Thugabadhra project
-
మేల్కోకపోతే కడగండ్లే
కరువుకు నిలయంగా ఉన్న అనంతపురం జిల్లా ప్రజల సాగు, తాగు నీటి కష్టాలు తీర్చడానికి తుంగభద్ర జలాశయం ఒక్కటే శరణ్యం. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో పేరుకుపోయిన పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం 133 టీఎంసీల నుంచి 103 టీఎంసీలకు పడిపోయింది. నీటి వినియోగం కూడా 230 నుంచి 170 టీఎంసీలకు పడిపోయింది. మొత్తం మీద నీటి నిల్వ సామర్థ్యంలో 33 టీఎంసీలు, వినియోగంలో 60 టీఎంసీలు తగ్గిపోయింది. దీంతో దామాషా ప్రకారం కాలువలకు రావాల్సిన నీటి కోటాలో కోత విధిస్తున్నారు. ఫలితంగా అనంతపురం జిల్లాకు కేటాయింపులు తగ్గిపోయి సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ప్రతి ఏటా వరదలు వచ్చినపుడు తుంగభద్ర జలాశయం నిండిపోయి వందలాది టీఎంసీల నీరు వృధాగా వెళ్లిపోతోంది. ఈ ఏడాది ఇప్పటికే 70 టీఎంసీల నీరు దిగువకు వెళ్లిపోయింది. ఈ నీటిని వాడుకునే విధంగా వరద కాలువ (ఫ్లడ్ ఫ్లో కెనాల్) నిర్మాణం జరగాలని గతంలో పలుమార్లు బళ్లారి, అనంతపురం జిల్లాల ఇరిగేషన్ అధికారులు భేటీ అయ్యి చర్చలు జరిపారు. ఎలాంటి ఫలితం రావడం లేదు. అధికారులు కాకుండా ఇరు ప్రభుత్వాల సీఎంలు భేటీ అయి చర్చిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇందుకు బళ్లారి, అనంతపురం జిల్లా ప్రజలు, ప్రజా సంఘాలు ప్రజాప్రతినిధుల ఒత్తిడి పెరగాలి. సమాంతర కాలువ ఏర్పాటు చేస్తే రెండు జిల్లాల ప్రజలకు మేలు జరుగుతుంది. ఇదిలాగుండగా శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల వరకు నీరు వచ్చే వరకు కిందకు నీటిని విడుదల చేయకూడదని నిబంధన. అయితే ఈ ఏడాది అధికారులు 754 అడుగులకే నీటిని కిందకు వదిలేశారు. ఇలాంటి సందర్భాల్లో భవిష్యత్తులో హంద్రీ-నీవా కాలువకు క్రిష్ణా జలాలు రావడం కష్టమే. ఈ పరిస్థితిలో సాధ్యమైనంత నీటిని తుంగభద్ర ద్వారా తెచ్చుకోవడమే ‘అనంత’కున్న ఏకైక మార్గం. ఇందుకు సమాంతర కాలువను మించిందిలేదంటున్నారు నిపుణులు.. సామాజిక, రాజకీయ వేత్తలు. వారి అభిప్రాయాలు ఇలా.. ఏపీ ప్రభుత్వం ముందుకు రావాలి అనంతపురం, బళ్లారి జిల్లాల వంటి మెట్ట ప్రాంతాలకు సాగు నీటిని అందించేందుకు తుంగభద్ర జలాశయం వరద నీటిని వాడుకునేందుకు సమాంతర కాలువ ఏర్పాటు విషయంలో ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు స్పందించాలి. ఇందుకు ఏపీ ప్రభుత్వమే మరింత చొరవ తీసుకోవాలి. మెకంజీ తుంగభద్ర జలాశయం నిర్మాణానికి రూపకల్పన చేశారు. అప్పటి కర్ణాటక ప్రభుత్వం 133 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో, 230 టీఎంసీల నీటి వినియోగంతో జలాశయాన్ని నిర్మించారు. నీటి ఆవిరి, పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం 103 టీఎంసీలు, వినియోగ సామర్థ్యం 164 టీఎంసీలకు తగ్గిపోయింది. ఫలితంగా హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, కేసీ కెనాల్‌కు కేటాయించిన జలాల్లో ప్రతి యేటా కోతపడుతోంది. హెచ్ఎల్సీకీ 32.5 టీఎంసీలు కేటాయింపులు ఉండగా, ఎప్పుడు ఈ మేరకు రావడం లేదు. గతంలో సమాంతర కాలువ అంటే బళ్లారి జిల్లా ప్రజలు భయపడేవారు. ఇప్పుడు వారిలో కూడా చైతన్యం వచ్చింది. సమాంతర కాలువ కోసం అక్కడి రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా.. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు సమాంతర కాలువ నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారు. కాలువ నిర్మాణానికి, భూసేకరణకు అవసరమైన డబ్బులు మేమే భరిస్తామని చెప్పినా కర్ణాటక ప్రభుత్వం ముందుకురాలేదు. అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వం సానుకూలంగా ఉంది కాబట్టి ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుని చర్చలు సాగించాలి. - ఇమాం, కదలిక ఎడిటర్, అనంతపురం. కర్ణాటక ప్రభుత్వం ముందుకు రావడం లేదు తుంగభద్ర జలాశయం నుంచి వృథాగా వెళ్లే వరద నీటిని జిల్లాకు మళ్లించుకునేందుకు వరద కాలువ ఏర్పాటు మంచిదే. అయితే అందుకు కర్ణాటక ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఆ ప్రభుత్వం ముందుకు వస్తే చర్చలు జరిపి కాలువ నిర్మాణానికి చర్యలు తీసుకునేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా బళ్లారిలో కొంత మంది రైత నాయకులు దీనిపై రాజకీయం చేస్తున్నారు. సానుకూల వాతవరణం ఏర్పడితేనే ఏదైనా సాధ్యమవుతుంది. అయినప్పటికీ వరద కాలువ ఏర్పాటుకు కోసం కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. తుంగభద్ర నుంచి జిల్లాకు 32.5 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా ప్రతి ఏడాది 22 టీఎంసీలకు మించి రావడం లేదు. ప్రతి ఏడాది మన వాటా నష్టపోతూనే ఉన్నాము. - కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ చీఫ్‌విప్, రాయదుర్గం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం జిల్లాలో కరువు నివారణకు వరద కాలువే శరణ్యం. ఈ కాలువ నిర్మించాలని చాలా ఏళ్లుగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య చర్చలు జరుగుతున్నా ఫలితం కనిపించలేదు. వరద కాలువ వల్ల బళ్లారి రైతులకూ ఎంతో ఉపయోగం. కొత్తగా ప్రాజెక్టులు నిర్మించడంతో పోలిస్తే వరద కాలువ నిర్మాణానికి తక్కువ ఖర్చు అవుతుంది. వృధాగా దిగువకు పారే నీటిని ఉపయోగించుకునేందుకు అక్కడి రైతులూ ఇపుడు సుముఖంగా ఉన్నారు. ఎటొచ్చీ అంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇపుడు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంది. దీనిపై అసెంబ్లీలో మాట్లాడుతాను. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వరద కాలువ నిర్మాణానికి చొరవ చూపేలా వెంటపడతాము. ఈ విషయంపై ప్రజాప్రతినిధులందరూ మూకుమ్మడిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకు రావాలి. - వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే, ఉరవకొండ హెచ్చెల్సీ సామర్థ్యం పెంచాలి వరద కాలువ నిర్మించడం అనేది యుద్ధప్రాతిపదికన జరగాలి. లేదంటే ఇపుడున్న హెచ్చెల్సీ కాలువను 6,500 క్యూసెక్కుల సామర్థ్యం మేరకు విస్తరించాలి. ఏటా వందలాది టీఎంసీల నీరు దిగువకు వృధాగా పోతోంది. డ్యాంలో పూడిక పేరుకు పోవడంతో ఏడాదికేడాది జిల్లాకు రావాల్సిన కోటా లో కోత పడుతోంది. ఎన్నో ఏళ్లుగా వర ద కాలువ కోసం పోరాటం చేస్తున్నాం. ఇన్నాళ్లూ కర్ణాటక ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంత రైతులు వరద కాలువకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. కర్ణాటక ముఖ్యమంత్రిని చర్చలకు ఆహ్వానించాలి. - అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీ, అనంతపురం చిత్తశుద్ధితో చొరవ చూపాలి అనంతపురం జిల్లాకు ప్రధానమైన నీటి వనరు తుంగభద్ర జలాశయమే. అయితే ఏ ఏటికాయేడు ఈ జలాశయం నుంచి జిల్లాకు కేటాయింపులు తగ్గిపోతున్నాయి. జిల్లాకు 32 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉండగా ఏనాడు ఆ మేర వచ్చిన దాఖలాలు లేవు. అయితే జలాశయంలో పూడికపేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోతోంది. ప్రతి ఏడాది ఎగువ ప్రాంతాల్లో కురిసే వరదల వల్ల భారీ పరిమాణంలో నీరు వృథాగా కిందకు పోతోంది. ఇలా వెళ్లిపోయే వరద నీరు అనంతపురం జిల్లాకు మళ్లించుకోవాలంటే హెచ్ఎల్సీకి సమానంగా వరద కాలువ నిర్మిస్తే అటు బళ్లారి, ఇటు అనంతపురం జిల్లా ప్రజల సాగు, తాగు నీటి అవసరాలు తీరుతాయి. అయితే పాలకులు ఆ మేరకు చిత్తశుద్ధి కనబరచడం లేదు. గతంలో సీఎంగా పనిచేసిన మర్రిచెన్నారెడ్డి సైతం వరద సమాంతర కాలువ కోసం తిరుపతిలో కర్ణాటక ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపినా అది సాకారం కాలేదు. కర్ణాటక, ఏపీ ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి లేకపోవడంతోనే వరద కాలువ నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. నిజంగా ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కర్నాటక ప్రభుత్వాన్ని ఒప్పించి వరద కాలువ తవ్వకానికి మార్గం సుగమం చేయాలి. - ఓబుళకొండారెడ్డి, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి, అనంతపురం. ఇక జాప్యం చేయకూడదు ప్రతి ఏడాది కర్ణాటకలో కురిసే వరదలతో తుంగభద్ర జలాశం నిండిపోయి అందులోని వరద నీరు శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలో కలిసి పోతోంది. దీంతో వందలాది టీఎంసీల నీరు రైతులకు ఏమాత్రం ఉపయోగపడకుండా పోతోంది. ఇలా వృధాగా వెళ్లే నీటిని ఉపయోగించుకునేందుకు హెచ్ఎల్సీకీ పైన సమాంతరంగా సమాంతర కాలువ ఏర్పాటు చేస్తే అనంతపురం జిల్లా ప్రజలకు మేలు జరుగుతుంది. ఇందుకు కర్ణాటక ప్రభుత్వం అదనంగా చేయాల్సిందేమీ లేదు. వరద జలాలు అనేవి సహజ సిద్ధంగా వచ్చేవే. వాటి కోసం పంపింగ్ అవసరం లేదు. ఏమంటే వారు సమాంతర కాలువ ఏర్పాటుకు ఓకే చెబితే చాలు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ.. కేంద్రంలో టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఉంది కాబట్టి కేంద్ర జల సంఘం ద్వారా పెద్ద ఇబ్బందులు రాకపోవచ్చు. ఈ కాలువ వల్ల కర్ణాటక రైతులకు కూడా ఉపయోగం ఉన్న దృష్ట్యా ఆ రాష్ట్రం కూడా సమ్మతించే అవకాశం ఉంది. ఇకనైనా ఏపీ ప్రభుత్వం మేల్కోకపోతే ప్రజలు, రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. - జగదీష్, సీపీఐ జిల్లా కార్యదర్శి, అనంతపురం. ఇదే సరైన సమయం ఎన్నో ఏళ్లుగా వర ద కాలువ నిర్మా ణం గురించి చర్చ జరుగుతోంది. ఆచరణలో సాధించింది శూన్యం. ఏపీ ప్రభుత్వం చూపాల్సినంత చొరవ చూపక పోవడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. గతంలో పీవీ నరసింహారావు ప్రధాని హోదాలో పుట్టపర్తికి వచ్చినపుడు ఏపీ సీఎం జనార్ధనరెడ్డి, కర్ణాటక సీఎం బంగారప్ప పీవీ సమక్షంలో వరద కాలువ నిర్మాణంపై చర్చించారు. తర్వాత ఆ చర్చ ముందుకు సాగలేదు. సార్వత్రిక ఎన్నికల ముందు బెంగళూరులో ఓ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి రాష్ట్రం తరఫున అప్పటి మంత్రులు రఘువీరారెడ్డి, సుదర్శనరెడ్డి హాజరయ్యారు. చర్చ కొంత మేర ఫలితం వచ్చేలా సాగింది. తదుపరి చర్చ హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించా రు. ఈ పరిస్థితిలో ఏపీ సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని కర్ణాటక సీఎంను చర్చలకు ఆహ్వానించడానికి ఇదే సరైన తరుణం. వారిద్దరూ కూర్చుని మాట్లాడితేనే ఫలితముంటుంది. - సి.విశ్వనాథ్, సీనియర్ పాత్రికేయుడు, అనంతపురం చర్చలు కొనసాగించాలి తుంగభద్ర జలాశం నుంచి అనంతపురం జిల్లా వరకు సమాంతర కాలువ విషయంలో మేం చేసేది ఏమీ లేదు. అడిగితే అందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించడం వరకే మా పని. అయితే ప్రతి ఏడాది తుంగభద్ర జలాశయం నుంచి వృథాగా వెళ్తున్న నీటికి అడ్డుకట్టవేసి ఆ నీటిని జిల్లాకు రప్పించేందుకు సమాంతర కాలువ ఏర్పాటు చేస్తే అనంతపురం జిల్లాకే కాకుండా బళ్లారి, వైఎస్ఆర్ జిల్లాలకు మేలు జరుగుతుంది. ఇందుకు కర్ణాటక, ఏపీ ప్రభుత్వాల సీఎంలు ఇద్దరూ కూర్చొని చర్చించాల్సి ఉంది. ప్రస్తుత హెచ్ఎల్సీ కెనాల్‌కు ఎగువన సమాంతర కాలువ చేపడితే అనంతపురం జిల్లాకు సాగు, తాగునీటి కష్టాలు తప్పుతాయి. - ధనుంజయరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నీటిపారుదల శాఖ, అనంతపురం జనం ఆందోళన బాట పట్టకముందే మేల్కోండి తుంగభద్రకు ఏటా వరద వస్తోంది.. వందలాది టీఎంసీల నీరు దిగువకు వృధాగా వెళ్తోంది.. అదిగో వరద కాలువ.. ఇదిగో వరద కాలువ అంటూ ఏటా జూలై, ఆగస్టు నెలలో నాలుగు మాటలు మాట్లాడి చేతులు దులుపుకుంటున్నారు మన ప్రజాప్రతినిధులు. రాష్ట్ర విభజన తర్వాత అవశేషాంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. అభివృద్ధి అంతా ఆ మూడు జిల్లాల(విశాఖ, కృష్ణా, గుంటూరు)కే పరిమితమయ్యే స్థితి కళ్లకు కడుతోంది. ఈ స్థితిలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ జిల్లా కరువును శాశ్వతంగా రూపుమాపుతామని ప్రభుత్వం చెప్పే మాటలు ఎంత వరకు నమ్మశక్యమో ప్రశ్నార్థకం. ఈ స్థితిలో హెచ్చెల్సీకి సమాంతరంగా వరద కాలువ నిర్మిస్తే జిల్లాలో సగం కరువు తీరుతుంది. దీని కోసం జనం ఆందోళనకు సిద్ధమవక ముందే ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. - వి.కె.రంగారెడ్డి, అనంత అభివృద్ధి సాధన సమితి కన్వీనర్ -
కలల గలగలలు పారేనా?
ఆదోని, న్యూస్‌లైన్: తుంగభద్ర దిగువ కాలువ.. జిల్లా పశ్చిమ ప్రాంత రైతుల వరప్రదాయిని. అయితే ఆధునికీకరణ పనుల్లో అంతులేని జాప్యం కారణంగా ప్రతీ ఏటా నీటి వాటా కోల్పోవాల్సి వస్తోంది. ఈ ఏడాదీ అదే పరిస్థితి నెలకొంది. దీంతో కాలువ బాగు పడేదెన్నడో, బీడు భూమలు పచ్చని పైరుతో కళకళలాడేదెన్నడోనని రైతులు దిగాలు చెందుతున్నారు. జిల్లాలో ఆదోని, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1.51 లక్షల ఎకరాలకు తుంగభద్ర దిగువ కాలువ నీరు అందాల్సి ఉంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా నిర్వహణను గాలి కొదిలేయడంతో కాలువ లైనింగ్, గట్టు బాగా దెబ్బతింది. బలహీనంగా మారిన గట్టుకు ఎక్కడ పడితే అక్కడ గండ్లు పడుతున్నాయి. దీంతో నీటి సరఫరాలో తీవ్ర అంతరాయం చోటు చేసుకుంటోంది. దీనికి తోడు కర్ణాటకలో రాష్ట్ర వాటా నీటిని పెద్ద ఎత్తున మళ్లించుకుంటున్నారు. ఫలితంగా ఏటా 4 నుంచి 6 టీఎంసీల నీటిని జిల్లా ప్రజలు నష్టపోతున్నారు. ఒక టీఎంసీ నీటితో పది వేల ఎకరాల్లో ఆరు తడి పంటలు సాగు చేయవచ్చు. ఏటా దాదాపు 60 వేల ఎకరాలకు సరిపోయే నీటిని రైతుల నష్టపోవాల్సి వస్తోంది. దీంతో ఏటా 40 నుంచి 60 వేల ఎకరాలకు మించి సాగు నీరు అందడం లేదు. సాగు అవుతున్న భూములకు కూడా కీలకమైన సమయంలో నీటి కొరత ఏర్పడి ఎంతో మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాగు నీరు అందక ఏటా లక్షా పది వేల నుంచి 90 వేల ఎకరాలలో రైతులు వర్షాధార పంటలు సాగు చేసుకోవాల్సి వస్తోంది. వర్షాలు సక్రమంగా కరువక పంటలు చేతిక అందక అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. సా..గుతున్న పనులు రైతుల కన్నీటిని తుడిచేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008లో కాలువ ఆధునీకరణకు రూ.175 కోట్లు మంజూరు చేశారు. సాగు నీటి శాఖ అధికారులు.. ఆధునీకరణ పనులను 18 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిచిచారు. పనులు పూర్తి చేసేందుకు రెండేళ్లు గడువు పెట్టారు. ఇప్పటికి ఆరేళ్లు కావస్తుండగా 18 ప్యాకేజీల్లో 3ఈ, 3బి, 3సి, 3డి, 7 మాత్రం పూర్తి అయ్యాయి. కాలువకు గత మార్చి నాలుగో వారంతో నీటి సరఫరా నిలిపివేశారు. నీటి సరఫరా నిలిపి వేసిన తరువాత 1సి, 3ఎ, 6సి, 4బి మాత్రం ప్రారంభం అయ్యాయి. మిగిలిన తొమ్మిది ప్యాకేజీలలో ఇంకా పనులు ప్రారంభం కాలేదు. జూలై రెండో వారంలో కాలువకు నీటి సరఫరాను పునరుద్ధరిస్తారు. ఆ లోగా పనులు పూర్తి చేయాల్సి ఉంది. నెలన్నర రోజులలో కాంట్రాక్టర్లు యంత్రాలు, నిర్మాణ సామగ్రిని తరలించుకుని పనులు పూర్తి చేయడం సాధ్యమయ్యే అవకాశాలు లేవని రైతులు పేర్కొంటున్నారు. జాప్యానికి కారణాలు ఇవే.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత కారణంగా ఆధునికీకరణ పనులు నత్తనడకను తలపించాయి. గడువును పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఆ మేరకు నిధులు విడుదల చేయాలి. అయితే అవసరం అయిన నిధుల్లో సగం కూడా విడుదల కావడం లేదు. దాదాపు మూడేళ్లుగా అత్యంత కీలకమైన ఈఈ పోస్టు ఖాళీగా ఉంది. దీనికి తోడు కాంట్రాక్టర్లు కూడా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మార్చి చివరి వారం నుంచి జూలై రెండో వారం వరకు కాలువలో నీటి సరఫరా ఉండదు. ఆ సమయంలో పనులు నిరాటంకంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆ దిశగా పనులు జరిగిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ ఏడాది మార్చి నాలుగో వారంలో నీటి సరఫరా నిలిపి వేయగా ఇంకా 9 ప్యాకేజీలలో పనులు ప్రారంభం కాకపోవడమే ఇందుకు నిదర్శనం. నీటి సరఫరా నిలిచిపోయిన వెంటనే పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. ఆ దిశగా ఇటు అధికారులు, అటు కాంట్రాక్టర్లు దృష్టి సారించక పోవడం దిగువ కాలువ రైతులకు శాపం అవుతోంది. అన్ని ప్యాకేజీల్లో పనులు ప్రారంభిస్తాం: భాస్కర్‌రెడ్డి, ఇన్చార్జ్ ఈఈ ఇప్పటికే నాలుగు ప్యాకేజీల్లో పనులు ప్రారంభం అయ్యాయి. మిగిలిన ప్యాకేజీల్లో పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నాం. ఒక ప్యాకేజీలో సాంకేతిక సమస్య ఉంది. ఈ ఏడాది పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాం. వేసవిలో కూడా మధ్యలో తాగునీటి కోసం కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పనులకు ఆటంకం ఏర్పడుతోంది. -
మాన్యం.. అయితేనేం!
టీడీపీ నేతల భూ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దేవుడి భూములు సొంతం చేసుకునేందుకూ వెనుకాడకపోవడం అక్రమార్కులు ఎంతకు తెగించారో తెలియజేస్తోంది. ఎమ్మిగనూరు శివారులో ఓ మాజీ మంత్రి సోదరుడు పోతురాజుస్వామి దేవాలయ భూమిని ఆక్రమించుకోగా.. తాజాగా మరికొందరు టీడీపీ నాయకులు రూ.2.4 కోట్ల విలువ చేసే ఆంజనేయస్వామి భూములకు ఏకంగా పాసు పుస్తకాలనే పుట్టించారు. కోట్లాది రూపాయల విలువ చేసే దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతుండగా.. దేవుళ్లకు ధూప దీప నైవేద్యాలు కరువవుతున్నాయి. ఎమ్మిగనూరు, న్యూస్‌లైన్: నందవరం మండలంలోని నదికైరవాడి గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. సర్వే నెం.4లో 23.89 ఎకరాల భూమి ఈ దేవాలయానికి ఇనాంగా ఉంది. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ భూమి ప్రస్తుతం ఎకరా రూ.10లక్షల ధర పలుకుతోంది. ఇంతటి విలువైన భూమిని రెండు దశాబ్దాల క్రితమే నదికైరవాడి, ఇబ్రహీం కొట్టాల గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు కబ్జా చేశారు. వీరికి అప్పటి టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అండదండలు ఉండడంతో రెవెన్యూ అధికారులు కాసుల కక్కుర్తితో పాసు పుస్తకాలు జారీ చేసేశారు. పట్టాదారు ఖాతా నెం.2లో వీరభద్రప్పకు 5. 97 ఎకరాలు, ఖాతా నెం.45లో ఆర్.కృష్ణమూర్తికి 3 ఎకరాలు, ఖాతా నెం.88లో తిమ్మప్పకు 6 ఎకరాలు, ఖాతానెం.5100లో సత్యనారాయణ 2.95 ఎకరాలు, 5145లో షణ్ముఖకు 5.9 ఎకరాలు ఉన్నట్లు పాసు పుస్తకాలు పుట్టుకొచ్చాయి. టెన్‌వన్ అడంగల్‌లోనూ వీరి పేర్లు నమోదు చేశారు. అయితే సర్వే నెం.4లో 23.89 ఎకరాలతో మెట్ట భూమి ఆంజనేయస్వామికి చెందినదిగా రెవెన్యూ రికార్డుల్లో కీలకమైన ఆర్‌ఎస్‌ఆర్‌లో నమోదైంది. సబ్ రిజిష్టార్ కార్యాలయం రికార్డుల్లోనూ దేవాలయ భూమిగానే చూపుతున్నారు. ఇటీవల అక్రమార్కుల పేర్లను ఆన్లైన్లో చేర్చేందుకు రెవెన్యూ అధికారులు యత్నించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కోస్తాంద్ర నుంచి వచ్చిన ఇబ్రహీంపురం కొట్టాల టీడీపీ నేతలకు దేవాలయ భూమి అనువంశికం (వారసత్వం) కింద సంక్రమించిందంటూ రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసు పుస్తకాన్ని జారీ చేయడం అక్రమాలకు పరాకాష్టగా నిలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సుమారు రూ.2.4 కోట్ల విలువ చేసే భూములు ఉన్నప్పటికీ ఆంజనేయస్వామికి ధూపదీప నైవేద్యాలు కరువయ్యాయి. దేవాలయ భూమిని అన్యాక్రాంతం చేసిన నాయకులు పాసు పుస్తకాలతో వ్యవసాయ రుణాలను పొంది దర్జాగా అనుభవిస్తున్నారు. ఈ భూములను స్వాధీనం చేసుకుంటే ఏడాదికి రూ.3లక్షలకు పైగా కౌలు రూపంలో వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలె క్టర్ స్పందించి అన్యాక్రాంతమైన ఆంజనేయస్వామి దేవాలయ భూమిని పరిరక్షించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అది దేవాలయ భూమే: రెవెన్యూ ఆర్ఎస్ఆర్ రికార్డుల్లో సర్వే నెం.4 కింద నదికైరవాడి ఆంజనేయస్వామి పేరిట 23.89 ఎకరాలు ఉంది. అన్యాక్రాంతం చేసిన వారికి పాసు పుస్తకాలు ఎలా జారీ అయ్యాయో.. అడంగల్‌లో వారి పేర్లు ఎలా చేర్చారో అప్పటి రెవెన్యూ అధికారులకే తెలుసు. ఇంత వరకు మాకు కూడా ఈ భూమి అన్యాక్రాంతమైనట్లు తెలియదు. చంద్రశేఖర్, తహశీల్దార్, నందవరం -
గెట్ల నీరిస్తరు...!
అది జాయింట్ ఇండెంట్ నీరు. ఇక్కడి అవసరాలను విస్మరించి వేరొక ప్రాంతానికి మళ్లింపు అన్యాయమే. మరి ఈ ప్రాంత రైతుల పంటలు దెబ్బతింటే ఎవరు బాధ్యులు. నిర్ణయం తీసుకున్న అధికారులా...? ఇవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులా...? అసలు హెచ్చరికలే లేకుండా తమకు దక్కాల్సిన తుంగభద్ర నీటిని ఎలా ధారాదత్తం చేస్తారని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ఆగ్రహంతో రగులుతున్నారు. గద్వాల,న్యూస్‌లైన్: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారు లు తీసుకున్న నిర్ణయంతో ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలో సా గైన 30 వేల ఎకరాల ఆయకట్టు పంటలకు నీళ్లందక ఎం డిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈఎన్సీ కార్యాలయ నిర్ణయంపై ప్రజాప్రతినిధులు ఏ నిర్ణయం తీసుకోకుండా వారం రోజులుగా కాలయాపన చేస్తుండడంతో ఆర్డీఎస్ ఆయకట్టులో పంటలు నీళ్లు లేక ఎండుతున్నాయి.తుంగభధ్ర ప్రాజెక్టులో ఉన్న ఆర్డీఎస్, కేసీ కాలువల జాయిం ట్ వాటా నీటిని హెచ్ఎల్సీకి మళ్లిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయం రైతులకు శాపమవుతోంది. భారీగా పెట్టుబడులు... ప్రస్తుతం ఈ నీరు ఆధారంగా జిల్లాలోని ఐజ, వడ్డేపల్లి, మానవపాడు మండలాలకు చెందిన సుమారు 30 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు వేశారు. వీటి లో ఒక్క మొక్కజొన్నే 15వేల ఎకరాలకు పైబడిన విస్తీర్ణంలో సాగవుతోంది. వీటికి ఎకరాకు సుమారు రూ. 6వేల వంతున సేద్యం ఖర్చులుగా రైతులు పెట్టారు. అంటే రమారమీ 90లక్షల మేర ఖర్చుచేశారన్నమాట. ప్రస్తుతం మొక్కజొన్న కంకులు పాలుపోసే దశలో ఉం ది. ఇక మిరపకు ఎకరాకు రూ.10వేల వంతున ఖర్చు వస్తుంది. వేరుశెనగ సరేసరి. కొన్ని ప్రాంతాల్లో వీటినీ సాగుచేశారు. ఇప్పుడు నీరందక పోతే ఈ పంటలన్నీ తీ వ్రంగా దెబ్బదింటాయి. రైతులకు దిక్కుతోచని పరిస్థితే. ఇక్కడ అవసరాలు విస్మరిస్తే ఎలా... నీటి వాటాల బదలీ విషయంలో ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా అధికారులే నిర్ణయాలు తీసుకోవడం ఇ లా వివాదాస్పదమవుతోంది. తుంగభధ్ర బోర్డులో తమ వాటా నీటిని పూర్తిగా వాడుకోకపోయినా మరో ప్రాంత అవసరాల కోసం ఆర్డీఎస్ నీటిని మళ్లించే చర్యలకు ఉపక్రమించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై బుధవారం హైదరాబాద్‌లో భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డిని ఆర్డీఎస్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ తనగల సీతారాంరెడ్డి ఆధ్యర్యంలో ఆయకట్టు రైతులు కలిసి సమస్యను వివరించారు. ఇందుకు స్పందించిన మంత్రి సుదర్శన్‌రెడ్డి గురువారం సమస్య పరిష్కారానికి ఈఎన్సీతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. అసలు సమస్యకు కారణం నీటిపారుదల శాఖ ఈఎన్సీ కార్యాలయంలో జరిగిన నిర్ణయం. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి రబీ సీజన్ వాటాగా ఆర్డీఎస్ నీటిమళ్ళింపు పథకానికి 4.5 టీఎంసీలు, కర్నూలు కడప కాలువ(కేసి కాలువ)కు 7.5 టీఎంసీల వాడుకునే అవకాశం ఉంది. మొదటి పంట పూర్తి కావడంలో ఆలస్యం కావడం, ఐఏబిల సమావేశాలలో రెండవ పంట ఆయకట్టుపై నిర్ణయం జాప్యం కారణంగా కర్నూల్ ఎస్సీ తుంగభద్ర బోర్డుకు ఇండెంట్ పెట్టడంలో ఆలస్యమైంది. ఈ అవకాశాన్ని అదనుగా తీసుకున్న ఈఎస్సీ కార్యాలం అధికారులు తుంగభద్ర బోర్డులో ఉన్న ఆర్డీఎస్, కేసీ కాలువల జాయింట్ ఇండెంట్ నీటని హెచ్ఎల్సీకి మళ్లించేలా ఉత్తర్వులు జారీ చేశారు. అదే జరిగితే కేసీ కాలువ పరిధిలో రెండో పంటకు నీళ్లు అందక పోగా, మన జిల్లా పరిధిలోని ఆర్డీఎస్ పరిధిలో ఉన్న 30 ఎకరాల పంట పూర్తి కాకుండానే ఎండిపోయే ప్రమాదం ఉంది. ఆర్డీఎస్ ప్రధాన కాలువకు మూడు రోజుల క్రితమే నీటి విడుదల నిలిచిపోయింది. తక్షణమే విడుదల చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సివస్తుంది. పంటలను కాపాడాలి- ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారాంరెడ్డి. ఆర్డీఎస్ పరిధిలో పూర్తి కావాల్సిన పంట 30 వేల ఎకరాలలో ఉంది. పంటను కాపాడాలి. దీంతో పాటు ఆర్డీఎస్ వాటాను హెచ్ఎల్సీ కాలువకు ఎలా బదిలీ చేస్తారు. ప్రాజెక్టుల వాటాను మరో ప్రాజెక్టుకు మార్చడం అన్యా యం ఈ చర్యపై పోరాడుతాం. జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్పందించాలి. -
ఈ పాపం పాలకులదే
పేదరికం, వలసలు, వెనుకబాటుతనం...ఐదుదశాబ్దాలుగా మన పాలకులు సీమకు అందించిన ఆస్తి. ప్రత్యేకరాష్ట్రం ఏర్పడి దశాబ్దాలు గడిచింది. మళ్లీ విభజనకు రంగం సిద్ధమైంది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సీమకు ఇచ్చిన ఏ హామీలను పాలకులు నెరవేర్చలేదు. గతంలో తెలంగాణతో పాటు సీమలో ఉద్యమాలు వచ్చినప్పుడు అభివృద్ధికి వేర్పాటువాదం పరిష్కారం కాదని, సమైక్యంతో అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే రెండుప్రాంతాలను అభివృద్ధి చేసి ప్రాంతీయ అసమానతలను రూపుమాపడంతో విఫలమయ్యాయి. ఇప్పుడేమో విభజనను తెరపైకి తెచ్చాయి. ఇప్పటి వరకూ పాలకుల నిర్లక్ష్యంతో దగాపడిన రాయలసీమ.. విభజన జరిగితే మరింత అన్యాయానికి గురికానుంది. సాక్షి, కడప: రాయలసీమతో పాటు తెలంగాణలోనూ వెనుకబడిన ప్రాంతాలున్నాయి. 1971లో ఇరిగేషన్ కమిషన్ నిరంతరం కరువులకు గురయ్యే ప్రాంతాలుగా నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, అనంతపురం, కర్నూలు, కడపను గుర్తించాయి. 750 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఇక్కడ నమోదవుతోంది. ఇక్కడ కరువు సమస్యలను అధిగమించేందుకు క్షామపీడిత ప్రాంతాల అభివృద్ధి పథకాలు గత 25 ఏళ్లుగా అమలవుతున్నాయి. ప్రజాప్రతినిధుల బాధ్యతారాహిత్యంతో ఈ జిల్లాలలో సాగు, తాగునీటి సమస్యలు పెరిగాయే కానీ తగ్గలేదు. కరువు ప్రాంతాల అభివృద్ధికి శాశ్వత పరిష్కారం సేద్యపునీటి వనరులను అభివృద్ధి చేయడమే. ఈ దిశగా పాలకులు దృష్టి సారించలేదు. రాయలసీమ కంటే తెలంగాణలోనే(నల్గొండ, మహబూబ్‌నగర్ మినహా) వర్షాధారం ఎక్కువ. అయినప్పటికీ రాయలసీమ కంటే తెలంగాణ వెనుకబడి ఉందని అక్కడి పాలకులు ఓ ఉద్యమాన్ని చేపట్టారు. రాష్ట్రాన్ని చీల్చేస్థితికి తీసుకొచ్చారు. రాష్ట్రం విడిపోతే సాగునీటి విషయంలో సీమకు తీరని నష్టం వాటిల్లనుంది. ఆది నుంచి సీమకు అన్యాయమే: భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం 1937లో రాయలసీమ, కోస్తా ఆంధ్ర పెద్దమనుషుల మధ్య కుదిరిన శ్రీబాగ్ ఒప్పందంలో కృష్ణాజలాల వినియోగంలో సీమ ప్రయోజనాలు నెరవేర్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు తరలించాలనే ఒప్పందం ఉంది. నేటికీ అది ఉల్లంఘించబడుతోంది. తద్వారా ప్రతి అంశంలో సీమకు అన్యాయమే జరిగింది. తుంగభద్ర ప్రాజెక్టును 300 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని 1901లో మెకంజీ ప్రతిపాదించారు. అయితే 230 టీఎంసీలకు ప్రాజెక్టును కుదించి దిగువన కృష్ణానదికి 70 టీఎంసీల జలాలను వదిలేలా రూపలక్పలన చేశారు. ఇది సీమకు జరిగిన మొదటి అన్యాయం. ఆపై 60 టీఎంసీలకు సామర్థ్యంతో నిర్మించాల్సిన గండికోటకు తిలోదకాలిచ్చారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో(అప్పట్లో తెలంగాణ నిజాం పాలనలో ఉంది) రూపొందించి కేంద్ర జలవనరుల ఆమోదం పొందిన కృష్ణా పెన్నార్ ప్రాజెక్టుకు తిలోదకాలిచ్చి నాగార్జునసాగర్ ను నిర్మించారు. దీని వల్ల తెలాంగాణ, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు మేలు జరిగితే సీమకు మరోసారి అన్యాయం జరిగింది. అలాగే భోస్లా కమిటీ చేసిన విలువైన సూచనలు సిద్ధేశ్వరం, గండికోట ప్రాజెక్టులు నిర్మించడం, కేసీ కాల్వ 6000 క్యూసెక్కుల ప్రవాహంతో ఆధునికీకరించడం. ఈ ప్రతిపాదన బుట్టదాఖలు చేశారు. కర్నూలు రాజధానిని తెలంగాణకు తరలించిన మన త్యాగమూర్తులు, అభివృద్ధి పక్కనపెడితే సాగునీటిని రప్పించుకోవడంలో కూడా మన పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. చివరకు గాలేరు-నగరి, హంద్రీనీవా, తుంగభద్ర హైలెవల్ కెనాల్ వెడల్పు నిర్మాణంతో పాటు తెలుగుగంగకు నికర జలాలను సాధించుకోలేకపోయారు. 2004కు ముందు రాష్ట్రాన్ని పాలించిన సీమవాసులంతా ఈ విషయంలో అన్యాయమే చేశారు. కేవలం వైఎస్ హయాంలోనే ఇవి నిర్మాణదశకు వచ్చాయి. పైన చెప్పిన ప్రాజెక్టులు పూర్తయి ఉంటే రాయలసీమలో సాగునీటి సమస్య కొంతైనా తీరేది. ఉద్యమం...ఏదీ ఫలితం?: రాయలసీమతో పాటు మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు కృష్ణా జలాలు అందించి సేద్యపు సమస్యలు తీర్చాలని కొన్నేళ్లుగా సీమవాసులు పోరాడుతున్నా ఫలితం లేదు. మద్రాసు తాగునీటికి 15 టీఎంసీలు, తెలుగుగంగకు 29 టీఎంసీలు, శ్రీశైలం కుడికాల్వకు 19 టీఎంసీలు, గాలేరునగరికి 38 టీఎంసీలు, పీఏబీఆర్ కు 10 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా కేటాయించాలని సీమవాసులు గతంలో ఉద్యమించారు. గత ప్రభుత్వాలకు విన్నవించారు. అలాగే శ్రీశైలం వెనుకభాగం నుండి హంద్రీనీవా ప్రాజెక్టుకు 40 టీఎంసీలు కేటాయించాలని కోరారు. తద్వారా కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరులో 6.205 లక్షల ఎకరాల ఆయకట్లుకు సాగునీరు అందుతుంది. అలాగే వెలిగొండకు 32.5 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ఎడమకాలువకు 30 టీఎంసీలు, కల్వకుర్తి పథకానికి 25 టీఎంసీలు, భీమాకు 20 టీఎంసీలు, నెట్టెంపాడుకు 20 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 5.5 టీఎంసీలు కేటాయించాలని సీమవాసులే ఉద్యమించారు. ఈ డిమాండ్ల సాధన కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమం నడిచింది. ఉద్యమంలో డాక్టర్ ఎంవీ రమణారెడ్డితో పాటు మైసూరారెడ్డి కీలకపాత్ర పోషించారు. ప్రణాళిక మనది...ఫలితం తెలంగాణకు: 1990 సెప్టెంబరు 24న ఎంవీ మైసూరారెడ్డి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల రిటైర్డు ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. కృష్ణాజలాల్లో పంటమార్పులు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించి దాదాపు 190 టీఎంసీల జలాలను ఆదా చేసుకునేలా ఓ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందించారు. ఇదే ప్రతిపాదనను 1983లో ఎంఈ రమణారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి కూడా చేశారు. కృష్ణాబ్యారేజ్ ఎగువన, సాగర్ దిగువ ప్రాంతంలో ఈ ప్రణాళికను అమలు చేశారు. తద్వారా ఎగువన కరువు ప్రాంతాలకు నీటి కేటాయింపులు ఇవ్వాలని నివేదికలో రూపొందించారు. అయితే అలా ఆదాచేయబడిన నికరజలాలల్లో బీమా ప్రాజెక్టుకు 20 టీఎంసీలు, ఎలిమినేటి మాధవరెడ్డి పథకానికి 12 టీఎంసీలు కేటాయించారు. వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీశైలంలో ఆవిరి నష్టం కింద ఆదాచేయబడిన 11 టీఎంసీలను, కృష్ణాడెల్టా కింద ఆధునికీకరణ ద్వారా 40 టీఎంసీల నికర జలాలను పులిచింతలకు కేటాయించారు. కృష్ణా డెల్టాలో ఆధునికీకరణ ద్వారా ఆదా చేసిన 83 టీఎంసీల నికర జలాలలో ఒక్క టీఎంసీని కూడా సీమ ప్రాజెక్టుకు కేటాయించలేదు. ఇందుకు కారణం 15 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ ప్రభుత్వానిదే అని సుస్పష్టమవుతుంది. 2004 తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 4,500 క్యూసెక్కులకు పెంచారు. హంద్రీ-నీవా, గాలేరునగరితో పాటు పలు ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారు. గతంలోనే ప్రాజెక్టుల నిర్మాణం, నీటి కేటాయింపుల్లో టీడీపీ ప్రభుత్వాన్ని నడిపిన చంద్రబాబు చొరవ చూపిఉంటే ఈ రోజు సీమకు సాగునీటి ముప్పు కాస్తయినా తప్పేది.