Bus Manufacturing Company
-
‘వీర’ అనంతపురం ప్లాంటు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బస్సుల తయారీలో ఉన్న బెంగళూరు కంపెనీ వీర వాహన ఉద్యోగ్ అనంతపురంలో నెలకొల్పనున్న ప్లాంటు 2021 మే నాటికి సిద్ధం కానుంది. గుడిపల్లి వద్ద కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 120 ఎకరాల స్థలం కేటాయించింది. నిర్మాణ పనులు ప్రారంభించామని వీర వాహన ఉద్యోగ్ ఎండీ కె.శ్రీనివాస్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఏటా 3,000 బస్‌ల తయారీ సామర్థ్యంతో రానున్న ఈ కేంద్రానికి తొలి దశలో రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ప్రత్యక్షంగా 3,000, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. తొలి దశ పూర్తి కాగానే రూ.300 కోట్లతో రెండో దశకు శ్రీకారం చుడతామన్నారు. తద్వారా మరో 1,000 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. బ్యాటరీ మన్నిక 20 ఏళ్లు..: విమానాశ్రయాల్లో వినియోగించే టార్మాక్ ఎలక్ట్రిక్ కోచ్‌లను అనంతçపురం ప్లాంటులో తొలుత తయా రు చేస్తారు. బస్సులో 100 మంది ప్రయాణిం చొచ్చు. 100 కిలోవాట్ అవర్ సామర్థ్యంగల బ్యాటరీలను పొందుపరుస్తారు. ఒకసారి చార్జింగ్ చేస్తే 50 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అలాగే 38 సీట్ల (65 మంది ప్రయాణించే) కెపాసిటీగల ఎలక్ట్రిక్ సిటీ బస్‌లను రూపొందించనున్నారు. వీటికి 120 కిలోవాట్ అవర్ బ్యాటరీ వాడతారు. ఒకసారి చార్జింగ్‌తో 80–100 కి.మీ. ప్రయాణిస్తుంది. 15 నిముషాల్లోనే చార్జింగ్ పూర్తవడం ఈ బ్యాటరీల ప్రత్యేకత. ఏటా 10,000 బస్సులు.. భవిష్యత్తులో ఇక్కడ 12–18 సీట్లు ఉండే చిన్న ఎలక్ట్రిక్ బస్లనూ తయారు చేస్తామని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ‘ఏటా 10,000 యూనిట్లు ఉత్పత్తి చేస్తాం. ఎలక్ట్రిక్ బస్సుల తయారీకి పెద్ద పీట వేస్తాం. డీజిల్, హైబ్రిడ్ మోడళ్లనూ రూపొందిస్తాం. అనంత ప్లాంటు సమీపంలో అనుబంధ పరిశ్రమలూ వస్తాయి. బెంగళూరు ప్లాంటు నుంచి ఏటా 1,000కిపైగా బస్సులు రోడ్డెక్కుతున్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్ వినియోగిస్తున్న టార్మాక్ బస్‌లన్నీ వీర బ్రాండ్‌వే. ఈ ఏడాది 50 బస్సులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. దేశంలో ల్యాడర్ ఫ్రేమ్, మోనోకాక్, స్పేస్ ఫ్రేమ్ బస్‌లను తయారు చేస్తున్న ఏకైక కంపెనీ మాదే’ అని వివరించారు. -
పలు మార్గాల్లో ఏసీ బస్సులు
- ఆర్ఎఫ్పీలను ఆహ్వానించిన ఎమ్మెమ్మార్డీయే - తొలుత కుర్లా, బాంద్రా, సైన్ ప్రాంతాల మధ్య.. - 25 బస్సుల బాధ్యతలను అప్పగించాలని నిర్ణయం - వివిధ బస్సు తయారీ కంపెనీలకు లేఖ సాక్షి, ముంబై: ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటి (ఎమ్మెమ్మార్డీఏ) పలు మార్గాల మధ్య ఏసీ బస్సులను నడిపేందుకు యోచిస్తోంది. ఏసీ బస్సులను కొనుగోలు చేసి నిర్వహణ బాధ్యతలు చూసుకోవాల్సిందిగా ఎమ్మెమ్మార్డీఏ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)ను ఆహ్వానించింది. ఈ బస్సులను బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) మధ్యలో అదేవిధంగా కుర్లా, బాంద్రా, సైన్ ప్రాంతాల మధ్య వీలైనంత త్వరగా నడిపేందుకు యోచిస్తోంది. ఎమ్మెమ్మార్డీఏ అధికారి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంతాల మధ్య రోజు ఉద్యోగ రీత్యా ప్రయాణించే వారికి మరింత మెరుగైన కనెక్టివిటీ ఇచ్చేందుకు ఈ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. అయితే 10 ఏళ్ల కోసం వివిధ నమూనాలు గల 25 బస్సులను ఈ మార్గాల మధ్య నడిపేందుకు పరిశీలిస్తున్నామని చెప్పారు. దీంతో తాము అర్హత గల ఆర్ఎఫ్పీలను ఆహ్వానించామన్నారు. పేరొందిన జాతీయ అంతర్జాతీయ బస్సు ఉత్పత్తి దారుల నుంచి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. గతేడాది ఎమ్మెమ్మార్డీఏ టాటా మోటార్స్, వోల్వోలకు ఈ బస్సుల కొనుగోలు నిర్వహణ విషయమై ఓ లేఖ రాసింది. అయితే వీరి నుంచి స్పందన కరువవడంతో ఎమ్మెమ్మార్డీ ఆర్ఎఫ్పీని ఆహ్వానించేందుకు నిర్ణయించింది. బెస్ట్ అయితే బాంద్రా, కుర్లా, సైన్ల మధ్య కనెక్టివిటి సక్రమంగా లేకపోవడంతో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయనీ ఎమ్మెమ్మార్డీఏ అధికారి ఒకరు తెలిపారు. ఈ మార్గాల మధ్య సరైన కనెక్టివిటీ లేకపోవడంతో ఆటోలు, ట్యాక్సీలకు అధిక మొత్తంలో వెచ్చించాల్సి వస్తోందన్నారు. ప్రయాణికులు బస్సు ద్వారా బీకేసీ వెళ్లాలంటే సమీప బస్టాపుకు కనీసం కిలో మీటర్ మేర నడవాల్సి వస్తోందని, వారికార్యాలయాలు మెయిన్ రోడ్ నుంచి చాలా దూరంలో ఉన్నాయయని చెప్పారు. దీంతో ప్రయాణికుల నుంచి డిమాండ్లు వెలువెత్తుతుండడంతో ఏసీ బస్సులను నడిపేందుకు యోచిస్తున్నామని అధికారి వెల్లడించారు. ఇదిలా వుండగా, 2012లో బీకేసీ మధ్య కనెక్టివిటీపెంచేందుకు దాదాపు 15 నుంచి 20 బస్సులను బెస్ట్‌కు అందజేసేందుకు ఎమ్మెమ్మార్డీఏ నిర్ణయించింది. అయితే ఈ బస్సులను నడిపేందుకు రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్లు వరకు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ బస్సుల చార్జీలు బెస్ట్ బస్సుల కంటే కూడా తక్కువగా ఉండేలా చూసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. అయితే అలా చేస్తే నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.