చివరి ఆయకట్టుకు 400 క్యూసెక్కుల నీరు
చివరి ఆయకట్టుకు 400 క్యూసెక్కుల నీరు
Published Wed, Oct 19 2016 10:22 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM
ఆదోని రూరల్ : తుంగభద్ర దిగువ కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో చివరి ఆయకట్టు వరకు 400 క్యూసెక్కుల నీటిని అందించేందుకు పటిష్ట చర్యలు చేపడదామని టీబీపీ డ్యాం అధికారులు, ఎల్లెల్సీ అధికారులు తీర్మానించారు. బోర్డు నుంచి ఆంధ్రాకు రావాల్సిన 600 క్యూసెక్కుల నీటిని కర్ణాటక నానాయకట్టు రైతులు అక్రమంగా వాడుకుంటున్నారని కనీసం కౌతాళం డీపీ నం.74వ కి.మీ. వరకు ఎల్‌ఎల్సీ ప్రధాన కాలువకు నీరు అందకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన రైతులు మంగళవారం ఆదోనిలో ఉన్న ఎల్లెల్సీ ఈఈ కార్యాలయాన్ని దిగ్భందించి ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఎల్లెల్సీ అధికారులు ఎస్‌ఈ చంద్రశేఖర్ రావు, ఈఈ భాస్కర్‌రెడ్డి, టీబీ బోర్డు అధికారులు ఎస్‌ఈ శశిభూషణ్ రావు, ఈఈ విశ్వనాథ్‌రెడ్డితో బుధవారం స్థానిక ఈఈ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
చింతకుంట 135కి.మీ. వరకు 800 క్యూసెక్కుల నీటిని తీసుకొచ్చే బాధ్యత తాము తీసుకుంటామని బోర్డు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి 250 కి.మీ. గల చివరి ఆయకట్టు వరకు కనీసం 400 క్యూసెక్కుల నీటిని రైతులకు అందించే విధంగా ఎల్లెల్సీ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంపై బోర్డు సెక్రటరీతో సమావేశం నిర్వహించి త్వరలోనే రైతులకు నీటిని అందించే విధంగా చొరవ చూపుతామని టీబీ అధికారులు హామీ ఇచ్చారు. ఎస్‌ఈ చంద్రశేఖర్ రావు, ఈఈ భాస్కర్‌రెడ్డి , బోర్డు డీఈలు పంపన్న, గౌడ్, శ్రీనివాసనాయక్, ఎల్‌ల్సీ డీఈలు నెహామియా, విశ్వనథ్‌రెడ్డి, జేఈలు పాల్గొన్నారు.
Advertisement