K srinivas reddy
-
సీఎం జగన్ హామీ : 5 లక్షల పరిహారం
సాక్షి, అమరావతి : ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా దేశంలో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. వీరిలో మరీ ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు, వైద్యులు, పోలీసులతో పాటు జర్నలిస్ట్‌లు ఎక్కువగా ఉన్నారు. వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు వీరంతా తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ఈ నేపథ్యంలో కరోనా క్లిష్ట సమయంలోనూ ముందుండి వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. వైరస్‌పై పోరులో మరణించిన ప్రతి జర్నలిస్ట్‌కు రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు కే శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని మంగళవారం మీడియా ముందు వెల్లడించారు. (ఉచిత విద్యుత్‌కు కొత్త ఎనర్జీ) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలో కరోనా వల్ల అనేక మంది చనిపోతున్నారు. దీనిలో జర్నలిస్టులు కూడా మృత్యువాత పడ్డారు.వార్తా సేకరణ క్రమంలో అందరూ ముందుండి నడిచారు. ప్రధాని కూడా జర్నలిస్ట్ లు కరోనా వారియర్స్ అని చెప్పారు. జర్నలిస్టులను ప్రభుత్వాలు కూడా సహకారం ఇవ్వాలి. 50 లక్షలు బీమా ఇవ్వాలని కోరుతున్నాం. ఏపీలో 38 మంది జర్నలిస్టులు మృతి చెందారు. వారిని ఆదుకోవాలని ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. 38 మంది చనిపోయారని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు 5 లక్షలు ఇస్తానని సీఎం హామీ ఇచ్చారు. చికిత్స తీసుకునే వారికి కూడా ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు చేశారు. సీఎంకు, దీనికి సహకరించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని కే శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ..‘ కోవిడ్ వల్ల చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం జగన్ ముందుకు రావడం మంచి పరిణామం. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాము. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. యూనియన్లు కేంద్రం ప్రకటించిన 50 లక్షల బీమాను డిమాండ్ చేస్తున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల వెనుక ఉండి ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని నిరూపితమైంది. భవిష్యత్తులో కూడా సీఎం జగన్ జర్నలిస్టుల వెనుక ఉంటారనే నమ్మకం ఉంది’ అని అన్నారు. -
‘వీర’ అనంతపురం ప్లాంటు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బస్సుల తయారీలో ఉన్న బెంగళూరు కంపెనీ వీర వాహన ఉద్యోగ్ అనంతపురంలో నెలకొల్పనున్న ప్లాంటు 2021 మే నాటికి సిద్ధం కానుంది. గుడిపల్లి వద్ద కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 120 ఎకరాల స్థలం కేటాయించింది. నిర్మాణ పనులు ప్రారంభించామని వీర వాహన ఉద్యోగ్ ఎండీ కె.శ్రీనివాస్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఏటా 3,000 బస్‌ల తయారీ సామర్థ్యంతో రానున్న ఈ కేంద్రానికి తొలి దశలో రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ప్రత్యక్షంగా 3,000, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. తొలి దశ పూర్తి కాగానే రూ.300 కోట్లతో రెండో దశకు శ్రీకారం చుడతామన్నారు. తద్వారా మరో 1,000 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. బ్యాటరీ మన్నిక 20 ఏళ్లు..: విమానాశ్రయాల్లో వినియోగించే టార్మాక్ ఎలక్ట్రిక్ కోచ్‌లను అనంతçపురం ప్లాంటులో తొలుత తయా రు చేస్తారు. బస్సులో 100 మంది ప్రయాణిం చొచ్చు. 100 కిలోవాట్ అవర్ సామర్థ్యంగల బ్యాటరీలను పొందుపరుస్తారు. ఒకసారి చార్జింగ్ చేస్తే 50 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అలాగే 38 సీట్ల (65 మంది ప్రయాణించే) కెపాసిటీగల ఎలక్ట్రిక్ సిటీ బస్‌లను రూపొందించనున్నారు. వీటికి 120 కిలోవాట్ అవర్ బ్యాటరీ వాడతారు. ఒకసారి చార్జింగ్‌తో 80–100 కి.మీ. ప్రయాణిస్తుంది. 15 నిముషాల్లోనే చార్జింగ్ పూర్తవడం ఈ బ్యాటరీల ప్రత్యేకత. ఏటా 10,000 బస్సులు.. భవిష్యత్తులో ఇక్కడ 12–18 సీట్లు ఉండే చిన్న ఎలక్ట్రిక్ బస్లనూ తయారు చేస్తామని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ‘ఏటా 10,000 యూనిట్లు ఉత్పత్తి చేస్తాం. ఎలక్ట్రిక్ బస్సుల తయారీకి పెద్ద పీట వేస్తాం. డీజిల్, హైబ్రిడ్ మోడళ్లనూ రూపొందిస్తాం. అనంత ప్లాంటు సమీపంలో అనుబంధ పరిశ్రమలూ వస్తాయి. బెంగళూరు ప్లాంటు నుంచి ఏటా 1,000కిపైగా బస్సులు రోడ్డెక్కుతున్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్ వినియోగిస్తున్న టార్మాక్ బస్‌లన్నీ వీర బ్రాండ్‌వే. ఈ ఏడాది 50 బస్సులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. దేశంలో ల్యాడర్ ఫ్రేమ్, మోనోకాక్, స్పేస్ ఫ్రేమ్ బస్‌లను తయారు చేస్తున్న ఏకైక కంపెనీ మాదే’ అని వివరించారు. -
ఐజేయూ అధ్యక్షుడిగా కె.శ్రీనివాస్‌రెడ్డి ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడిగా ప్రజాపక్షం తెలుగు దినపత్రిక ఎడిటర్ కె.శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఐజేయూ అధ్యక్షుడిగా ఉన్న దేవులపల్లి అమర్ ఇటీవల ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుగా నియమితులైన నేపథ్యంలో అధ్యక్ష పదవికి రాజీ నామా చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఐజే యూ జాతీయ కార్యవర్గ కమిటీ అత్యవసర సమా వేశం అమర్ రాజీనామాను ఆమోదించింది. తర్వాత ఎన్నికలో ఐజేయూ అధ్యక్షుడిగా కె.శ్రీనివాస్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌గా బల్విందర్ సింగ్ (జమ్మూ) ఎన్నికయ్యారు. బల్విందర్ సింగ్ పంజాబ్ ట్రిబ్యూన్ స్పెషల్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. -
శ్రీవారికి రూ. 2 కోట్ల విరాళం ఇచ్చిన భక్తుడు
తిరుమల : కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారికి భూరి విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించి ఓ భక్తుడు ఆ దేవదేవుని పట్ల తన భక్తి ప్రపత్తులు చాటుకున్నాడు. బెంగుళూరుకు చెందిన కన్స్ట్రక్షన్ బిజినెస్ అధినేత కొండా శ్రీనివాసరెడ్డి రూ. 2 కోట్ల చెక్కును శుక్రవారం టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తికి తిరుమలలో అందజేశారు. ఈ మొత్తం నగదు మొత్తాన్ని వెయ్యి కాళ్ల మండపానికి వినియోగించాలని శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా చదలవాడ కృష్ణమూర్తిని కోరారు. అనంతరం శ్రీనివాసరెడ్డితోపాటు ఆయన కుటుంబసభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
తెలంగాణలో 70 శాతం సమైక్యమే: శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణలో 70 శాతం మంది సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని, అయితే, దాడులకు భయపడి వారు తమ గళాన్ని నొక్కిపెట్టుకుంటున్నారని విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ మహాసభ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాపార్కు వద్ద గురువారం చేపట్టిన ఒక రోజు దీక్షలో శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. టీ ఉద్యమం పేరుతో జరుపుతున్న దాడులకు భయపడి తెలంగాణలోని చాలా మంది సమైక్య వాదులు బయటకు రావడం లేదన్నారు. తెలంగాణ కోరుకోవడమంటే మళ్లీ ఫ్యూడల్ వ్యవస్థకు ప్రాణం పోయడమేనని దుయ్యబట్టారు. ఈ దీక్షలో తెలంగాణకు చెందిన పలువురు సమైక్య వాదులు, తెలుగు ప్రజా వేదిక అధ్యక్షుడు ఆంజనేయరెడ్డి, నాయకురాలు కాదాసి రాణిలు పాల్గొన్నారు.