ఆదోని, న్యూస్‌లైన్: తుంగభద్ర దిగువ కాలువ.. జిల్లా పశ్చిమ ప్రాంత రైతుల వరప్రదాయిని. అయితే ఆధునికీకరణ పనుల్లో అంతులేని జాప్యం కారణంగా ప్రతీ ఏటా నీటి వాటా కోల్పోవాల్సి వస్తోంది.
ఈ ఏడాదీ అదే పరిస్థితి నెలకొంది. దీంతో కాలువ బాగు పడేదెన్నడో, బీడు భూమలు పచ్చని పైరుతో కళకళలాడేదెన్నడోనని రైతులు దిగాలు చెందుతున్నారు. జిల్లాలో ఆదోని, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1.51 లక్షల ఎకరాలకు తుంగభద్ర దిగువ కాలువ నీరు అందాల్సి ఉంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా నిర్వహణను గాలి కొదిలేయడంతో కాలువ లైనింగ్, గట్టు బాగా దెబ్బతింది. బలహీనంగా మారిన గట్టుకు ఎక్కడ పడితే అక్కడ గండ్లు పడుతున్నాయి. దీంతో నీటి సరఫరాలో తీవ్ర అంతరాయం చోటు చేసుకుంటోంది. దీనికి తోడు కర్ణాటకలో రాష్ట్ర వాటా నీటిని పెద్ద ఎత్తున మళ్లించుకుంటున్నారు.
ఫలితంగా ఏటా 4 నుంచి 6 టీఎంసీల నీటిని జిల్లా ప్రజలు నష్టపోతున్నారు. ఒక టీఎంసీ నీటితో పది వేల ఎకరాల్లో ఆరు తడి పంటలు సాగు చేయవచ్చు. ఏటా దాదాపు 60 వేల ఎకరాలకు సరిపోయే నీటిని రైతుల నష్టపోవాల్సి వస్తోంది. దీంతో ఏటా 40 నుంచి 60 వేల ఎకరాలకు మించి సాగు నీరు అందడం లేదు. సాగు అవుతున్న భూములకు కూడా కీలకమైన సమయంలో నీటి కొరత ఏర్పడి ఎంతో మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాగు నీరు అందక ఏటా లక్షా పది వేల నుంచి 90 వేల ఎకరాలలో రైతులు వర్షాధార పంటలు సాగు చేసుకోవాల్సి వస్తోంది. వర్షాలు సక్రమంగా కరువక పంటలు చేతిక అందక అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
సా..గుతున్న పనులు
రైతుల కన్నీటిని తుడిచేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008లో కాలువ ఆధునీకరణకు రూ.175 కోట్లు మంజూరు చేశారు. సాగు నీటి శాఖ అధికారులు.. ఆధునీకరణ పనులను 18 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిచిచారు. పనులు పూర్తి చేసేందుకు రెండేళ్లు గడువు పెట్టారు. ఇప్పటికి ఆరేళ్లు కావస్తుండగా 18 ప్యాకేజీల్లో 3ఈ, 3బి, 3సి, 3డి, 7 మాత్రం పూర్తి అయ్యాయి. కాలువకు గత మార్చి నాలుగో వారంతో నీటి సరఫరా నిలిపివేశారు. నీటి సరఫరా నిలిపి వేసిన తరువాత 1సి, 3ఎ, 6సి, 4బి మాత్రం ప్రారంభం అయ్యాయి. మిగిలిన తొమ్మిది ప్యాకేజీలలో ఇంకా పనులు ప్రారంభం కాలేదు. జూలై రెండో వారంలో కాలువకు నీటి సరఫరాను పునరుద్ధరిస్తారు. ఆ లోగా పనులు పూర్తి చేయాల్సి ఉంది. నెలన్నర రోజులలో కాంట్రాక్టర్లు యంత్రాలు, నిర్మాణ సామగ్రిని తరలించుకుని పనులు పూర్తి చేయడం సాధ్యమయ్యే అవకాశాలు లేవని రైతులు పేర్కొంటున్నారు.
జాప్యానికి కారణాలు ఇవే..
గత ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత కారణంగా ఆధునికీకరణ పనులు నత్తనడకను తలపించాయి. గడువును పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఆ మేరకు నిధులు విడుదల చేయాలి. అయితే అవసరం అయిన నిధుల్లో సగం కూడా విడుదల కావడం లేదు. దాదాపు మూడేళ్లుగా అత్యంత కీలకమైన ఈఈ పోస్టు ఖాళీగా ఉంది. దీనికి తోడు కాంట్రాక్టర్లు కూడా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మార్చి చివరి వారం నుంచి జూలై రెండో వారం వరకు కాలువలో నీటి సరఫరా ఉండదు. ఆ సమయంలో పనులు నిరాటంకంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఆ దిశగా పనులు జరిగిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ ఏడాది మార్చి నాలుగో వారంలో నీటి సరఫరా నిలిపి వేయగా ఇంకా 9 ప్యాకేజీలలో పనులు ప్రారంభం కాకపోవడమే ఇందుకు నిదర్శనం. నీటి సరఫరా నిలిచిపోయిన వెంటనే పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. ఆ దిశగా ఇటు అధికారులు, అటు కాంట్రాక్టర్లు దృష్టి సారించక పోవడం దిగువ కాలువ రైతులకు శాపం అవుతోంది.
అన్ని ప్యాకేజీల్లో పనులు ప్రారంభిస్తాం: భాస్కర్‌రెడ్డి, ఇన్‌చార్జ్ ఈఈ
ఇప్పటికే నాలుగు ప్యాకేజీల్లో పనులు ప్రారంభం అయ్యాయి. మిగిలిన ప్యాకేజీల్లో పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నాం. ఒక ప్యాకేజీలో సాంకేతిక సమస్య ఉంది. ఈ ఏడాది పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాం. వేసవిలో కూడా మధ్యలో తాగునీటి కోసం కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పనులకు ఆటంకం ఏర్పడుతోంది.
కలల గలగలలు పారేనా?
Published Sun, May 25 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM
Advertisement
Advertisement