ఆదోని, న్యూస్‌లైన్: ఆయిల్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో వేరుశనగ దిగుబడులను అమ్ముకునేందుకు రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. జిల్లాలో నాలుగు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటి వరకు కర్నూలు, ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులకే పరిమితమయ్యాయి. ఎమ్మిగనూరులో హమాలీల సమస్య అడ్డంకిగా మారింది.
ఆలూరులో కొనుగోలు కేంద్రం ఊసే కరువైంది. ప్రారంభమైన రెండు కేంద్రాల్లోనూ సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ కారణంగా కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో వేరుశనగ 1.30 లక్షల హెక్టార్లలో సాగయింది. అయితే సకాలంలో వర్షాలు కురవకపోవడం, తెగుళ్ల కారణంగా దిగుబడులు బాగా తగ్గిపోయాయి. ఎకరాకు ఐదారు బస్తాల దిగుబడి కూడా చేతికందని పరిస్థితి. అరకొర దిగుబడులకు మార్కెట్‌లోనూ ఆశించిన ధర పలుకకపోవడం రైతులను నిరాశపరుస్తోంది. నాణ్యతను బట్టి క్వింటాలు ధర రూ.2309 నుంచి రూ.3580 మించలేదు. అప్పులు, ఇతర ఆర్థిక అవసరాల కారణంగా గిట్టుబాటు ధర లేకపోయినా రైతులు నష్టాలకే దిగుబడులను తెగనమ్ముకుంటున్నారు.
ఖరీఫ్ సీజన్ పూర్తయి దాదాపు రెండు నెలలైంది. అప్పులోళ్ల ఒత్తిళ్లు, ఆర్థిక అవసరాలతో ఇప్పటికే దాదాపు 70 శాతం రైతులు తమ దిగుబడులను అమ్ముకున్నట్లు అంచనా. ప్రభుత్వం క్వింటాలు రూ.4 వేల ధరతో కొనుగోలుకు ముందుకొచ్చినా.. ఇప్పటికే దిగుబడులను అమ్మేసుకున్న 70 శాతం రైతులకు లబ్ధి చేకూరు పరిస్థితి కరువైంది. ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం పట్ల రైతుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదోని, కర్నూలులో ఈ నెల 10న కేంద్రాలు ప్రారంభం కాగా శుక్రవారం వరకు ఆదోనిలో 2526 క్వింటాళ్లు, కర్నూలులో దాదాపు 3వేలు క్వింటాళ్లు మాత్రం ఆయిల్‌ఫెడ్ అధికారులు కొనుగోలు చేశారు.
మందకొడిగా కొనుగోళ్లు: కేంద్రాల్లో వేరుశనగ కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ఒకే అధికారి శ్యాంపిళ్లను పరిశీలించి కొనుగోలుపై నిర్ణయం తీసుకోవడంతో పాటు బిల్లులు, తూకాలు చూసుకోవాల్సి వస్తోంది. విధిలేని పరిస్థితుల్లో తూకాలకు వ్యవసాయ కూలీలను నియమించారు. వీరికి సరైన అవగాహన లేక తూకాలు నిదానమవుతుండటంతో రైతులు రెండు మూడు రోజులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ నెల చివరి వరకే కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత రైతులు మళ్లీ మార్కెట్‌లనే ఆశ్రయించాల్సి ఉంది. ఈ దృష్ట్యా కొనుగోలు కేంద్రాలను మరికొంత కాలం నిర్వహించాలని.. అదేవిధంగా అదనపు సిబ్బందిని నియమించాలని రైతులు కోరుతున్నారు.
మూడో రోజు అమ్ముకున్నాను:
ఆయిల్‌ఫెడ్ కేంద్రంలో అమ్ముకోవడానికి మూడు రోజులు నిరీక్షించాల్సి వచ్చింది. ముఖ్యంగా హమాలీల కొరత ఉంది. ఉన్న వారికి తూకాలు వేయడం, సంచుల్లో నింపడం తెలియడం లేదు. ప్రభుత్వం రైతులకు మేలు చేకూర్చడం మరుస్తోంది.
కేశవరెడ్డి, వేరు శనగ రైతు, పత్తికొండ
మూడింట రెండొంతులు అమ్ముకున్నారు:
మా గ్రామంలో ఇప్పటికే మూడింట రెండొంతుల మంది రైతులు దిగుబడులు అమ్మేసుకున్నారు. సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లయితే అందరికీ లబ్ధి కలిగేది. ఇప్పుడు ఏర్పాటు చేయడం కంటితుడుపు చర్యే.
వీరభద్రుడు, రైతు, ఎద్దులదొడ్డి
అమ్మబోతే.. అవస్థలే
Published Sat, Jan 18 2014 4:07 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement