గమ్యం చేరని ప్రయాణం | Included travel destination | Sakshi
Sakshi News home page

గమ్యం చేరని ప్రయాణం

Published Sun, Dec 29 2013 5:08 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

Included travel destination

 కుమారుడి పెళ్లి చేయాలనే కోరిక తీరకుండానే తండ్రి కన్నుమూశాడు. తమ్ముడు ఓ ఇంటి వాడైతే చూడాలనే ఆశ నెరవేరకనే అక్క తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. పెళ్లి చూపులకు వెళ్లి వస్తున్న ఓ కుటుంబానికి రైలు ప్రమాదం తీరని విషాదం మిగిల్చింది. ఇంకాసేపట్లో ఇంటికి చేరుకుంటారని భావిస్తున్న తరుణంలో ఆ ప్రయాణం అర్ధాంతరంగా ‘ముగిసింది’. అనంతపురం జిల్లా కొత్తచెర్వు రైల్వేస్టేషన్‌లో రైలు బోగీ దగ్ధమైన ప్రమాదంలో జిల్లావాసులు ఇరువురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు మృత్యుముఖం నుంచి తృటిలో బయటపడ్డారు.
 
 ఆదోని, న్యూస్‌లైన్: పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు హెచ్.కె.బసవరాజు పెద్ద కుమారుడు ప్రసన్న బెంగళూరులోని రైల్వేలైట్స్ సంస్థలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఎంసీఏ పూర్తి చేసిన చిన్న కుమారుడు నిరంజన్ అతని వద్దే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రసన్నను ఓ ఇంటి వాడిని చేసే ఉద్దేశంతో బసవరాజు మూడు రోజుల క్రితం భార్య అన్నపూర్ణ, కూతురు సర్వమంగళ, అల్లుడు శరణబసవతో కలిసి బెంగళూరుకు చేరుకున్నారు. శుక్రవారం అక్కడే పెళ్లి సంబంధం చూసి.. మరోసారి కలిసి పెళ్లి సంబంధం ఖరారు చేసుకుంటామని చెప్పివచ్చారు.
 
 ఆ తర్వాత ఆదోనికి బయలుదేరేందుకు రాత్రి 10.30 గంటలకు నాందేడ్ చేరుకొని యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలు కొంతదూరం ప్రయాణించిన తర్వాత నిద్రలోకి జారుకున్నారు. అందరూ గాఢ నిద్రలో ఉండగా తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అనంతపురం జిల్లా కొత్తచెరువు రైల్వేస్టేషన్ సమీపంలో ఒక్కసారిగా కలకలం రేగింది. బోగీలో ఎగిసిపడుతున్న మంటలు.. అరుపులు.. కేకలతో బోగీలోని వాతావరణం బీభత్సంగా మారింది. ఊహించని మంటల్లో బసవరాజు(65), ఈయన కూతురు సర్వమంగళ(30) మంటల్లో చిక్కుకుని ప్రాణాలొదిలారు.
 
 తేరుకున్న భార్య అన్నపూర్ణ, అల్లుడు శరణబసవలు మరుగుదొడ్డి కిటికీ నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డారు. బసవరాజు ఆదోని మండలంలోని విరుపాపురం జిల్లా పరిషత్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తూ ఆరేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. ఈయన పట్టణంలోని కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాల ప్రాజెక్ట్ ఆఫీసర్‌గానూ పనిచేశారు. కూతురు సర్వమంగళ ప్రస్తుతం కౌతాళంలోని మండల పరిషత్ కన్నడ పాఠశాలలో ఎస్జీ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈమె భర్త శరణబసవ ఆదోని మండల పరిధిలోని పెద్దతుంబళం మండల పరిషత్ పాఠశాలల్లో ఎస్జీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శరణ బసవ కుటుంబం, బసవరాజు కుటుంబం ఆదోని పట్టణంలోని ఆస్పరి రోడ్డులో ఉన్న టీచర్స్ కాలనీలో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. భర్త, కూతురిని కోల్పోయిన అన్నపూర్ణ నిశ్చేష్టురాలైంది.
 
 ఇప్పటికీ
 తేరుకోలేకపోతున్నా
 బెంగళూరులో బంధువు పెళ్లికి హాజరై యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణమయ్యాను. రాత్రి 2.45 గంటల సమయంలో మెలకువ వచ్చింది. కాసేపటికి మళ్లీ నిద్రలోకి జారుకునేందుకు యత్నిస్తుండగా.. 3 గంటల సమయంలో ఒక్కసారిగా అరుపులు కేకలతో బోగీ దద్దరిల్లింది. తేరుకుని చూస్తే మంటలు చుట్టుముడుతున్నాయి. రెండు వైపునకు పరుగెత్తుకు వెళ్లి కిందకు దిగేశాను.

 సెల్‌ఫోను, లగేజీని బోగీలోనే వదిలేశాను. నా బెర్త్ నెం.35 కాగా.. ప్రయాణికులు అడిగితే ఆర్‌ఏసీ దిగువ బెర్త్‌లో పడుకున్నాను. ఈ కారణంతోనే వెంటనే బోగీ నుంచి బయటపడగలిగాను. కిందకు దిగి బోగీ వైపునకు చూస్తే ఒళ్లంతా వణుకు పుట్టింది. క్షణాల్లో బోగీ అంతా మంటల్లో కాలిపోయింది. ఇప్పటికీ ఆ ఘటన నుంచి తేరుకోలేకపోతున్నా. నా భార్య కూడా రైలులో రావాల్సి ఉన్నా.. ప్రయాణం వాయిదా పడింది. మెలకువ రాకపోయినా.. బెర్త్ మారకపోయినా ఏమి జరిగేదో తలుచుకుంటేనే భయమేస్తోంది. కటిక చీకటిలో దాదాపు కిలోమీటరు దూరం నడిచి రైల్వే క్రాసింగ్ గేటు వద్ద ఆటోలో అనంతపురం.. అక్కడి నుంచి ఆదోనికి చేరుకున్నా.
 - ఎం.అనిల్‌కుమార్,
 కాటన్ మర్చంట్, ఆదోని
 
 
 కళ్లెదుటే కాలిపోయారు
 నేను, అత్త అన్నపూర్ణ మరుగుదొడ్డి కిటికీలో నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాం. రైలు పుట్టపర్తి సమీపంలోని సొరంగం దాటి కొత్త చెరువు రైల్వేస్టేషన్ చేరుకుంటుండగా ఓ మహిళ బోగీకి మంటలు అంటుకున్నాయంటూ కేకలు వేసింది. మేల్కొన్న తాను సమీపంలో ఉన్న అత్త అన్నపూర్ణను లేపుతూనే బోగీ కిటికీలు పగులగొట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వెంటనే మరుగుదొడ్డిలోకి వెళ్లి కిటికీ అద్దం తొలగించి అత్తను అందులో నుంచి బయటకు తోసేశాను. మరికొందరు అక్కడికి చేరుకోవడంతో దాదాపు 20 మందిని బయటకు తోస్తూనే భార్య, మామ కోసం గట్టిగా కేకలు వేసినా వారు స్పందించలేదు. చివరకు మంటలు చుట్టుముడుతుండటంతో నేనూ బయటకు దూకేశాను. నాలుగు నెలల గర్భంతో ఉన్న నా భార్య, మామ మంటల్లో కళ్లెదుటే కాలి బూడిదయ్యారు.
 - ఫోన్‌లో ‘న్యూస్‌లైన్’తో శరణబసవ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement