ఖరీఫ్ ఆకుమడులకు సాగునీరు
ఖరీఫ్ ఆకుమడులకు సాగునీరు
Published Wed, Jun 7 2017 11:01 PM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM
ఇరిగేషన్ అధికారులకు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆదేశం
ఆత్రేయపురం (కొత్తపేట) : పేరవరం పంపింగ్ స్కీమ్ పునర్నిర్మాణ పనులను ఈ నెల 14లోగా పూర్తిచేసి ఖరీఫ్ ఆకుమడులకు సాగునీరు అందజేయాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలోని పేరవరం పంపింగ్ స్కీమ్, వాడపల్లి నూతన బ్రిడ్జి నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. 2004లో అప్పటి జేసీ ఉదయలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ పంపింగ్ స్కీమ్ పాత మోటార్లకు మరమ్మతులు చేశారని, తిరిగి ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందన్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పంపింగ్ స్కీమ్ ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయించినట్టు వివరించారు. నూతన అసెంబ్లీలో సైతం ఈ విషయంపై ప్రస్తావించామని గుర్తు చేశారు. ఈలోగా కొందరు అధికార పార్టీ నేతలు సీఎం చంద్రబాబుకు నిధుల మంజూరుపై కృతజ్ఞతలు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిం చిందన్నారు.
16 గంటల విద్యుత్ కోసం...
వసంతవాడ, ఉచ్చిలి ఎత్తిపోతల పథకాలకు 16 గంటలు విద్యుత్ సరఫరా విషయాన్ని రైతుల తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్టు జగ్గిరెడ్డి చెప్పారు. వాడపల్లి వద్ద రూ1.98 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు యుద్ధ ప్రాతిపతికన పూర్తి చేయాల్సిందిగా అదేశించారు. ఈ ప్రాంతంలో అరటి గెలలు సైకిళ్లతో వచ్చే రైతుల కోసం సర్వీస్ రోడ్డును వంతెన సమీపంలో ఏర్పాటు చేయాలని డీఈ శ్రీనివాస్‌కు సూచించారు. కొందరు నాయకులు ఉనికి కాపాడుకోవడానికి, కమీషన్ల కోసం ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఆలమూరు మండలం బడుగువానిలంకలో రైతుల కోసం ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ వద్ద పోరాడి రైతుల సమస్యలు పరిష్కరించామన్నారు. రావులపాలెం పార్టీ ప్లీనరీని విజయవంతం చేసిన నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇరిగేషన్ శాఖ డీఈ శ్రీనివాస్, ఏఈలు శ్రీనివాస్, రాజమౌళి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, జెడ్పీటీసీ మద్దూరి సుబ్బలక్ష్మి, పార్టీ మండల కన్వీనర్లు కనుమూరి శ్రీనివాసరాజు, తమ్మన శ్రీనివాస్, రైతు విభాగం రాష్ట్ర సభ్యులు చిలువూరి నాగరామసత్యనారాయణరాజు (బాబిరాజు), చిలువూరి దుర్గరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు కొల్లి శ్యామ్‌సన్, సర్పంచ్ కోమలి సత్యనారాయణ, ఉప సర్పంచ్ చిలువూరి చిన వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement