దేవాదుల నుంచి నీటి విడుదల
►ఇన్‌టేక్‌వెల్ వద్ద 80 మీటర్లకు చేరిన నీరు
►మొదటి దశలో రెండు మోటార్లు ప్రారంభం
ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలంలోని దేవాదుల వద్ద జె.చొక్కారావు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీటి పంపింగ్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం రెండు మోటార్లను ప్రారంభించినట్టు ఇరిగేషన్ ఈఈ గంగాధర్ తెలిపారు. ఈనెల 17న దేవాదుల ఇన్‌టేక్‌వెల్ వద్ద గోదావరి నీటి మట్టం 74 మీటర్లకు చేరడంతో నీటిని పంపింగ్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
బుధవారం గోదావరి నీటి మట్టం 80 మీటర్లకు చేరడంతో వరంగల్ నగరానికి తాగునీటిని అందించడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు మోటార్లను ప్రారంభించారు. వరద నీరు ఇలాగే నిలకడగా ఉంటే.. రెండో దశలో మరో రెండు మోటార్లను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. దేవాదుల పంప్‌హౌస్ నుంచి నీరు పైపులైన్ ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్‌కు చేరుకునే క్రమంలో నీరు వెనుకకు రాకుండా ఎయిర్‌ట్యాంక్‌లను సిద్ధం చేశారు. దేవాదుల ప్రాజెక్టు కింద అన్ని రిజర్వాయర్లకు నీరు అందే అవకాశం ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.