొడ్డి -
గమ్యం చేరని ప్రయాణం
కుమారుడి పెళ్లి చేయాలనే కోరిక తీరకుండానే తండ్రి కన్నుమూశాడు. తమ్ముడు ఓ ఇంటి వాడైతే చూడాలనే ఆశ నెరవేరకనే అక్క తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. పెళ్లి చూపులకు వెళ్లి వస్తున్న ఓ కుటుంబానికి రైలు ప్రమాదం తీరని విషాదం మిగిల్చింది. ఇంకాసేపట్లో ఇంటికి చేరుకుంటారని భావిస్తున్న తరుణంలో ఆ ప్రయాణం అర్ధాంతరంగా ‘ముగిసింది’. అనంతపురం జిల్లా కొత్తచెర్వు రైల్వేస్టేషన్లో రైలు బోగీ దగ్ధమైన ప్రమాదంలో జిల్లావాసులు ఇరువురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు మృత్యుముఖం నుంచి తృటిలో బయటపడ్డారు. ఆదోని, న్యూస్‌లైన్: పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు హెచ్.కె.బసవరాజు పెద్ద కుమారుడు ప్రసన్న బెంగళూరులోని రైల్వేలైట్స్ సంస్థలో సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఎంసీఏ పూర్తి చేసిన చిన్న కుమారుడు నిరంజన్ అతని వద్దే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రసన్నను ఓ ఇంటి వాడిని చేసే ఉద్దేశంతో బసవరాజు మూడు రోజుల క్రితం భార్య అన్నపూర్ణ, కూతురు సర్వమంగళ, అల్లుడు శరణబసవతో కలిసి బెంగళూరుకు చేరుకున్నారు. శుక్రవారం అక్కడే పెళ్లి సంబంధం చూసి.. మరోసారి కలిసి పెళ్లి సంబంధం ఖరారు చేసుకుంటామని చెప్పివచ్చారు. ఆ తర్వాత ఆదోనికి బయలుదేరేందుకు రాత్రి 10.30 గంటలకు నాందేడ్ చేరుకొని యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలు కొంతదూరం ప్రయాణించిన తర్వాత నిద్రలోకి జారుకున్నారు. అందరూ గాఢ నిద్రలో ఉండగా తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అనంతపురం జిల్లా కొత్తచెరువు రైల్వేస్టేషన్ సమీపంలో ఒక్కసారిగా కలకలం రేగింది. బోగీలో ఎగిసిపడుతున్న మంటలు.. అరుపులు.. కేకలతో బోగీలోని వాతావరణం బీభత్సంగా మారింది. ఊహించని మంటల్లో బసవరాజు(65), ఈయన కూతురు సర్వమంగళ(30) మంటల్లో చిక్కుకుని ప్రాణాలొదిలారు. తేరుకున్న భార్య అన్నపూర్ణ, అల్లుడు శరణబసవలు మరుగుదొడ్డి కిటికీ నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డారు. బసవరాజు ఆదోని మండలంలోని విరుపాపురం జిల్లా పరిషత్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తూ ఆరేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. ఈయన పట్టణంలోని కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాల ప్రాజెక్ట్ ఆఫీసర్‌గానూ పనిచేశారు. కూతురు సర్వమంగళ ప్రస్తుతం కౌతాళంలోని మండల పరిషత్ కన్నడ పాఠశాలలో ఎస్జీ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈమె భర్త శరణబసవ ఆదోని మండల పరిధిలోని పెద్దతుంబళం మండల పరిషత్ పాఠశాలల్లో ఎస్జీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శరణ బసవ కుటుంబం, బసవరాజు కుటుంబం ఆదోని పట్టణంలోని ఆస్పరి రోడ్డులో ఉన్న టీచర్స్ కాలనీలో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. భర్త, కూతురిని కోల్పోయిన అన్నపూర్ణ నిశ్చేష్టురాలైంది. ఇప్పటికీ తేరుకోలేకపోతున్నా బెంగళూరులో బంధువు పెళ్లికి హాజరై యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణమయ్యాను. రాత్రి 2.45 గంటల సమయంలో మెలకువ వచ్చింది. కాసేపటికి మళ్లీ నిద్రలోకి జారుకునేందుకు యత్నిస్తుండగా.. 3 గంటల సమయంలో ఒక్కసారిగా అరుపులు కేకలతో బోగీ దద్దరిల్లింది. తేరుకుని చూస్తే మంటలు చుట్టుముడుతున్నాయి. రెండు వైపునకు పరుగెత్తుకు వెళ్లి కిందకు దిగేశాను. సెల్‌ఫోను, లగేజీని బోగీలోనే వదిలేశాను. నా బెర్త్ నెం.35 కాగా.. ప్రయాణికులు అడిగితే ఆర్ఏసీ దిగువ బెర్త్‌లో పడుకున్నాను. ఈ కారణంతోనే వెంటనే బోగీ నుంచి బయటపడగలిగాను. కిందకు దిగి బోగీ వైపునకు చూస్తే ఒళ్లంతా వణుకు పుట్టింది. క్షణాల్లో బోగీ అంతా మంటల్లో కాలిపోయింది. ఇప్పటికీ ఆ ఘటన నుంచి తేరుకోలేకపోతున్నా. నా భార్య కూడా రైలులో రావాల్సి ఉన్నా.. ప్రయాణం వాయిదా పడింది. మెలకువ రాకపోయినా.. బెర్త్ మారకపోయినా ఏమి జరిగేదో తలుచుకుంటేనే భయమేస్తోంది. కటిక చీకటిలో దాదాపు కిలోమీటరు దూరం నడిచి రైల్వే క్రాసింగ్ గేటు వద్ద ఆటోలో అనంతపురం.. అక్కడి నుంచి ఆదోనికి చేరుకున్నా. - ఎం.అనిల్‌కుమార్, కాటన్ మర్చంట్, ఆదోని కళ్లెదుటే కాలిపోయారు నేను, అత్త అన్నపూర్ణ మరుగుదొడ్డి కిటికీలో నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాం. రైలు పుట్టపర్తి సమీపంలోని సొరంగం దాటి కొత్త చెరువు రైల్వేస్టేషన్ చేరుకుంటుండగా ఓ మహిళ బోగీకి మంటలు అంటుకున్నాయంటూ కేకలు వేసింది. మేల్కొన్న తాను సమీపంలో ఉన్న అత్త అన్నపూర్ణను లేపుతూనే బోగీ కిటికీలు పగులగొట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వెంటనే మరుగుదొడ్డిలోకి వెళ్లి కిటికీ అద్దం తొలగించి అత్తను అందులో నుంచి బయటకు తోసేశాను. మరికొందరు అక్కడికి చేరుకోవడంతో దాదాపు 20 మందిని బయటకు తోస్తూనే భార్య, మామ కోసం గట్టిగా కేకలు వేసినా వారు స్పందించలేదు. చివరకు మంటలు చుట్టుముడుతుండటంతో నేనూ బయటకు దూకేశాను. నాలుగు నెలల గర్భంతో ఉన్న నా భార్య, మామ మంటల్లో కళ్లెదుటే కాలి బూడిదయ్యారు. - ఫోన్లో ‘న్యూస్‌లైన్’తో శరణబసవ -
నాణ్యత.. ‘నారాయణ’కే ఎరుక!
ఆదోని, న్యూస్‌లైన్: తుంగభద్ర దిగువ కాల్వ అక్రమార్కులకు కల్ప వృక్షమైంది. జిల్లా పశ్చిమ ప్రాంతాలతో పాటు బళ్లారి జిల్లాలోని బీడు భూములను సస్యశ్యామలం చేసే ఎల్లెల్సీలో అవినీతి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నాలుగు రోజుల క్రితం మోకా గ్రామం సమీపంలో కాల్వకు పడిన గండిని పూడ్చి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సీసీ లైనింగ్ జరిగిన స్థలంలోనే గండి పడి వేల క్యూసెక్కుల నీరు వృథా అయింది. ఇందుకు బాధ్యులు అవినీతి కాంట్రాక్టరా, పర్యవేక్షించాల్సిన అధికారులదా తెలియలేదు. పర్సెంటేజీలు తీసుకున్న ఉన్నతాధికారులు గండికి కారకులైన వారిపై చర్యలు తీసుకునేందుకు సాహసిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్ర, కర్ణాటక ఉమ్మడి రాష్ట్రాల ప్రాజెక్ట్ కావడంతో దిగువ కాలువ అభివృద్ధి, నిర్వహణకు అవసరమైన నిధులను రెండు రాష్ట్రాలు సమకూర్చుతున్నాయి. అయితే రాజకీయ జోక్యం, అధికారులు, కాంట్రాక్టర్ల స్వార్థం కారణంగా ప్రజా ధనం ఏటా రూ.కోట్లలో దుర్వినియోగం అవుతోంది. 50 శాతంకు పైగా నిధులు స్వార్థపరుల జేబుల్లోకి వెళ్తున్నట్లు అంచనా. కాంట్రాక్టర్లు నీటిని విడుదల చేసే సమయంలో పనులను తూతూ మంత్రంగా చేస్తుండగా, అధికారులు నీటి విడుదల పూర్తయిన తరువాత పనులను పరిశీలించకుండానే అధికారులు బిల్లులు చెలిస్తున్నారు. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఇదంతా జరుగుతుందనేది బహిరంగ రహస్యం. ప్రస్తుతం 120వ కిలో మీటరు వద్ద పడిన గండి సంఘటనపై విచారించి నాణ్యతా లోపమే ఇందుకు కారణమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి రంగారెడ్డి ప్రకటించారు. అయితే గతంలో కూడా పలువురు అధికారులు ఇలాంటి ప్రకటనలు చేసినా ఇంత వరకు ఒక్కరిపై కూడా చర్యలు లేవు. దీంతో కారయదర్శి చేసిన ప్రకటన కూడా వాస్తవ రూపం దాల్చక పోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే బాధ్యతలు చేపట్టడంతో కాల్వ స్వార్థపరులకు ఎంత పట్టు ఉందో తెలియక కార్యదర్శి స్పందించి ఉండొచ్చని భావిస్తున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటారని తుంగభద్ర బోర్డు బళ్లారి ఈఈ నారాయణ నాయక్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ‘దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన పనులలో నాణ్యత ఉందా లేదా?అని ఇప్పుడు ఎలా చెప్పగలమని అన్నారు. సీసీ లైనింగ్ జరిగిన చోట గండి పడకూడదని ఎలా అనుకోగలం’ ఆయన కాంట్రాక్టర్లను వెనకేసుకొచ్చారు.