అదనపు కట్న దాహానికి వివాహిత బలి | Anantapur woman suicide in bangalore over dowry harassment | Sakshi
Sakshi News home page

డాడీ..క్షమించు! అంటూ చివరి మెసేజ్‌

Published Tue, Jan 17 2017 9:34 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM

అదనపు కట్న దాహానికి వివాహిత బలి - Sakshi

అదనపు కట్న దాహానికి వివాహిత బలి

‘అనంత’ యువతి బెంగళూరులో ఆత్మహత్య
డాడీ..క్షమించు! అంటూ తండ్రికి చివరి మెసేజ్‌
అత్తింటి వేధింపులు తాళలేక ఆత‍్మహత‍్య
ఆత్మహత్యకు ప్రేరిపించిన పరిస్థితులు, వ్యక్తుల వివరాలు
  పోలీసులు, లాయర్, బంధువులకు పంపిన వైనం


అనంతపురం : 
తల్లిదండ్రులు : ఒక్కగానొక్క కూతురు. అమ్మాయి సంతోషంగా ఉండడమే మాకు కావాల్సిందని భావించారు. పెళ్లి సమయంలో రూ. కోటి రూపాయల నగదు. కేజీ బంగారం కట్నంగా ఇచ్చారు. అంతటితో ఆగకలేదు. కూతురిపై ఉన్న మకకారంతో రూ. లక్షలు విలువ చేసే 35 సెంట్ల భూమిని కూతురి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు.

భర్త : రెండేళ్లు పాటు ప్రేమించి చివరకు పెద్దోళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత రెన్నెళ్ల నుంచే వేధించడం ప్రారంభించాడు.

అత్త,మామలు : అదనపు కట్నం తీసుకొస్తేనే ఇంటికిరా. లేదంటే రావొద్దు. శూన్యమాసానికి ఊరికి  వెళ్తున్నావు. మీ అమ్మ,నాన్నలను ఒప్పించి డబ్బులు తీసుకురా. లేదంటే శాశ్వతంగా నీకు శూన్యమాసమే.

పోలీసులు : వరకట్న వేధింపులు, బెదిరింపుల కేసులో భర్త, అత్త, మామలతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నెలలు తరబడి చార్జ్‌షీట్‌ వేయలేదు. చివరకు చార్జ్‌షీట్‌ వేసినా కనీస విచారణ చేయలేదు.

బంధువులు : భార్య,భర్తను కలిపి కాపురాన్ని నిలబెట్టాల్సి పోయి. వారిమధ్య  మరింత ఆజ్యం పోశారు. భర్త తరుఫున వకల్తా పుచ్చుకుని భార్య ఆమె అమ్మానాన్నలే తప్పు చేసినట్లు సమాజంలో ప్రచారం చేశారు.
    
ఈ పరిస్థితుల మధ్య తనకు న్యాయం జరగదని, కట్టుకున్న భర్త, ఆత్తమామలు పెద్దోళ్లతో కలిసి తన తల్లిదండ్రులను ఎక్కడ ఇబ్బందులు పెడతారోనన్న భయంతో ఆ కూతురు ఆత్మహత్మకు పాల్పడింది. ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలు, వ్యక్తుల వివరాలను నేరుగా పోలీసులు, లాయర్, బంధువుల సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు పంపింది. తండ్రికి మాత్రం ‘నాన్నా...నన్ను క్షమించు’ అంటూ చివరి మెసేజ్‌ పెట్టింది. వివరాల్లోకి వెళ్తే...యల్లనూరు మండలం వెన్నపూసపల్లికి చెందిన సూర్యప్రతాప్‌రెడ్డి, రేవతి దంపతులకు ఒక కుమారుడు, కూతురు. వీరి కుటుంబం ప్రస్తుతం అనంతపురం నగరం కోవూర్‌నగర్‌లో నివాసం ఉంటోంది. కూతురు జాస్నవిరెడ్డి చెన్నైలో టెక్‌మైండ్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది.

ప్రేమించిన యువకుడితో పెళ్లి
బంధువుల అబ్బాయి విద్యాసాగర్‌రెడ్డి జాస్నవిరెడ్డిని సన్నిహితంగా తిరిగేవాడు. రెండేళ్ల పాటు ప్రేమిస్తున్నాని వెంటపడి అమ్మాయిని ఒప్పించాడు. ఈ క్రమంలో విద్యాసాగర్‌రెడ్డి బంధువులు అమ్మాయి తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారు. ఒక్కగానొక్క కూతురి సంతోషం కోసం కాదనలేక 2015 మార్చి 12న అంగరంగవైభవంగా పెళ్లి చేశారు. పది రోజులకే జాస్నవిరెడ్డితో ఉద్యోగం మానిపించిన భర్త హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. 2015 మేలో శూన్యమాసమని కోడలిని పుట్టింటికి పంపారు.

రూ. రెండు కోట్లు, ఇన్నోవా కారు కావాలని...
పుట్టింటికి వచ్చిన జాస్నవిరెడ్డితో భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు. వ్యాపారం చేసుకునేందుకు రూ. రెండు కోట్లు, ఇన్నోవా కారు కావాలంటూ బలవంతం చేయసాగారు. ఈ క్రమంలో అమ్మాయి తల్లిదండ్రులు పలువురి వద్ద పంచాయితీ చేయించినా లాభం లేదు. చివరకు పోలీసులను ఆశ్రయించారు. మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కలిపేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో నెలల గడిచిన తర్వాత భర్త, వారి బంధువులు 8 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అంతే పక్కన పట్టేశారు. ఈ క్రమంలో అమ్మాయి బంధువులు డీఐజీని కలిసి జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఈ క్రమంలో నిందితులపై చార్జ్‌షీటు దాఖలు చేశారు. ఈ క్రమంలో పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు ఈనెల 11న వచ్చిన ఇరు వర్గాల వారితో మాట్లాడారు. కాపురానికి తీసుకెళ్లమని, విడాకులూ ఇవ్వమని విద్యాసాగర్‌రెడ్డి, బంధువులు తెగేసి చెప్పారు.

అందరికీ మెసేజ్‌లు పంపి...
అయితే అప్పటికే బెంగళూరులో ఉంటున్న జాస్నవిరెడ్డి 11వ తేదీ జరిగిన పంచాయితీ వివరాలను తండ్రికి ఫోన్‌ చేసి అడిగింది. జరిగన విషయం చెప్పిన తండ్రి ఏం కాదులేమ్మా...నేనున్నాంటూ ధైర్యం నింపాడు. ఇంత జరిగినా తమకు న్యాయం జరిగేలా లేదని, తన తల్లిదండ్రులకు ఎక్కడ ఇబ్బందులు తెచ్చిపెడతారోనని భావించిన జాస్నవిరెడ్డి ఈనెల 15న తెల్లవారుజామున రూములో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ముందుగా పోలీసులు, లాయర్, బంధువులకు పలు వివరాలు వెల్లడిస్తూ రికార్డ్‌వాయిస్‌ పంపింది.

5.30 గంటల సమయంలో తండ్రి సూర్యప్రతాప్‌రెడ్డి సెల్‌ఫోన్‌కు ఫోన్‌ చేసి ‘డాడీ క్షమించు’ అంటూ మెసేజ్‌ పంపింది. 6 గంటల సమయంలో మహిళా పోలీస్‌స్టేషన్‌ నుంచి సూర్యప్రతాప్‌రెడ్డికి ఫోన్‌ వచ్చింది. మీపాప ఆత్మహత్య చేసుకున్నట్లు మెసేజ్‌ పంపిందని వెల్లడించారు. నిర్ఘాంతపోయిన ఆయన కూతురి ఫోన్‌కు కాల్‌చేస్తే రిసీవ్‌ చేసుకోలేదు. వెంటనే కారు తీసుకుని బెంగళూరుకు బయలుదేరారు. వెళ్లి చూడగా కూతురు విగతజీవిగా పడి ఉంది. అక్కడి పోలీసులు 304–బీ కేసు నమోదుచేశారు. సోమవారం సాయంత్రం అనంతపురం నగరానికి జాస్నవిరెడ్డి శవాన్ని తీసుకొచ్చారు. అనంతరం ఇక్కడి నుంచి సొంతూరు వెన్నపూసపల్లికి తీసుకెళ్లి ఖననం చేశారు. ఇదిలాఉండగా నగరంలోని సూర్యప్రతాప్‌రెడ్డి ఇంటివద్ద పదుల సంఖ్యలో ఎస్‌బీ పోలీసులు చేరుకుని వివరాలు ఆరా తీయడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement