పేదరికం, వలసలు, వెనుకబాటుతనం...ఐదుదశాబ్దాలుగా మన పాలకులు సీమకు అందించిన ఆస్తి. ప్రత్యేకరాష్ట్రం ఏర్పడి దశాబ్దాలు గడిచింది. మళ్లీ విభజనకు రంగం సిద్ధమైంది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సీమకు ఇచ్చిన ఏ హామీలను పాలకులు నెరవేర్చలేదు. గతంలో తెలంగాణతో పాటు సీమలో ఉద్యమాలు వచ్చినప్పుడు అభివృద్ధికి వేర్పాటువాదం పరిష్కారం కాదని, సమైక్యంతో అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వాలు ప్రకటించాయి.
అయితే రెండుప్రాంతాలను అభివృద్ధి చేసి ప్రాంతీయ అసమానతలను రూపుమాపడంతో విఫలమయ్యాయి. ఇప్పుడేమో విభజనను తెరపైకి తెచ్చాయి. ఇప్పటి వరకూ పాలకుల నిర్లక్ష్యంతో దగాపడిన రాయలసీమ.. విభజన జరిగితే మరింత అన్యాయానికి గురికానుంది.
సాక్షి, కడప: రాయలసీమతో పాటు తెలంగాణలోనూ వెనుకబడిన ప్రాంతాలున్నాయి. 1971లో ఇరిగేషన్ కమిషన్ నిరంతరం కరువులకు గురయ్యే ప్రాంతాలుగా నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, అనంతపురం, కర్నూలు, కడపను గుర్తించాయి. 750 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఇక్కడ నమోదవుతోంది. ఇక్కడ కరువు సమస్యలను అధిగమించేందుకు క్షామపీడిత ప్రాంతాల అభివృద్ధి పథకాలు గత 25 ఏళ్లుగా అమలవుతున్నాయి. ప్రజాప్రతినిధుల బాధ్యతారాహిత్యంతో ఈ జిల్లాలలో సాగు, తాగునీటి సమస్యలు పెరిగాయే కానీ తగ్గలేదు. కరువు ప్రాంతాల అభివృద్ధికి శాశ్వత పరిష్కారం సేద్యపునీటి వనరులను అభివృద్ధి చేయడమే. ఈ దిశగా పాలకులు దృష్టి సారించలేదు. రాయలసీమ కంటే తెలంగాణలోనే(నల్గొండ, మహబూబ్‌నగర్ మినహా) వర్షాధారం ఎక్కువ. అయినప్పటికీ రాయలసీమ కంటే తెలంగాణ వెనుకబడి ఉందని అక్కడి పాలకులు ఓ ఉద్యమాన్ని చేపట్టారు. రాష్ట్రాన్ని చీల్చేస్థితికి తీసుకొచ్చారు. రాష్ట్రం విడిపోతే సాగునీటి విషయంలో సీమకు తీరని నష్టం వాటిల్లనుంది.
ఆది నుంచి సీమకు అన్యాయమే:
భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం 1937లో రాయలసీమ, కోస్తా ఆంధ్ర పెద్దమనుషుల మధ్య కుదిరిన శ్రీబాగ్ ఒప్పందంలో కృష్ణాజలాల వినియోగంలో సీమ ప్రయోజనాలు నెరవేర్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు తరలించాలనే ఒప్పందం ఉంది. నేటికీ అది ఉల్లంఘించబడుతోంది. తద్వారా ప్రతి అంశంలో సీమకు అన్యాయమే జరిగింది. తుంగభద్ర ప్రాజెక్టును 300 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని 1901లో మెకంజీ ప్రతిపాదించారు. అయితే 230 టీఎంసీలకు ప్రాజెక్టును కుదించి దిగువన కృష్ణానదికి 70 టీఎంసీల జలాలను వదిలేలా రూపలక్పలన చేశారు. ఇది సీమకు జరిగిన మొదటి అన్యాయం. ఆపై 60 టీఎంసీలకు సామర్థ్యంతో నిర్మించాల్సిన గండికోటకు తిలోదకాలిచ్చారు.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో(అప్పట్లో తెలంగాణ నిజాం పాలనలో ఉంది) రూపొందించి కేంద్ర జలవనరుల ఆమోదం పొందిన కృష్ణా పెన్నార్ ప్రాజెక్టుకు తిలోదకాలిచ్చి నాగార్జునసాగర్ ను నిర్మించారు. దీని వల్ల తెలాంగాణ, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు మేలు జరిగితే సీమకు మరోసారి అన్యాయం జరిగింది. అలాగే భోస్లా కమిటీ చేసిన విలువైన సూచనలు సిద్ధేశ్వరం, గండికోట ప్రాజెక్టులు నిర్మించడం, కేసీ కాల్వ 6000 క్యూసెక్కుల ప్రవాహంతో ఆధునికీకరించడం. ఈ ప్రతిపాదన బుట్టదాఖలు చేశారు.
కర్నూలు రాజధానిని తెలంగాణకు తరలించిన మన త్యాగమూర్తులు, అభివృద్ధి పక్కనపెడితే సాగునీటిని రప్పించుకోవడంలో కూడా మన పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. చివరకు గాలేరు-నగరి, హంద్రీనీవా, తుంగభద్ర హైలెవల్ కెనాల్ వెడల్పు నిర్మాణంతో పాటు తెలుగుగంగకు నికర జలాలను సాధించుకోలేకపోయారు. 2004కు ముందు రాష్ట్రాన్ని పాలించిన సీమవాసులంతా ఈ విషయంలో అన్యాయమే చేశారు. కేవలం వైఎస్ హయాంలోనే ఇవి నిర్మాణదశకు వచ్చాయి. పైన చెప్పిన ప్రాజెక్టులు పూర్తయి ఉంటే రాయలసీమలో సాగునీటి సమస్య కొంతైనా తీరేది.
ఉద్యమం...ఏదీ ఫలితం?:
రాయలసీమతో పాటు మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు కృష్ణా జలాలు అందించి సేద్యపు సమస్యలు తీర్చాలని కొన్నేళ్లుగా సీమవాసులు పోరాడుతున్నా ఫలితం లేదు. మద్రాసు తాగునీటికి 15 టీఎంసీలు, తెలుగుగంగకు 29 టీఎంసీలు, శ్రీశైలం కుడికాల్వకు 19 టీఎంసీలు, గాలేరునగరికి 38 టీఎంసీలు, పీఏబీఆర్ కు 10 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా కేటాయించాలని సీమవాసులు గతంలో ఉద్యమించారు. గత ప్రభుత్వాలకు విన్నవించారు. అలాగే శ్రీశైలం వెనుకభాగం నుండి హంద్రీనీవా ప్రాజెక్టుకు 40 టీఎంసీలు కేటాయించాలని కోరారు.
తద్వారా కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరులో 6.205 లక్షల ఎకరాల ఆయకట్లుకు సాగునీరు అందుతుంది. అలాగే వెలిగొండకు 32.5 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ఎడమకాలువకు 30 టీఎంసీలు, కల్వకుర్తి పథకానికి 25 టీఎంసీలు, భీమాకు 20 టీఎంసీలు, నెట్టెంపాడుకు 20 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 5.5 టీఎంసీలు కేటాయించాలని సీమవాసులే ఉద్యమించారు. ఈ డిమాండ్ల సాధన కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమం నడిచింది. ఉద్యమంలో డాక్టర్ ఎంవీ రమణారెడ్డితో పాటు మైసూరారెడ్డి కీలకపాత్ర పోషించారు.
ప్రణాళిక మనది...ఫలితం తెలంగాణకు:
1990 సెప్టెంబరు 24న ఎంవీ మైసూరారెడ్డి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల రిటైర్డు ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. కృష్ణాజలాల్లో పంటమార్పులు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించి దాదాపు 190 టీఎంసీల జలాలను ఆదా చేసుకునేలా ఓ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందించారు. ఇదే ప్రతిపాదనను 1983లో ఎంఈ రమణారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి కూడా చేశారు. కృష్ణాబ్యారేజ్ ఎగువన, సాగర్ దిగువ ప్రాంతంలో ఈ ప్రణాళికను అమలు చేశారు. తద్వారా ఎగువన కరువు ప్రాంతాలకు నీటి కేటాయింపులు ఇవ్వాలని నివేదికలో రూపొందించారు. అయితే అలా ఆదాచేయబడిన నికరజలాలల్లో బీమా ప్రాజెక్టుకు 20 టీఎంసీలు, ఎలిమినేటి మాధవరెడ్డి పథకానికి 12 టీఎంసీలు కేటాయించారు.
వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీశైలంలో ఆవిరి నష్టం కింద ఆదాచేయబడిన 11 టీఎంసీలను, కృష్ణాడెల్టా కింద ఆధునికీకరణ ద్వారా 40 టీఎంసీల నికర జలాలను పులిచింతలకు కేటాయించారు. కృష్ణా డెల్టాలో ఆధునికీకరణ ద్వారా ఆదా చేసిన 83 టీఎంసీల నికర జలాలలో ఒక్క టీఎంసీని కూడా సీమ ప్రాజెక్టుకు కేటాయించలేదు. ఇందుకు కారణం 15 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ ప్రభుత్వానిదే అని సుస్పష్టమవుతుంది. 2004 తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 4,500 క్యూసెక్కులకు పెంచారు. హంద్రీ-నీవా, గాలేరునగరితో పాటు పలు ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారు. గతంలోనే ప్రాజెక్టుల నిర్మాణం, నీటి కేటాయింపుల్లో టీడీపీ ప్రభుత్వాన్ని నడిపిన చంద్రబాబు చొరవ చూపిఉంటే ఈ రోజు సీమకు సాగునీటి ముప్పు కాస్తయినా తప్పేది.
ఈ పాపం పాలకులదే
Published Fri, Aug 23 2013 5:41 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement
Advertisement