
ఆదోని ఆసుపత్రి
ఆదోని టౌన్: జిల్లా పశ్చిమ ప్రాంతంలోని దాదాపు 15 లక్షల మందికి ఆదోని ప్రభుత్వ ఏరియా రెఫరల్ ఆసుపత్రి పెద్ద దిక్కు. పేరుకు మాత్రమే వంద పడకల వైద్యశాల.. సౌకర్యాలు మాత్రం పీహెచ్‌సీ స్థాయిలోనే. అధికారుల నిర్లక్ష్యంతో నిధులున్నా వినియోగించని దుస్థితి. అనారోగ్యంతో ఈ ఆసుపత్రికి వస్తే నరకం చూడాల్సిందే. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్న అధికారుల మాటలకు చేతలకు పొంతన లేదు. ఏడాది క్రితం సమావేశమైన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఆ తర్వాత జాడ లేదు. గత సమావేశంలో ఆమోదించిన అంశాలను గాలికొదిలేశారు.
తీర్మానించిన అంశాలు
గత ఏడాది నవంబర్ 17వ తేదీన ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశమైంది. ఇందులో ఆర్డీఓ ఓబులేసు, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ లింగన్న హాజరై పలు అంశాలపై తీర్మానం చేశారు. ఆధార్ బేసిక్ బయోమెట్రిక్ మిషన్ కొనుగోలు, కంప్యూటర్ కొనుగోలు, మైనర్ రిపేర్లు, ప్రత్యేక రూములకు డ్రైనేజ్ మెరుగు, సీసీ రోడ్లు నిర్మాణం, మురికి కాల్వల మరమ్మతులు చేయాలని తీర్మానించారు. కాగా రెండు ఏసీలు, కంప్యూటర్ కొనుగోలు, రెండు వార్డులలో జాలరీ మాత్రమే ఏర్పాటు చేసి చేతులెత్తేశారు.
మురుగుతున్న రూ.42 లక్షలు
ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులు రూ.30 లక్షలు, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ పథకం కింద రూ.12 లక్షలు మొత్తం 42 లక్షలు నిధులు బ్యాంకుల ఖాతాల్లో మురుగుతున్నాయి. భవిష్యత్‌లో ఆడిట్ ఇబ్బందులు ఎదురవుతా యని భావించి ఆసుపత్రి అధికారులు పనులు చేయిం చ లేకపోతున్నారు. ఉన్నతాధికారులకు పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలు కావడంతో ఆసుపత్రి అభివృద్ధికి నోచుకోవడం లేదు.
ఆసుపత్రిని వేధిస్తున్న సమస్యలు
♦ ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట కంకర తేలిన రోడ్డుపై నడవ లేని పరిస్థితి ఏర్పడింది.
♦ 108 సిబ్బందికి గది లేక పోవడంతో ఆసుపత్రి ఆవరణలో సేద తీరుతున్నారు.
♦ మురుగు కాల్వలు అధ్వానంగా ఉన్నాయి.
♦ మహిళల, పిల్లల, పురుషుల మెడికల్ వార్డుల్లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. తప్పని పరిస్థి తుల్లో రోగులు వినియోగించుకుంటున్నారు.
♦ నీట సరఫరా అస్తవ్యస్తంగా మారింది.
♦ సింటెక్స్ ట్యాంక్‌లు నిత్యం నిండుతూ గోడలన్నీ తడిసి బీటలువారాయి.
♦ ఆసుపత్రిలోని పది స్పెషల్ గదుల్లో నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన ఆరు గదులకు డ్రైనేజ్, నీటి సరఫరా లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి.
♦ కిటికీలకు అద్దాలు, జాలరీ లేకపోవడంతో దోమలతో రోగులు జాగారం.
♦ ఆసుపత్రి ఆవరణలో ఎక్కడా పచ్చదనం కనిపించడం లేదు.
♦ దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థతో వేలాడుతున్న తీగలు భయపెడుతున్నాయి.
♦ మంచాలపై పరుపులకు రెగ్జిన్ లేవు.
♦ ఐవీ స్టాండ్‌లు, విండో కర్టన్స్ లేక వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment