pumping
-
వాటర్ అలర్ట్!
సాక్షి, సిటీబ్యూరో: నాగార్జునసాగర్ జలాశయంలో నీరు అడుగంటుతోంది. దీంతో నగరానికి కృష్ణాజలాల సరఫరా ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో జలమండలి ప్రత్యామ్నాయ చర్యలకు దిగింది.నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్ (పుట్టంగండి) వద్ద జలమండలి ఏర్పాటుచేసిన అత్యవసర పంపుల ద్వారా పంపింగ్ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ఈ నెల 7 నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభం కానుంది. నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్(పుట్టంగండి)వద్ద జలమండలి ఏర్పాటుచేసిన అత్యవసర పంపులకు శుక్రవారం ట్రయల్‌రన్ నిర్వహించనున్నారు. ఈ నెల 10 (సోమవారం)నుంచి పూర్తిస్థాయిలో అత్యవసర పంపింగ్ ప్రారంభించనున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. పుట్టంగండి వద్ద ఏర్పాటుచేసిన అత్యవసర పంపింగ్ మోటార్లను బుధవారం జలమండలి సాంకేతిక విభాగం డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. ఈ పంపులకు 33 కెవి ట్రాన్స్మిషన్ లైను నుంచి విద్యుత్ సరఫరా జరగనుంది. అత్యవసర పంపింగ్ ద్వారా నిత్యం కృష్ణా మూడు దశలకు అవసరమైన 270 మిలియన్ గ్యాలన్ల జలాలను నగరానికి తరలించనున్నారు. ఇందుకోసం 600 హెచ్‌పీ సామర్థ్యంగలవి 5, మరో ఐదు 300 హెచ్‌పీ సామర్థ్యంగల మోటార్లను ఏర్పాటు చేశారు. కాగా నాగార్జున సాగర్ గరిష్టమట్టం 590 అడుగులు కాగా..ప్రస్తుతం 508.7 అడుగుల మేర నీటినిల్వలున్నాయి. నీటిమట్టాలు 507 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నందున అత్యవసర పంపింగ్ ఏర్పాట్ల ద్వారా నగరానికి తరలించనున్న కృష్ణాజలాలకు గండిపడకుండా జలమండలి ముందస్తు చర్యలు చేపట్టింది. కాగా గ్రేటర్‌నగరానికి ప్రస్తుతం గోదావరి మొదటిదశ,కృష్ణా మూడుదశలతోపాటు జంటజలాశయాలు హిమాయత్‌సాగర్,ఉస్మాన్‌సాగర్‌ల నుంచి నిత్యం 465 మిలియన్‌గ్యాలన్ల నీటిని సేకరించి..శుద్ధిచేసి నగరంలోని 9.80 లక్షల నల్లాలకు జలమండలి సరఫరా చేస్తోంది. ప్రస్తుతం గ్రేటర్లో భూగర్భజలమట్టాలు గణనీయంగా పడిపోవడంతో జలమండలి నల్లా,ట్యాంకర్ నీళ్లకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. దీంతో అదనపు ట్యాంకర్ల ద్వారా జలమండలి వినియోగదారులకు తాగునీటిని అందిస్తోంది. ఇటీవల వీస్తున్న ఈదురుగాలులకు తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండడంతో నగరానికి తరలిస్తున్న నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. సాంకేతిక సమస్యలను అధిగమించి నగరంలో పానీపరేషాన్ తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు. ప్రస్తుతం ఎల్లంపల్లి(గోదావరి),జంటజలాశయాల్లో నీటినిల్వలు సంతృప్తస్థాయిలోనే ఉన్నాయని..నగర తాగునీటి సరఫరాకు ఢోకాలేదని స్పష్టంచేశారు. త్వరలో రుతుపవనాలు కరుణిస్తే ఆయా జలాశయాల్లో నీటిమట్టాలు గణనీయంగా పెరుగుతాయని ఆయన ఆశాబావం వ్యక్తంచేశారు. -
ఖరీఫ్ ఆకుమడులకు సాగునీరు
ఇరిగేషన్ అధికారులకు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆదేశం ఆత్రేయపురం (కొత్తపేట) : పేరవరం పంపింగ్ స్కీమ్ పునర్నిర్మాణ పనులను ఈ నెల 14లోగా పూర్తిచేసి ఖరీఫ్ ఆకుమడులకు సాగునీరు అందజేయాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలోని పేరవరం పంపింగ్ స్కీమ్, వాడపల్లి నూతన బ్రిడ్జి నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. 2004లో అప్పటి జేసీ ఉదయలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ పంపింగ్ స్కీమ్ పాత మోటార్లకు మరమ్మతులు చేశారని, తిరిగి ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందన్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పంపింగ్ స్కీమ్ ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయించినట్టు వివరించారు. నూతన అసెంబ్లీలో సైతం ఈ విషయంపై ప్రస్తావించామని గుర్తు చేశారు. ఈలోగా కొందరు అధికార పార్టీ నేతలు సీఎం చంద్రబాబుకు నిధుల మంజూరుపై కృతజ్ఞతలు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిం చిందన్నారు. 16 గంటల విద్యుత్ కోసం... వసంతవాడ, ఉచ్చిలి ఎత్తిపోతల పథకాలకు 16 గంటలు విద్యుత్ సరఫరా విషయాన్ని రైతుల తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్టు జగ్గిరెడ్డి చెప్పారు. వాడపల్లి వద్ద రూ1.98 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు యుద్ధ ప్రాతిపతికన పూర్తి చేయాల్సిందిగా అదేశించారు. ఈ ప్రాంతంలో అరటి గెలలు సైకిళ్లతో వచ్చే రైతుల కోసం సర్వీస్ రోడ్డును వంతెన సమీపంలో ఏర్పాటు చేయాలని డీఈ శ్రీనివాస్‌కు సూచించారు. కొందరు నాయకులు ఉనికి కాపాడుకోవడానికి, కమీషన్ల కోసం ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఆలమూరు మండలం బడుగువానిలంకలో రైతుల కోసం ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ వద్ద పోరాడి రైతుల సమస్యలు పరిష్కరించామన్నారు. రావులపాలెం పార్టీ ప్లీనరీని విజయవంతం చేసిన నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇరిగేషన్ శాఖ డీఈ శ్రీనివాస్, ఏఈలు శ్రీనివాస్, రాజమౌళి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, జెడ్పీటీసీ మద్దూరి సుబ్బలక్ష్మి, పార్టీ మండల కన్వీనర్లు కనుమూరి శ్రీనివాసరాజు, తమ్మన శ్రీనివాస్, రైతు విభాగం రాష్ట్ర సభ్యులు చిలువూరి నాగరామసత్యనారాయణరాజు (బాబిరాజు), చిలువూరి దుర్గరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు కొల్లి శ్యామ్సన్, సర్పంచ్ కోమలి సత్యనారాయణ, ఉప సర్పంచ్ చిలువూరి చిన వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. -
నీరు నిండితే ఒట్టు
- ఎల్లెల్సీలో అడుగంటిన ప్రవాహం - బాపురం, చింతకుంట రిజర్వాయర్లకు స్తబ్ధుగా పంపింగ్ - 3శాతానికి మించి నిండని హొళగుంద ఎస్ఎస్ ట్యాంకు - నేటి ఉదయానికి కాల్వలో నీరు నిలిచిపోయే అవకాశం - తాగునీటి సమస్యపై తీరని ఆందోళన ఆలూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల తాగునీటి అవసరాలకు ప్రధాన ఆధారంగా ఉన్న రిజర్వాయర్లు, ఎస్ఎస్ ట్యాంకులకు దిగువ కాల్వల నీటిని పంపింగ్ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోంది. వారం రోజులుగా ఎల్లెల్సీలో నీరు పారుతున్నా పంపింగ్ స్తబ్ధుగా సాగుతుండడంతో కనీస స్థాయిలో కూడా నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కాల్వలో నీటి పారకం అడుగంటడం, రిజర్వాయర్లు నిండకపోవడంతో వచ్చే రెండు నెలల్లో తాగునీటి సమస్యపై ఆందోళన వ్యక్తమవుతోంది. హాలహర్వి/హొళగుంద: వేసవిలో తాగునీటి అవసరాల కోసం టీబీ డ్యాంనుంచి దిగువ కాల్వ ద్వారా విడుదల చేసిన నీటిని రిజర్వాయర్లకు పంపింగ్ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోంది. ఫలితంగా దిగువ కాల్వలో నీటి ప్రవాహం అడుగంటినా రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపుకోలేని పరిస్థితి నెలకొంది. హాలహర్వి మండలానికి సంబంధించి బాపురంలో రెండు, చింతకుంటలో ఒకటి, హొళగుంద మండల కేంద్రంలో ఎస్ఎస్ ట్యాంకుంది. చింతకుంట నుంచి 18 గ్రామాలకు , బాపురం నుంచి 27 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. రెండు నెలల నుంచి కాల్వలో నీరు బంద్ కావడంతో రిజర్వాయర్లు పూర్తిగా ఎండి పోయాయి. దీంతో కుళాయిలకు నీటి సరఫరా నిలిచిపోయి తాగునీటి కోసం జనం ఇబ్బందులు పడ్డారు. సమస్యను దృష్టిలో ఉంచుకుని టీబీ డ్యాం అధికారులు ఈ నెల 7న కాల్వకు నీటిని విడుదల చేయగా 13వ తేదీ నాటికి నీరు ఆంధ్రా సరిహద్దు చేరింది. ఈ నీటిని రిజర్వాయర్లకు పంపింగ్ చేసి తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, జేఈలకు ఆదేశాలు ఇచ్చారు. పూర్తిస్థాయిలో నిండితే కదా.. బాపురం పాత రిజర్వాయర్‌లో 8, కొత్త రిజర్వాయర్‌లో 14 అడుగుల మేరకు నీటిని నింపుకోవాల్సి ఉంది. ఇలా చేస్తే వాటి పరిధిలోని 27 గ్రామాలకు ఐదు నెలల పాటు డోకా ఉండదు. అయితే పైప్‌లైన్ సరిగా లేదంటూ పాత రిజర్వాయర్‌ను పక్కనపెట్టిన అధికారులు కొత్త రిజర్వాయర్ కోసం పది అదనపు మోటార్లు ఏర్పాటు చేసినా ఆరడుగులకు మించి నింపలేకపోయారు. చింతకుంట రిజర్వాయర్‌ది కూడా ఇదే పరిస్థితి(ఆరడుగులు నిండింది). ఈ నీటిని రోజు మర్చి రోజు సరఫరా చేసినా వాటి పరిధిలోని గ్రామాలకు నెలకు మించి సరిపోయే పరిస్థితి లేదన్న అభిప్రాయం ఉంది. మరోవైపు అదనపు మోటార్లు లేక పోవడంతోనే రిజర్వాయర్లను నింపలేకపోయామని ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది చెబుతున్నారు. మే 10వరకు కాల్వలో పారకం ఉంటే పూర్తిస్థాయిలో నింపేవారమని జేఈ రాంనీలా చెప్పారు. హొళగుంద ఎస్ఎస్ ట్యాంకు.. స్థానిక కడ్లమాగి వద్ద రూ.10 కోట్లతో నిర్మించిన ఎస్ఎస్ ట్యాంకు ఆదివారం నాటికి 30 శాతం నిండింది. ఈ నెల 13 నుంచి 150 హెచ్‌పీ మోటార్లతో పంపింగ్ చేస్తున్నారు. 6.30 లక్షల క్యూబిక్ మీటర్ల విస్తీర్ణం 30 మీటర్ల ఎత్తున్న ఈ ట్యాంకుకు 11 రోజులపాటు పంపింగ్ చేసినా 2.6 మీటర్లకు మించలేదు. ఈ నీరు హొళగుంద వాసుల తాగునీటి అవసరాలకు 40 రోజులకు మించి సరిపోయే పరిస్థితి లేదని అధికారులే చెబుతున్నారు. ట్యాంకు పనులు కొన్ని నెలల ముందుగానే పూర్తయినా నీటిని నిల్వ చేయడంలో నిర్లక్ష్యం చేయడం వల్లే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందని జనం వాపోతున్నారు. సోమవారం ఉదయానికి కాల్వలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. సమ్మతగేరి, హెబ్బటం ట్యాంకుల సామర్థ్యం వరుసగా 3లక్షలు, 6లక్షల క్యూబిక్ మీటర్లుండగా పూర్తిస్థాయిలో నింపేశారు. రిజర్వాయర్ - సామర్థ్యం - ప్రస్తుత నిల్వ బాపురం-1 (కొత్తది) - 14 అడుగులు - 6 అడుగులు బాపురం -2(పాతది) - 8 అడుగులు - 0 చింతకుంట : 13 అగుగులు - 6 అడుగులు హొళగుంద ఎస్ఎస్ ట్యాంకు 30 మీటర్లు 2.6 మీటర్లు సమ్మతగేరి 3లక్షల క్యూ.మీ. పూర్తిస్థాయి హెబ్బటం 6 లక్షలు కూ.మీ. పూర్తిస్థాయి -
21 అడుగులకు ‘రామప్ప’ నీటిమట్టం
వెంకటాపురం : మధ్యతరహా నీటి ప్రాజెక్టు అయిన రామప్ప సరస్సులోకి దేవాదుల జలాలను గత మూడు రోజులుగా ఎయిర్ వాల్వ్‌ల ద్వారా పంపింగ్ చేస్తున్నారు. దీంతో సరస్సులో నీటిమట్టం 21 అడుగులకు చేరుకుంది. మంగళవారం ఉదయం ఐదు ఎయిర్వాల్వ్లలో రెండింటికి 600 ఎం.ఎం వ్యాసార్ధం కలిగిన పైపులను బిగించి, భీంఘన్‌పూర్ వద్ద మోటార్లను ప్రారంభించారు. దీంతో ఎయిర్‌వాల్వ్‌ల ద్వారా పెద్ద మొత్తంలో దేవాదుల జలాలు సరస్సులోకి చేరాయి. దీంతో ఆయకట్టు రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. -
తల్ల డిల్లు తుండ్రు
♦ బిందెడు నీరు దొరికితే ఒట్టు ఎండిపోయిన మంజీర నది ♦ వట్టిపోయిన భూగర్భ జలాలు నిలిచిపోయిన నీటి పథకాలు ♦ వేసవికి ముందే నీటి తిప్పలు తల్లడిల్లుతున్న జనం ♦ మున్ముందు పరిస్థితి మరింత దారుణం ♦ మెతుకుసీమలో నీటిగోస వట్టిపోయిన నీటి వనరులు ♦ ఆందోళనలో జనం మెతుకుసీమలో నీటి తండ్లాట.. దాహం... దాహం... జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. వేసవికి ముందే మంచి నీటి కోసం మెతుకు సీమ జనం తల్లడిల్లిపోతోంది. మహిళలు, పురుషులు, పిల్లలు సైతం బిందెడు నీటికోసం పంట పొలాల వైపు పరుగులు తీస్తున్నారు. అక్కడా రైతుల చీత్కారాలు తప్పట్లేదు. కూలీలైతే పనులు, విద్యార్థులైతే బడి మానేసి నీటికోసం తంటాలు పడుతున్నారు. జిల్లాతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలో గత రెండేళ్లుగా సరైన వర్షాలు లేకపోవడంతో మంజీరలోకి వరదనీరు రాకపోవడంతో అది వేసవికి ముందే ఎండిపోయింది. నాలుగు దశాబ్దాల తరువాత అంతటి ఘోరమైన పరిస్థితి ఏర్పడింది. మంజీరపై నిర్మించిన నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని నీటిపథకాలు సైతం నిలిచిపోవడంతో వందలాది గ్రామాల వారు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ఏ గల్లీలోకి ట్యాంకర్ వచ్చినా ఎగబడి పట్టుకుంటున్నారు. అక్కడక్కడా ముష్టియుద్ధాలకు దిగుతున్నారు. జిల్లాలో తాగునీటి సమస్యపై ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైన జనం తిప్పలు ఇలా... - నారాయణఖేడ్/ సాక్షి నెట్వర్క ఎటు చూసినా నీటి గోసే.. పెద్దలు, పిల్లలు, మహిళలు.. అందరూ నీటి కోసం పరుగులే.. రోజంతా పడిగాపులే.. పల్లెల్లో విద్యార్థులు బడి మానేసి నీళ్లు మోస్తున్న దుస్థితి. వందల గ్రామాల్లో దుర్భర స్థితి.. ప్రధాన నీటి వనరులన్నీ వట్టిపోవడంతో జనం గొంతు తడుపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. గడచిన 40 ఏళ్ళలో ఎన్నడూ ఇంతటి గడ్డుస్థితి ఏర్పడలేదని పలువురు పేర్కొంటున్నారు. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే.. మున్ముందు ఎలా ఉంటుందోనని ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో తాగునీటి సమస్యపై ‘సాక్షి’ ఫోకస్.. పటాన్చెరులో పరేషాన్... నియోజకవర్గం పరిధిలో తీవ్రమైన మంచినీటి ఎద్దడి నెలకొంది. వారానికోసారి నీరుసరఫరా అవుతోంది. పటాన్చెరు, రామచంద్రాపురం పట్టణాల్లో మూడు రోజులకోసారి నీరొస్తోంది. ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. మండలంలో మంచినీటిని ట్యాంకర్ల ద్వారానే కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బోర్లన్నీ ఇంకిపోతున్నాయి. పారిశ్రామికవాడల్లో భూగర్భ జలాలు కాలుష్యం కావడంతో అవి వాడేందుకు పనికిరాకుండా పోయాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు పటాన్చెరు నియోజకర్గ పరిధిలోని కాలుష్య గ్రామాల్లో మంచినీటి జలాలు ఉచితంగా సరఫరా చేయాలి. పటాన్చెరు మండలం సుల్తాన్పూర్, గండిగూడ, పటాన్చెరు పట్టణం, లక్డారం, ముత్తంగి, ఇస్నాపూర్, రుద్రారం, చిట్కుల్, పోచారం గ్రామాల్లో స్వచ్ఛమైన జలాలు అందించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమైనట్టు తేల్చారు. స్థానిక నాయకులు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు కొంతమేర పేదలకు ఊరట కలిగిస్తుంది. గ్రామాల్లో పారిశ్రామికవేత్తల సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. అందోల్‌లో ఆందోళనకరం... అందోలు నియోజకవర్గ పరిధిలోని అందోలు, పుల్కల్, రేగోడ్, అల్లాదుర్గం, మునిపల్లి, రాయికోడ్ టేక్మాల్ మండలాల్లో ప్రజలు తీవ్ర మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. అందోలు, పుల్కల్ మండలాలకు ప్రధానంగా పోచారం, చక్రియాల మంచినీటి ప్రాజెక్టుల ద్వారా తాగునీరు సరఫరా అవుతుంది. ఈ ప్రాజెక్టుల వద్ద నీరు లేకపోవడంతో నాలుగు రోజులకోసారి ఈ రెండు మండలాల్లోని గ్రామాలకు మంచినీరొస్తోంది. జోగిపేట పట్టణంలో మంజీర నీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి. రేగోడ్, అల్లాదుర్గం, మునిపల్లి, రాయికోడ్, టేక్మాల్ మండలాల్లో కూడా భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోవడంతో గ్రామంలో ఉన్న బోర్ల నుంచి నీరు రాకపోవడం వల్ల ఆయా గ్రామాల్లోని ప్రజలకు నీటి సమస్యలు అనేకం. ట్యాంకర్ల ద్వారా నీటి పంపిణీకి చర్యలు తీసుకోకపోవడంతో వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. చిన్నాపెద్దా, మహిళలు తేడా లేకుండా వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. సంగారెడ్డిలో నాలుగు రోజులకోమారు పంపింగ్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో నీటి సరఫరా పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. ప్రధాన ఆధార మైన మంజీర ఎండిపోగా సింగూర్ పూర్తిగా డెడ్‌స్టోరేజీకి చేరింది. దీంతో పట్టణ వాసులు ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా భావించిన వాటర్ ప్లాంట్ యజమానులు అందినంత దోచుకుంటున్నారు. ఇప్పటివరకు 72 బోర్లు వేశారు. మూడు నెలలైనా వాటికి మోటార్లు బిగించలేదు. కొత్తగా పైపులైన్లు ఏర్పాటు చేసినా నీరు రావడం రాలేదు. డీఎస్పీ క్యాంప్ కార్యాలయం నుంచి రాజంపేట, మంజీర పైపులైన్ వైపు నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరం వేసిన లైన్ వృథాగా మారింది. మంజీర డ్యామ్‌లో ఉన్న కొద్దిపాటి నీటిని పంపింగ్ ద్వారా నాలుగు రోజులకోసారి మాత్రమే సరఫరా చేస్తున్నారు. సదాశివపేట పట్టణ, మండల పరిధిలోనూ జనానికి నీటి కష్టలు తప్పడం లేదు. మానేరు అగితే... అంతే సిద్దిపేట పట్టణంతోపాటు సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాలకు వరప్రదాయినిగా మారింది మానేరు డ్యామ్. ఈ డ్యామ్ నుంచి పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. నీటి సరఫరాలో సాంకేతిక లోపం తలెత్తితే నియోజకవర్గ ప్రజలు తాగునీటి కోసం అల్లాడాల్సిందే. సాంకేతికపర సమస్యలతో ప్రతి నెలలో కొన్ని మార్లు నీటి సరఫరా నిలిచిపోతోంది. మరోవైపు సిద్దిపేట పట్టణానికి తాగునీటి సరఫరా చేసే లోయర్ మానేర్ డ్యాం ఇంటెక్‌వెల్‌లో ఇసుక మేటలు పేరుకుపోవడంతో కొన్ని రోజులుగా ఇసుక మేటలను తొలగించే పనిని మున్సిపల్ అధికారులు వేగవంతంగా చేపడుతున్నారు. ఈ క్రమంలో సిద్దిపేటకు గత రెండు రోజులుగా నీటి సరఫరాలో అంతరాయం కలగడంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ముందస్తుగానే నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టారు. నర్సాపూర్‌లో నానా తంటాలు... వేసవికి ముందే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నీటి కోసం జనం ఫిబ్రవరి నుంచే అల్లాడుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని 220 గ్రామాలకు, గజ్వేల్ నియోజకవర్గంలోని 80గ్రామాలకు మంజీర నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేందుకు హత్నూర మండలం బోర్పట్ల వద్ద ఏర్పాటు చేసిన మంజీర నీటి శుద్ధి కేంద్రం నీరు అందుబాటులో లేకుండా పోయింది. రోజుకు 81 లక్షల లీటర్లను 14 గంటల్లో శుద్ధి చేసి ఆయా గ్రామాలకు పంపింగ్ చేసే బోర్పట్ల శుద్ధి కేంద్రానికి మంజీర నుంచి నీటి సరఫరా లేకపోవడంతో శుద్ధి కేంద్రం అలంకారప్రాయంగా మారింది. పలు గ్రామాల్లో వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకున్నా నీటి సరఫరాకు ట్యాంకుల వరకు పైపులైను ఏర్పాటు చేయకపోవడంతో చాలా దూరం నుంచి నీటిని మోయాల్సి వస్తోంది. గజ్వేల్‌లో జఠిలం.. నియోజకవర్గంలో నీటి సమస్య జఠిలంగా మారింది. వచ్చే నీరు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని గజ్వేల్‌తోపాటు ప్రజ్ఞాపూర్, ముట్రాజ్‌పల్లి, క్యాసారం, రాజిరెడ్డిపల్లి, సంగుపల్లి, సంగాపూర్ గ్రామాల్లో మొత్తం 4,270 నల్లాకనెక్షన్లు, మరో 1,500వరకు అక్రమ కనెక్షన్లు ఉన్నాయి. జనాభా 44 వేలకుపైగా ఉంది. నిజానికి నగర పంచాయతీలో ప్రతి వ్యక్తికి 100 లీటర్ల చొప్పున లెక్కిస్తే సుమారు 5ఎంఎల్డీ(50 లక్షల లీటర్లు) అవసరముంటుంది. కానీ ఇక్కడున్న 108 బోరుబావులు, 15 ఓవర్‌హెడ్ ట్యాంకుల ద్వారా ప్రస్తుతం 24.9 ఎంఎల్డీ (24.9 లక్షల లీటర్లు) మాత్రమే సరఫరా అవుతోంది. ఆ నీరు ఏమాత్రం సరిపోక జనం నానా ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలో నగర పంచాయతీ ఆధ్వర్యంలో వేసవిలో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, బోరుబావుల తవ్వకం తదితర పనుల కోసం రూ.38లక్షలకు పైగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ తరుణంలో గోదావరి జలాలను గజ్వేల్ నగర పంచాయతీకి వెంటనే తరలించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రజ్ఞాపూర్ నుంచి గోదావరి జలాల పైప్‌లైన్‌ను ట్యాప్ చేసి 10కిలోమీటర్ల దూరంలోని కోమటిబండ అటవీ ప్రాంతంలో నిర్మిస్తోన్న భారీ సంప్‌కు మళ్లించనున్నారు. ఈ పనులు పూర్తి కావచ్చాయి. కొద్ది రోజుల్లోనే నగర పంచాయతీకి సంప్‌హౌస్ నుంచి నీటి కనెక్షన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నారాయణఖేడ్‌లో నత్తనడకన పనులు.. నియోజకవర్గంలోని నారాయణఖేడ్, కల్హేర్, కంగ్టి, మనూర్, పెద్ద శంకరంపేటలో నీటిసమస్య తీవ్రంగా ఉంది. మంజీర నది పూర్తిగా ఎండిపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. పరిస్థితిని గమనించిన మంత్రి హరీశ్‌రావు ఇటీవల మంజీర ప్రాజెక్టు నుంచి మొదలుకొని గట్టులింగంపల్లి, నల్లవాగు ప్రాజెక్టు వరకు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. నల్లవాగు ప్రాజెక్టు నీటిని పంపింగ్ ద్వారా నారాయణఖేడ్ పట్టణానికి, సమీప గ్రామాలకు పంపింగ్ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గ్రామాల్లో విద్యార్థులు బడి మానేసి నీళ్లు మోయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మెదక్‌లో నాలుగు నెలలుగా... మెదక్ పట్టణంలో నాలుగు నెలలుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పట్టణంలో రోజు విడిచి రోజు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకొని విరివిగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మెదక్ పట్టణంలో అధికారిక లెక్కల ప్రకారం 13వేలకు పైచిలుకు గృహాలుం డగా, సుమారు 70వేల జనాభా ఉంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా పసుపులేరులో నీటి ఊటలు పూర్తిగా తగ్గిపోయాయి. పట్టణంలోని బోరుబావుల పరిస్థితీ అలాగే ఉంది. పట్టణానికి ఆనుకొని ఉన్న దాయర వీధిలో ఇప్పటికే రెండు బోర్లను అద్దెకు తీసుకున్న మున్సిపల్ పాలకవర్గం అక్కడి నుంచి 11 ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నా సమస్య తీరడం లేదు. మెదక్, చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. మంజీర నదిలోని కొత్తపల్లి, పొడ్చన్‌పల్లి, కొడుపాక గ్రామాల శివారులో ఇంటెక్వెల్ నిర్మించి 52 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. జహీరాబాద్‌లో జనం గగ్గోలు.. నియోజవకర్గంలో మంచినీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. గుక్కెడు నీటి కోసం తల్లడిల్లుతున్నారు. జహీరాబాద్ మున్సిపాలిటీతోపాటు, జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. అనేక బోర్లు ఎండిపోవడంతో నీటి సమస్య తలెత్తింది. తాగు నీటిని అందించే సింగూరు ప్రాజెక్టు కూడా ఎండిపోవడంతో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. నెల రోజులుగా జహీరాబాద్ మున్సిపాలిటీకి సింగూరు నీటి సరఫరా పూర్తిగా నిలిచి పోయింది. నిత్యం 5.4 ఎంఎల్డీ మేర నీటిని అందించేది. సింగూరులోని చాల్కిలో గల ఫిల్టర్ బెడ్ నుంచి కూడా న్యాల్కల్, ఝరాసంగం, రాయికోడ్ మండలాలకు నిలిచి పోయింది. 142 బోర్లు రోజుకు 1.2 ఎంఎల్డీ నీటిని మాత్రమే అందిస్తున్నాయి. ఎండల తీవ్రత పెరిగితే మరిన్ని బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉంది. జహీరాబాద్ మండలంలోని 10 గ్రామాల్లో తీవ్ర నీటి సమస్య నెలకొంది. అల్లీపూర్లోనూ అనేక బోర్లు ఎండిపోయాయి. 40 ట్రిప్పుల మేర నీటిని అందిస్తున్నారు. దుబ్బాకలో అడుగంటిన జలం దుబ్బాక నియోజక వర్గ ప్రజలకు తాగు నీటి కష్టాలు మొదల య్యాయి. నీటివనరులు డెడ్ స్టోరేజీకి చేరడంతో తాగు నీటి కోసం జనం తంటాలు పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో బిందెడు నీరు దొరకడమే గగనంగా మారింది. పంచాయతీ నల్లాల నుంచి వారానికోసారి వచ్చే నీటి చుక్కలు జనం పెదవులే తడవడం లేదు. త్రీఫేజ్ కరెంట్ ఎప్పుడొస్తే అప్పుడే చిన్నారులు, పెద్దలు బిందెలు పట్టుకుని గ్రామానికి సమీపంలోని వ్యవసాయ పొలాల వద్దకు పరుగులు తీస్తున్నారు. తమ పొలాలే సరిగా పారడం లేదని, దీనికి తోడు బిందెలు పట్టుకుని వచ్చే వారిపై రైతులు చీదరించుకుంటున్నారు. -
మళ్లీ గప్‘చిప్’ దోపిడీ!
పెట్రోల్ బంకుల్లో మొదటికొచ్చిన మోసాలు దాడుల నిలిపివేతతో రెచ్చిపోతున్న యజమానులు అడుగడుగునా కొలతల్లో కోత అక్రమార్కులకు సర్కారు అండ సిటీబ్యూరో: మీరు వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకునేందుకు బంకుకు వెళ్తున్నారా...అయితే లీటర్ పెట్రోల్ పోయిస్తే పావు లీటర్ కోత...పది లీటర్ల డీజిల్ పోయిస్తే...లీటర్ కోత తప్పదు. ఇదేదో అధికారిక కోత కాదు సుమా. అడ్డంగా దోపిడీ పర్వం. నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో మోసాలు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. పంపింగ్ యంత్రాల్లో ప్రత్యేక ‘చిప్’లు అమర్చి రీడింగ్‌ను మార్చేస్తూ బంకు యజమానులు నిత్యం లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. గతేడాది బంకులపై దాడులు జరిపి మోసాలకు అడ్డుకట్ట వేయగా.. కొద్దికాలం గప్‌చుప్‌గా ఉన్న బంకు యజమానులు తిరిగి ఇప్పుడు మళ్లీ అదే తంతు కొనసాగిస్తున్నారు. ఇందుకు అధికారయంత్రాంగం సైతం సహకరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలోని వందలాది బంకుల్లో ప్రతి రోజు లక్షలాది మంది వినియోగదారులు పెట్రోమాఫియా అక్రమాలకు జేబులు గుల్ల చేసుకుంటున్నారు. చాపకింద నీరులా కొనసాగుతున్న ఈ అక్రమ తంతు ద్వారా కోట్లాది రూపాయలు బంకు యజమానుల ఖజానాలోకి చేరిపోతున్నాయి. మరోవైపు ఈ అక్రమాలకు ప్రభుత్వంలోని కొందరు పెద్దల అండందండలు సైతం బలంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాదిన్నర క్రితం ఎస్ఓటీ పోలీసులు, తూనికలు కొలత ల శాఖ అధికారుల తనిఖీల్లో అడ్డంగా పట్టుబడిన అనేక బంకులు సర్కార్ నుంచి క్లీన్చిట్ పొంది తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగించడమే ఇందుకు ఉదాహరణ. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రత్యేక చిప్‌లను తయారు చేసి, వినియోగదారులకు ఏ మాత్రం అనుమానం రాకుండా వాటిని ఫిల్లింగ్ యంత్రాల్లో అమర్చి మోసాలకు పాల్పడిన విషయం అప్పట్లో సంచలనం కలిగించింది. ఇప్పుడు తిరిగి అదేవిధమైన మోసాలను తిరిగి కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. అప్పట్లో పదుల సంఖ్యలో పెట్రోల్ బంకుల్లో ఇలాంటి మోసాలను పోలీసులు కనిపెట్టారు. ఈ ఉదంతంలో తమ అక్రమాలను బట్టబయలు చేసిన అధికారులపై పెట్రో మాఫియా హత్యాయత్నాలకు సైతం పాల్పడింది. ఓ అధికారిపై సస్పెన్షన్ వేటు వేయించింది. మరోవైపు అక్రమ బంకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవలసిన ప్రభుత్వం వాటికి క్లీన్చిట్ ఇవ్వడమే కాకుండా, సదరు బంకుల్లోని ప్రామాణికంలేని యంత్రాలకు సైతం స్టాంపింగ్ చేయమని ఆదేశించడం విస్మయానికి గురిచేస్తోంది. అదే చేతివాటం.... రాష్ట్రంలో పెట్రో, డీజిల్ వినియోగంలో హైదరాబాద్‌దే అగ్రస్థానం. గ్రేటర్లో సుమారు 447 పెట్రోల్, డీజిల్ బంకులు ఉన్నాయి.ప్రతిరోజు సగటున 30 లక్షల లీటర్ల పెట్రోల్, 33 లక్షల డీజిల్ విక్రయిస్తారు. చాలా బంకులు నాణ్యతా ప్రమాణాలకు, కొలతల్లో పారదర్శకతకు తిలోదకాలు ఇచ్చి అడ్డూ అదుపు లేకుండా తమ మోసాలను కొనసాగిస్తున్నాయి. డిస్ప్లేలో కనిపించే రీడింగ్‌కు, ట్యాంకులో వేసే పెట్రోల్‌కు సంబంధం ఉండడం లేదు. పంపింగ్ చేసే సమయంలో డెలివరీ బాయ్‌లు చాకచక్యంగా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. విడిగా బాటిళ్లలో కొనుగోలు చేసే వారికి మాత్రం కచ్చితమైన కొలతల్లో విక్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డీలర్లు నేరుగా రిమోట్, కీ ప్యాడ్, హ్యాండిల్ టర్మినేషన్, మ్యానువల్ విధానాల ద్వారా ధరల మార్పు విషయంలో హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. హబ్సిగూడ, బర్కత్‌పురా, నల్లకుంట, సికింద్రాబాద్, ఉప్పల్, కోఠి, నారాయణగూడ తదితర ప్రాంతాల్లోని అనేక బంకుల్లో మోసాల పర్వం కొనసాగుతోంది. తనిఖీలపై వెనుకడుగు ఇలా ఉండగా అక్రమాలకు పాల్పడే బంకులపై చర్యలు తీసుకొనేందుకు అధికారులు జంకుతున్నారు. పెట్రో మాఫియా బెదిరింపులు, దౌర్జన్యంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో పెట్రోమోసాలపై పెద్దఎత్తున దాడులు చేసి అక్రమాలను బయటపెట్టిన అసిస్టెంట్ కంట్రోలర్ ఎన్.భాస్కర్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన తూనికలు, కొలతలు శాఖ అధికారుల్లో కలవరం రేపింది. అక్రమ స్టాంపింగ్! మరోవైపు సర్కార్‌ను పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకున్న కొందరు బంకుల యజమానులు కేంద్ర ప్రభుత్వ అమోదం లేని మోడల్ పంపులకు సైతం ప్రభుత్వం నుంచి స్టాంపింగ్ (అనుమతి) పొందడం గమనార్హం. గతంలో తూనికలు, కొలతల శాఖ కేంద్రం అమోదం లేని పలు మోడల్ పంపులను గుర్తించి సీజ్ చేసింది. దీనిపై సదరు యజమానులు ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో ఆ పంపులన్నింటికీ తనిఖీలు నిర్వహించి స్టాంపింగ్ కొనసాగించాలని అధికారులు ఆదేశిస్తూ ప్రభుత్వం సర్కులర్ ( మెమో నెంబర్ 36/సీఎస్ఐ-ఎల్ఎమ్/2014) విడుదల చేయడం గమనార్హం. దీనికంటే ముందే ప్రధాన ఆయిల్ కంపెనీలు తూనికల కొలతల శాఖపై ఫిల్లింగ్ మిషన్ల మోడల్స్‌ను తప్పు బట్టి సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించాయి. ఈ బంకుల్లో మోసాలుండవ్... పౌరసరఫరాలశాఖ స్వయంగా నిర్వహించే కొన్ని బంకుల్లో మాత్రమే పారదర్శకత, నాణ్యత కనిపిస్తున్నాయి. చర్లపల్లి, చంచల్‌గూడ జైలు, సెక్రేటేరియట్, ఎల్బీనగర్‌లలోని ప్రభుత్వ బంకుల్లో మాత్రమే కచ్చితమైన కొలతల్లో పెట్రోల్, డీజిల్ లభిస్తోంది. జైళ్ల శాఖ నిర్వహణలోని చంచల్‌గూడ పెట్రోల్ బంక్‌లో ప్రతి రోజు 22 వేల నుంచి 24 వేల లీటర్ల పెట్రోల్, 13 వేల నుంచి నుంచి 15 వేల లీటర్లు డీజిల్ విక్రయాలు జరగడమే ఇందుకు ఉదాహరణ. సెక్రటేరియట్ బంకులోనూ అనూహ్యమైన డిమాండ్ కనిపిస్తుంది. -
దేవాదుల నుంచి నీటి విడుదల
►ఇన్‌టేక్‌వెల్ వద్ద 80 మీటర్లకు చేరిన నీరు ►మొదటి దశలో రెండు మోటార్లు ప్రారంభం ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలంలోని దేవాదుల వద్ద జె.చొక్కారావు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీటి పంపింగ్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం రెండు మోటార్లను ప్రారంభించినట్టు ఇరిగేషన్ ఈఈ గంగాధర్ తెలిపారు. ఈనెల 17న దేవాదుల ఇన్‌టేక్‌వెల్ వద్ద గోదావరి నీటి మట్టం 74 మీటర్లకు చేరడంతో నీటిని పంపింగ్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం గోదావరి నీటి మట్టం 80 మీటర్లకు చేరడంతో వరంగల్ నగరానికి తాగునీటిని అందించడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు మోటార్లను ప్రారంభించారు. వరద నీరు ఇలాగే నిలకడగా ఉంటే.. రెండో దశలో మరో రెండు మోటార్లను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. దేవాదుల పంప్‌హౌస్ నుంచి నీరు పైపులైన్ ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్‌కు చేరుకునే క్రమంలో నీరు వెనుకకు రాకుండా ఎయిర్ట్యాంక్లను సిద్ధం చేశారు. దేవాదుల ప్రాజెక్టు కింద అన్ని రిజర్వాయర్లకు నీరు అందే అవకాశం ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.