Irrigation ee
-
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారులు
మంచిర్యాల (ఆదిలాబాద్) : తెలంగాణ ప్రజల ఆశల సౌధం అయిన మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి భాగోతాలు తొంగిచూస్తున్నాయి. చెరువు పనుల బిల్లు మంజూరు చేయడానికి ప్రభుత్వ అధికారులు లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని ఇరిగేషన్ కార్యాలయంలో శుక్రవారం వెలుగుచూసింది. ఇరిగేషన్ కార్యాలయంలో ఈఈగా పని చేస్తున్న వినోద్, డిప్యూటీ ఈఈగా పని చేస్తున్న బాలసిద్ధు కరీంనగర్‌కు చెందిన మిషన్ కాకతీయ కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డిని బిల్లులు మంజూరు కోసం లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో శక్రవారం ఏసీబీ అధికారుల ఆదేశాల మేరకు ఈఈకి రూ. 40 వేలు, డిప్యూటీ ఈఈకి రూ. 60 వేలు లంచం ఇస్తుండగా.. రంగంలోకి దిగిన పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం విచారణ చేపడుతున్నారు. -
దేవాదుల నుంచి నీటి విడుదల
►ఇన్‌టేక్‌వెల్ వద్ద 80 మీటర్లకు చేరిన నీరు ►మొదటి దశలో రెండు మోటార్లు ప్రారంభం ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలంలోని దేవాదుల వద్ద జె.చొక్కారావు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీటి పంపింగ్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం రెండు మోటార్లను ప్రారంభించినట్టు ఇరిగేషన్ ఈఈ గంగాధర్ తెలిపారు. ఈనెల 17న దేవాదుల ఇన్‌టేక్‌వెల్ వద్ద గోదావరి నీటి మట్టం 74 మీటర్లకు చేరడంతో నీటిని పంపింగ్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం గోదావరి నీటి మట్టం 80 మీటర్లకు చేరడంతో వరంగల్ నగరానికి తాగునీటిని అందించడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు మోటార్లను ప్రారంభించారు. వరద నీరు ఇలాగే నిలకడగా ఉంటే.. రెండో దశలో మరో రెండు మోటార్లను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. దేవాదుల పంప్‌హౌస్ నుంచి నీరు పైపులైన్ ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్‌కు చేరుకునే క్రమంలో నీరు వెనుకకు రాకుండా ఎయిర్ట్యాంక్లను సిద్ధం చేశారు. దేవాదుల ప్రాజెక్టు కింద అన్ని రిజర్వాయర్లకు నీరు అందే అవకాశం ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.