‘వీర’ అనంతపురం ప్లాంటు... | AP govt to allocate 120 acres to Veera Vahana Udyog bus manufacturing plant | Sakshi
Sakshi News home page

‘వీర’ అనంతపురం ప్లాంటు...

Published Sat, Nov 23 2019 3:21 AM | Last Updated on Sat, Nov 23 2019 3:21 AM

AP govt to allocate 120 acres to Veera Vahana Udyog bus manufacturing plant - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బస్సుల తయారీలో ఉన్న బెంగళూరు కంపెనీ వీర వాహన ఉద్యోగ్‌ అనంతపురంలో నెలకొల్పనున్న ప్లాంటు 2021 మే నాటికి సిద్ధం కానుంది. గుడిపల్లి వద్ద కంపెనీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 120 ఎకరాల స్థలం కేటాయించింది. నిర్మాణ పనులు ప్రారంభించామని వీర వాహన ఉద్యోగ్‌ ఎండీ కె.శ్రీనివాస్‌ రెడ్డి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ఏటా 3,000 బస్‌ల తయారీ సామర్థ్యంతో రానున్న ఈ కేంద్రానికి తొలి దశలో రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ప్రత్యక్షంగా 3,000, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. తొలి దశ పూర్తి కాగానే రూ.300 కోట్లతో రెండో దశకు శ్రీకారం చుడతామన్నారు. తద్వారా మరో 1,000 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.  

బ్యాటరీ మన్నిక 20 ఏళ్లు..: విమానాశ్రయాల్లో వినియోగించే టార్మాక్‌ ఎలక్ట్రిక్‌ కోచ్‌లను అనంతçపురం ప్లాంటులో తొలుత తయా రు చేస్తారు. బస్సులో 100 మంది ప్రయాణిం చొచ్చు. 100 కిలోవాట్‌ అవర్‌ సామర్థ్యంగల బ్యాటరీలను పొందుపరుస్తారు. ఒకసారి చార్జింగ్‌ చేస్తే  50 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అలాగే 38 సీట్ల (65 మంది ప్రయాణించే) కెపాసిటీగల ఎలక్ట్రిక్‌ సిటీ బస్‌లను రూపొందించనున్నారు. వీటికి 120 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ వాడతారు. ఒకసారి చార్జింగ్‌తో 80–100 కి.మీ. ప్రయాణిస్తుంది. 15 నిముషాల్లోనే చార్జింగ్‌ పూర్తవడం ఈ  బ్యాటరీల ప్రత్యేకత.

ఏటా 10,000 బస్సులు..
భవిష్యత్తులో ఇక్కడ 12–18 సీట్లు ఉండే చిన్న ఎలక్ట్రిక్‌ బస్‌లనూ తయారు చేస్తామని శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు. ‘ఏటా 10,000 యూనిట్లు ఉత్పత్తి చేస్తాం. ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీకి పెద్ద పీట వేస్తాం. డీజిల్, హైబ్రిడ్‌ మోడళ్లనూ రూపొందిస్తాం. అనంత ప్లాంటు సమీపంలో అనుబంధ పరిశ్రమలూ వస్తాయి.  బెంగళూరు ప్లాంటు నుంచి ఏటా 1,000కిపైగా బస్సులు రోడ్డెక్కుతున్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ వినియోగిస్తున్న టార్మాక్‌ బస్‌లన్నీ వీర బ్రాండ్‌వే. ఈ ఏడాది 50 బస్సులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. దేశంలో ల్యాడర్‌ ఫ్రేమ్, మోనోకాక్, స్పేస్‌ ఫ్రేమ్‌ బస్‌లను తయారు చేస్తున్న ఏకైక కంపెనీ మాదే’ అని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement