టీడీపీ నేతల భూ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దేవుడి భూములు సొంతం చేసుకునేందుకూ వెనుకాడకపోవడం అక్రమార్కులు ఎంతకు తెగించారో తెలియజేస్తోంది.
ఎమ్మిగనూరు శివారులో ఓ మాజీ మంత్రి సోదరుడు పోతురాజుస్వామి దేవాలయ భూమిని ఆక్రమించుకోగా.. తాజాగా మరికొందరు టీడీపీ నాయకులు రూ.2.4 కోట్ల విలువ చేసే ఆంజనేయస్వామి భూములకు ఏకంగా పాసు పుస్తకాలనే పుట్టించారు. కోట్లాది రూపాయల విలువ చేసే దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతుండగా.. దేవుళ్లకు ధూప దీప నైవేద్యాలు కరువవుతున్నాయి.
ఎమ్మిగనూరు, న్యూస్‌లైన్: నందవరం మండలంలోని నదికైరవాడి గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. సర్వే నెం.4లో 23.89 ఎకరాల భూమి ఈ దేవాలయానికి ఇనాంగా ఉంది. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ భూమి ప్రస్తుతం ఎకరా రూ.10లక్షల ధర పలుకుతోంది. ఇంతటి విలువైన భూమిని రెండు దశాబ్దాల క్రితమే నదికైరవాడి, ఇబ్రహీం కొట్టాల గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు కబ్జా చేశారు. వీరికి అప్పటి టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అండదండలు ఉండడంతో రెవెన్యూ అధికారులు కాసుల కక్కుర్తితో పాసు పుస్తకాలు జారీ చేసేశారు.
పట్టాదారు ఖాతా నెం.2లో వీరభద్రప్పకు 5. 97 ఎకరాలు, ఖాతా నెం.45లో ఆర్.కృష్ణమూర్తికి 3 ఎకరాలు, ఖాతా నెం.88లో తిమ్మప్పకు 6 ఎకరాలు, ఖాతానెం.5100లో సత్యనారాయణ 2.95 ఎకరాలు, 5145లో షణ్ముఖకు 5.9 ఎకరాలు ఉన్నట్లు పాసు పుస్తకాలు పుట్టుకొచ్చాయి. టెన్‌వన్ అడంగల్‌లోనూ వీరి పేర్లు నమోదు చేశారు.
అయితే సర్వే నెం.4లో 23.89 ఎకరాలతో మెట్ట భూమి ఆంజనేయస్వామికి చెందినదిగా రెవెన్యూ రికార్డుల్లో కీలకమైన ఆర్‌ఎస్‌ఆర్‌లో నమోదైంది. సబ్ రిజిష్టార్ కార్యాలయం రికార్డుల్లోనూ దేవాలయ భూమిగానే చూపుతున్నారు. ఇటీవల అక్రమార్కుల పేర్లను ఆన్‌లైన్‌లో చేర్చేందుకు రెవెన్యూ అధికారులు యత్నించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కోస్తాంద్ర నుంచి వచ్చిన ఇబ్రహీంపురం కొట్టాల టీడీపీ నేతలకు దేవాలయ భూమి అనువంశికం (వారసత్వం) కింద సంక్రమించిందంటూ రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసు పుస్తకాన్ని జారీ చేయడం అక్రమాలకు పరాకాష్టగా నిలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సుమారు రూ.2.4 కోట్ల విలువ చేసే భూములు ఉన్నప్పటికీ ఆంజనేయస్వామికి ధూపదీప నైవేద్యాలు కరువయ్యాయి. దేవాలయ భూమిని అన్యాక్రాంతం చేసిన నాయకులు పాసు పుస్తకాలతో వ్యవసాయ రుణాలను పొంది దర్జాగా అనుభవిస్తున్నారు. ఈ భూములను స్వాధీనం చేసుకుంటే ఏడాదికి రూ.3లక్షలకు పైగా కౌలు రూపంలో వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలె క్టర్ స్పందించి అన్యాక్రాంతమైన ఆంజనేయస్వామి దేవాలయ భూమిని పరిరక్షించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అది దేవాలయ భూమే:
రెవెన్యూ ఆర్‌ఎస్‌ఆర్ రికార్డుల్లో సర్వే నెం.4 కింద నదికైరవాడి ఆంజనేయస్వామి పేరిట 23.89 ఎకరాలు ఉంది. అన్యాక్రాంతం చేసిన వారికి పాసు పుస్తకాలు ఎలా జారీ అయ్యాయో.. అడంగల్‌లో వారి పేర్లు ఎలా చేర్చారో అప్పటి రెవెన్యూ అధికారులకే తెలుసు. ఇంత వరకు మాకు కూడా ఈ భూమి అన్యాక్రాంతమైనట్లు తెలియదు.
చంద్రశేఖర్, తహశీల్దార్, నందవరం
మాన్యం.. అయితేనేం!
Published Sat, Jan 18 2014 4:04 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement