నీరు నిండితే ఒట్టు
నీరు నిండితే ఒట్టు
Published Mon, Apr 24 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 9:31 AM
- ఎల్లెల్సీలో అడుగంటిన ప్రవాహం
- బాపురం, చింతకుంట రిజర్వాయర్లకు స్తబ్ధుగా పంపింగ్
- 3శాతానికి మించి నిండని హొళగుంద ఎస్‌ఎస్ ట్యాంకు
- నేటి ఉదయానికి కాల్వలో నీరు నిలిచిపోయే అవకాశం
- తాగునీటి సమస్యపై తీరని ఆందోళన
ఆలూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల తాగునీటి అవసరాలకు ప్రధాన ఆధారంగా ఉన్న రిజర్వాయర్లు, ఎస్‌ఎస్ ట్యాంకులకు దిగువ కాల్వల నీటిని పంపింగ్ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోంది. వారం రోజులుగా ఎల్లెల్సీలో నీరు పారుతున్నా పంపింగ్ స్తబ్ధుగా సాగుతుండడంతో కనీస స్థాయిలో కూడా నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కాల్వలో నీటి పారకం అడుగంటడం, రిజర్వాయర్లు నిండకపోవడంతో వచ్చే రెండు నెలల్లో తాగునీటి సమస్యపై ఆందోళన వ్యక్తమవుతోంది.
హాలహర్వి/హొళగుంద: వేసవిలో తాగునీటి అవసరాల కోసం టీబీ డ్యాంనుంచి దిగువ కాల్వ ద్వారా విడుదల చేసిన నీటిని రిజర్వాయర్లకు పంపింగ్ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోంది. ఫలితంగా దిగువ కాల్వలో నీటి ప్రవాహం అడుగంటినా రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపుకోలేని పరిస్థితి నెలకొంది. హాలహర్వి మండలానికి సంబంధించి బాపురంలో రెండు, చింతకుంటలో ఒకటి, హొళగుంద మండల కేంద్రంలో ఎస్‌ఎస్ ట్యాంకుంది. చింతకుంట నుంచి 18 గ్రామాలకు , బాపురం నుంచి 27 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. రెండు నెలల నుంచి కాల్వలో నీరు బంద్ కావడంతో రిజర్వాయర్లు పూర్తిగా ఎండి పోయాయి. దీంతో కుళాయిలకు నీటి సరఫరా నిలిచిపోయి తాగునీటి కోసం జనం ఇబ్బందులు పడ్డారు. సమస్యను దృష్టిలో ఉంచుకుని టీబీ డ్యాం అధికారులు ఈ నెల 7న కాల్వకు నీటిని విడుదల చేయగా 13వ తేదీ నాటికి నీరు ఆంధ్రా సరిహద్దు చేరింది. ఈ నీటిని రిజర్వాయర్లకు పంపింగ్ చేసి తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, జేఈలకు ఆదేశాలు ఇచ్చారు.
పూర్తిస్థాయిలో నిండితే కదా..
బాపురం పాత రిజర్వాయర్‌లో 8, కొత్త రిజర్వాయర్‌లో 14 అడుగుల మేరకు నీటిని నింపుకోవాల్సి ఉంది. ఇలా చేస్తే వాటి పరిధిలోని 27 గ్రామాలకు ఐదు నెలల పాటు డోకా ఉండదు. అయితే పైప్‌లైన్ సరిగా లేదంటూ పాత రిజర్వాయర్‌ను పక్కనపెట్టిన అధికారులు కొత్త రిజర్వాయర్ కోసం పది అదనపు మోటార్లు ఏర్పాటు చేసినా ఆరడుగులకు మించి నింపలేకపోయారు. చింతకుంట రిజర్వాయర్‌ది కూడా ఇదే పరిస్థితి(ఆరడుగులు నిండింది). ఈ నీటిని రోజు మర్చి రోజు సరఫరా చేసినా వాటి పరిధిలోని గ్రామాలకు నెలకు మించి సరిపోయే పరిస్థితి లేదన్న అభిప్రాయం ఉంది. మరోవైపు అదనపు మోటార్లు లేక పోవడంతోనే రిజర్వాయర్లను నింపలేకపోయామని ఆర్‌డబ్ల్యూఎస్ సిబ్బంది చెబుతున్నారు. మే 10వరకు కాల్వలో పారకం ఉంటే పూర్తిస్థాయిలో నింపేవారమని జేఈ రాంనీలా చెప్పారు.
హొళగుంద ఎస్‌ఎస్ ట్యాంకు..
స్థానిక కడ్లమాగి వద్ద రూ.10 కోట్లతో నిర్మించిన ఎస్‌ఎస్ ట్యాంకు ఆదివారం నాటికి 30 శాతం నిండింది. ఈ నెల 13 నుంచి 150 హెచ్‌పీ మోటార్లతో పంపింగ్ చేస్తున్నారు. 6.30 లక్షల క్యూబిక్ మీటర్ల విస్తీర్ణం 30 మీటర్ల ఎత్తున్న ఈ ట్యాంకుకు 11 రోజులపాటు పంపింగ్ చేసినా 2.6 మీటర్లకు మించలేదు. ఈ నీరు హొళగుంద వాసుల తాగునీటి అవసరాలకు 40 రోజులకు మించి సరిపోయే పరిస్థితి లేదని అధికారులే చెబుతున్నారు. ట్యాంకు పనులు కొన్ని నెలల ముందుగానే పూర్తయినా నీటిని నిల్వ చేయడంలో నిర్లక్ష్యం చేయడం వల్లే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందని జనం వాపోతున్నారు. సోమవారం ఉదయానికి కాల్వలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. సమ్మతగేరి, హెబ్బటం ట్యాంకుల సామర్థ్యం వరుసగా 3లక్షలు, 6లక్షల క్యూబిక్ మీటర్లుండగా పూర్తిస్థాయిలో నింపేశారు.
రిజర్వాయర్ - సామర్థ్యం - ప్రస్తుత నిల్వ
బాపురం-1 (కొత్తది) - 14 అడుగులు - 6 అడుగులు
బాపురం -2(పాతది) - 8 అడుగులు - 0
చింతకుంట : 13 అగుగులు - 6 అడుగులు
హొళగుంద ఎస్‌ఎస్ ట్యాంకు 30 మీటర్లు 2.6 మీటర్లు
సమ్మతగేరి 3లక్షల క్యూ.మీ. పూర్తిస్థాయి
హెబ్బటం 6 లక్షలు కూ.మీ. పూర్తిస్థాయి
Advertisement
Advertisement