నేడు తుంగా హారతి
– ఏర్పాట్లలో శ్రీమఠం అధికారులు
– నదీ తీరం, ప్రాంగణంలో దీపోత్సవం
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి సన్నిధిలో సోమవారం పవిత్ర తుంగా హారతి ఇవ్వనున్నారు. ఇందుకు పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేతృత్వంలో తుంగభద్ర నది తీరంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 6 నుంచి 11 గంటల వరకు పుణ్యహారతి, కార్తీక దీపోత్సవం చేపడతారు. ముందుగా ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను ప్రత్యేక వాహనంపై గజరాజు స్వాగతిస్తుండగా మంగళవాయిద్యాలు, భజనలు, వేద పఠనంతో ఊరేగింపుగా నది చెంతకు తీసుకువస్తారు. అక్కడ పీఠాధిపతి తుంగా హారతి విశిష్టతను భక్తులకు ప్రవచిస్తారు. పవిత్ర నది జలంతో ఆజ్యం ఇచ్చి కుంకుమార్చన, నారీకేళ సమర్పణ, వాయినాలు వదిలి శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు. అర్చకులు కార్తీక దీపాలతో వేదపఠనం సాగిస్తూ హారతులు పడతారు. భక్తులు వేలాదిగా నదీ తీరం, శ్రీమఠం ప్రధాన ద్వారం, ప్రాంగణాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తారు. ఈ నేపథ్యంలో మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.