తల్ల డిల్లు తుండ్రు | water froblems start in disstric | Sakshi
Sakshi News home page

తల్ల డిల్లు తుండ్రు

Published Fri, Mar 4 2016 2:49 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM

తల్ల డిల్లు తుండ్రు

తల్ల డిల్లు తుండ్రు

బిందెడు నీరు దొరికితే ఒట్టు ఎండిపోయిన మంజీర నది
వట్టిపోయిన భూగర్భ జలాలు నిలిచిపోయిన నీటి పథకాలు
వేసవికి ముందే నీటి తిప్పలు తల్లడిల్లుతున్న జనం
మున్ముందు పరిస్థితి మరింత దారుణం
మెతుకుసీమలో నీటిగోస వట్టిపోయిన నీటి వనరులు
ఆందోళనలో జనం మెతుకుసీమలో నీటి తండ్లాట..

 దాహం... దాహం... జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. వేసవికి ముందే మంచి నీటి కోసం మెతుకు సీమ జనం తల్లడిల్లిపోతోంది. మహిళలు, పురుషులు, పిల్లలు సైతం బిందెడు నీటికోసం పంట పొలాల వైపు పరుగులు తీస్తున్నారు. అక్కడా రైతుల చీత్కారాలు తప్పట్లేదు. కూలీలైతే పనులు, విద్యార్థులైతే బడి మానేసి నీటికోసం తంటాలు పడుతున్నారు. జిల్లాతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలో గత రెండేళ్లుగా సరైన వర్షాలు లేకపోవడంతో మంజీరలోకి వరదనీరు రాకపోవడంతో అది వేసవికి ముందే ఎండిపోయింది. నాలుగు దశాబ్దాల తరువాత అంతటి ఘోరమైన పరిస్థితి ఏర్పడింది. మంజీరపై నిర్మించిన నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని నీటిపథకాలు సైతం నిలిచిపోవడంతో వందలాది గ్రామాల వారు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ఏ గల్లీలోకి ట్యాంకర్ వచ్చినా ఎగబడి పట్టుకుంటున్నారు. అక్కడక్కడా ముష్టియుద్ధాలకు దిగుతున్నారు. జిల్లాలో తాగునీటి సమస్యపై ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైన జనం తిప్పలు ఇలా... - నారాయణఖేడ్/ సాక్షి నెట్‌వర్‌‌క

ఎటు చూసినా నీటి గోసే.. పెద్దలు, పిల్లలు, మహిళలు.. అందరూ నీటి కోసం పరుగులే.. రోజంతా పడిగాపులే.. పల్లెల్లో విద్యార్థులు బడి మానేసి నీళ్లు మోస్తున్న దుస్థితి. వందల గ్రామాల్లో దుర్భర స్థితి.. ప్రధాన నీటి వనరులన్నీ వట్టిపోవడంతో జనం గొంతు తడుపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. గడచిన 40 ఏళ్ళలో ఎన్నడూ ఇంతటి

 గడ్డుస్థితి ఏర్పడలేదని పలువురు పేర్కొంటున్నారు. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే.. మున్ముందు ఎలా ఉంటుందోనని ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో తాగునీటి సమస్యపై ‘సాక్షి’ ఫోకస్..

పటాన్‌చెరులో పరేషాన్...
నియోజకవర్గం పరిధిలో తీవ్రమైన మంచినీటి ఎద్దడి నెలకొంది. వారానికోసారి నీరుసరఫరా అవుతోంది. పటాన్‌చెరు, రామచంద్రాపురం పట్టణాల్లో మూడు రోజులకోసారి నీరొస్తోంది. ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. మండలంలో మంచినీటిని ట్యాంకర్ల ద్వారానే కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బోర్లన్నీ ఇంకిపోతున్నాయి. పారిశ్రామికవాడల్లో భూగర్భ జలాలు కాలుష్యం కావడంతో అవి వాడేందుకు పనికిరాకుండా పోయాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు పటాన్‌చెరు నియోజకర్గ పరిధిలోని కాలుష్య గ్రామాల్లో మంచినీటి  జలాలు ఉచితంగా సరఫరా చేయాలి. పటాన్‌చెరు మండలం సుల్తాన్‌పూర్, గండిగూడ, పటాన్‌చెరు పట్టణం, లక్డారం, ముత్తంగి, ఇస్నాపూర్, రుద్రారం, చిట్కుల్, పోచారం గ్రామాల్లో స్వచ్ఛమైన జలాలు అందించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమైనట్టు తేల్చారు. స్థానిక నాయకులు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు కొంతమేర పేదలకు ఊరట కలిగిస్తుంది. గ్రామాల్లో పారిశ్రామికవేత్తల సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు.

 అందోల్‌లో ఆందోళనకరం...
అందోలు నియోజకవర్గ పరిధిలోని అందోలు, పుల్కల్, రేగోడ్, అల్లాదుర్గం, మునిపల్లి, రాయికోడ్ టేక్మాల్ మండలాల్లో ప్రజలు తీవ్ర మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. అందోలు, పుల్కల్ మండలాలకు ప్రధానంగా పోచారం, చక్రియాల మంచినీటి ప్రాజెక్టుల ద్వారా తాగునీరు సరఫరా అవుతుంది. ఈ ప్రాజెక్టుల వద్ద నీరు లేకపోవడంతో నాలుగు రోజులకోసారి ఈ రెండు మండలాల్లోని గ్రామాలకు మంచినీరొస్తోంది. జోగిపేట పట్టణంలో మంజీర నీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి. రేగోడ్, అల్లాదుర్గం, మునిపల్లి, రాయికోడ్, టేక్మాల్ మండలాల్లో కూడా భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోవడంతో గ్రామంలో ఉన్న బోర్ల నుంచి నీరు రాకపోవడం వల్ల ఆయా గ్రామాల్లోని ప్రజలకు నీటి సమస్యలు అనేకం. ట్యాంకర్ల ద్వారా నీటి పంపిణీకి చర్యలు తీసుకోకపోవడంతో వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. చిన్నాపెద్దా, మహిళలు తేడా లేకుండా వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు.

సంగారెడ్డిలో నాలుగు రోజులకోమారు పంపింగ్
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో నీటి సరఫరా పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. ప్రధాన ఆధార మైన మంజీర ఎండిపోగా సింగూర్ పూర్తిగా డెడ్‌స్టోరేజీకి చేరింది. దీంతో పట్టణ వాసులు ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా భావించిన వాటర్ ప్లాంట్ యజమానులు అందినంత దోచుకుంటున్నారు. ఇప్పటివరకు 72 బోర్లు వేశారు. మూడు నెలలైనా వాటికి మోటార్లు బిగించలేదు. కొత్తగా పైపులైన్లు ఏర్పాటు చేసినా నీరు  రావడం రాలేదు. డీఎస్పీ క్యాంప్ కార్యాలయం నుంచి రాజంపేట, మంజీర పైపులైన్ వైపు నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరం వేసిన లైన్ వృథాగా మారింది. మంజీర డ్యామ్‌లో ఉన్న కొద్దిపాటి నీటిని పంపింగ్ ద్వారా నాలుగు రోజులకోసారి మాత్రమే సరఫరా చేస్తున్నారు. సదాశివపేట పట్టణ, మండల పరిధిలోనూ జనానికి నీటి కష్టలు తప్పడం లేదు.

మానేరు అగితే... అంతే
సిద్దిపేట పట్టణంతోపాటు సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాలకు వరప్రదాయినిగా మారింది మానేరు డ్యామ్. ఈ డ్యామ్ నుంచి పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. నీటి సరఫరాలో సాంకేతిక లోపం తలెత్తితే నియోజకవర్గ ప్రజలు తాగునీటి కోసం అల్లాడాల్సిందే. సాంకేతికపర సమస్యలతో ప్రతి నెలలో కొన్ని మార్లు నీటి సరఫరా నిలిచిపోతోంది. మరోవైపు సిద్దిపేట పట్టణానికి తాగునీటి సరఫరా చేసే లోయర్ మానేర్ డ్యాం ఇంటెక్‌వెల్‌లో ఇసుక మేటలు పేరుకుపోవడంతో కొన్ని రోజులుగా ఇసుక మేటలను తొలగించే పనిని మున్సిపల్ అధికారులు వేగవంతంగా చేపడుతున్నారు. ఈ క్రమంలో సిద్దిపేటకు గత రెండు రోజులుగా నీటి సరఫరాలో అంతరాయం కలగడంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ముందస్తుగానే నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టారు.

 నర్సాపూర్‌లో నానా తంటాలు...
వేసవికి ముందే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నీటి కోసం జనం ఫిబ్రవరి నుంచే అల్లాడుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని 220 గ్రామాలకు, గజ్వేల్ నియోజకవర్గంలోని 80గ్రామాలకు మంజీర నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేందుకు హత్నూర మండలం బోర్పట్ల వద్ద ఏర్పాటు చేసిన మంజీర నీటి శుద్ధి కేంద్రం నీరు అందుబాటులో లేకుండా పోయింది. రోజుకు 81 లక్షల లీటర్లను 14 గంటల్లో శుద్ధి చేసి ఆయా గ్రామాలకు పంపింగ్ చేసే బోర్పట్ల శుద్ధి కేంద్రానికి మంజీర నుంచి నీటి సరఫరా లేకపోవడంతో శుద్ధి కేంద్రం అలంకారప్రాయంగా మారింది. పలు గ్రామాల్లో వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకున్నా నీటి సరఫరాకు ట్యాంకుల వరకు పైపులైను ఏర్పాటు చేయకపోవడంతో చాలా దూరం నుంచి నీటిని మోయాల్సి వస్తోంది.

 గజ్వేల్‌లో జఠిలం..
నియోజకవర్గంలో నీటి సమస్య జఠిలంగా మారింది. వచ్చే నీరు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని గజ్వేల్‌తోపాటు ప్రజ్ఞాపూర్, ముట్రాజ్‌పల్లి, క్యాసారం, రాజిరెడ్డిపల్లి, సంగుపల్లి, సంగాపూర్ గ్రామాల్లో మొత్తం 4,270 నల్లాకనెక్షన్లు, మరో 1,500వరకు అక్రమ కనెక్షన్లు ఉన్నాయి. జనాభా 44 వేలకుపైగా ఉంది. నిజానికి నగర పంచాయతీలో ప్రతి వ్యక్తికి 100 లీటర్ల చొప్పున లెక్కిస్తే సుమారు 5ఎంఎల్‌డీ(50 లక్షల లీటర్లు) అవసరముంటుంది. కానీ ఇక్కడున్న 108 బోరుబావులు, 15 ఓవర్‌హెడ్ ట్యాంకుల ద్వారా ప్రస్తుతం 24.9 ఎంఎల్‌డీ (24.9 లక్షల లీటర్లు) మాత్రమే సరఫరా అవుతోంది. ఆ నీరు ఏమాత్రం సరిపోక జనం నానా ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలో నగర పంచాయతీ ఆధ్వర్యంలో వేసవిలో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, బోరుబావుల తవ్వకం తదితర పనుల కోసం రూ.38లక్షలకు పైగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ తరుణంలో గోదావరి జలాలను గజ్వేల్ నగర పంచాయతీకి వెంటనే తరలించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రజ్ఞాపూర్ నుంచి గోదావరి జలాల పైప్‌లైన్‌ను ట్యాప్ చేసి 10కిలోమీటర్ల దూరంలోని కోమటిబండ అటవీ ప్రాంతంలో నిర్మిస్తోన్న భారీ సంప్‌కు మళ్లించనున్నారు. ఈ పనులు పూర్తి కావచ్చాయి. కొద్ది రోజుల్లోనే నగర పంచాయతీకి సంప్‌హౌస్ నుంచి నీటి కనెక్షన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

నారాయణఖేడ్‌లో నత్తనడకన పనులు..
నియోజకవర్గంలోని నారాయణఖేడ్, కల్హేర్, కంగ్టి, మనూర్, పెద్ద శంకరంపేటలో నీటిసమస్య తీవ్రంగా ఉంది. మంజీర నది పూర్తిగా ఎండిపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. పరిస్థితిని గమనించిన మంత్రి హరీశ్‌రావు ఇటీవల మంజీర ప్రాజెక్టు నుంచి మొదలుకొని గట్టులింగంపల్లి, నల్లవాగు ప్రాజెక్టు వరకు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. నల్లవాగు ప్రాజెక్టు నీటిని పంపింగ్ ద్వారా నారాయణఖేడ్ పట్టణానికి, సమీప గ్రామాలకు పంపింగ్ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గ్రామాల్లో విద్యార్థులు బడి మానేసి నీళ్లు మోయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

మెదక్‌లో నాలుగు నెలలుగా...
మెదక్ పట్టణంలో నాలుగు నెలలుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పట్టణంలో రోజు విడిచి రోజు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకొని విరివిగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మెదక్ పట్టణంలో అధికారిక లెక్కల ప్రకారం 13వేలకు పైచిలుకు గృహాలుం డగా, సుమారు 70వేల జనాభా ఉంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా పసుపులేరులో నీటి ఊటలు పూర్తిగా తగ్గిపోయాయి. పట్టణంలోని బోరుబావుల పరిస్థితీ అలాగే ఉంది. పట్టణానికి ఆనుకొని ఉన్న దాయర వీధిలో ఇప్పటికే రెండు బోర్లను అద్దెకు తీసుకున్న మున్సిపల్ పాలకవర్గం అక్కడి నుంచి 11 ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నా సమస్య తీరడం లేదు. మెదక్, చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. మంజీర నదిలోని కొత్తపల్లి, పొడ్చన్‌పల్లి, కొడుపాక గ్రామాల శివారులో ఇంటెక్‌వెల్ నిర్మించి 52 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు.

 జహీరాబాద్‌లో జనం గగ్గోలు..
నియోజవకర్గంలో మంచినీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. గుక్కెడు నీటి కోసం తల్లడిల్లుతున్నారు. జహీరాబాద్ మున్సిపాలిటీతోపాటు, జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. అనేక బోర్లు ఎండిపోవడంతో నీటి సమస్య తలెత్తింది. తాగు నీటిని అందించే సింగూరు ప్రాజెక్టు కూడా ఎండిపోవడంతో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. నెల రోజులుగా జహీరాబాద్ మున్సిపాలిటీకి సింగూరు నీటి సరఫరా పూర్తిగా నిలిచి పోయింది. నిత్యం 5.4 ఎంఎల్‌డీ మేర నీటిని అందించేది. సింగూరులోని చాల్కిలో గల ఫిల్టర్ బెడ్ నుంచి కూడా న్యాల్‌కల్, ఝరాసంగం, రాయికోడ్ మండలాలకు నిలిచి పోయింది.  142 బోర్లు రోజుకు 1.2 ఎంఎల్‌డీ నీటిని మాత్రమే అందిస్తున్నాయి. ఎండల తీవ్రత పెరిగితే మరిన్ని బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉంది. జహీరాబాద్ మండలంలోని 10 గ్రామాల్లో తీవ్ర నీటి సమస్య నెలకొంది. అల్లీపూర్‌లోనూ అనేక బోర్లు ఎండిపోయాయి. 40 ట్రిప్పుల మేర నీటిని అందిస్తున్నారు.

దుబ్బాకలో అడుగంటిన జలం
దుబ్బాక నియోజక వర్గ ప్రజలకు తాగు నీటి కష్టాలు మొదల య్యాయి. నీటివనరులు డెడ్ స్టోరేజీకి చేరడంతో తాగు నీటి కోసం జనం తంటాలు పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో బిందెడు నీరు దొరకడమే గగనంగా మారింది. పంచాయతీ నల్లాల నుంచి వారానికోసారి వచ్చే నీటి చుక్కలు జనం పెదవులే తడవడం లేదు. త్రీఫేజ్ కరెంట్ ఎప్పుడొస్తే అప్పుడే చిన్నారులు, పెద్దలు బిందెలు పట్టుకుని గ్రామానికి సమీపంలోని వ్యవసాయ పొలాల వద్దకు పరుగులు తీస్తున్నారు. తమ పొలాలే సరిగా పారడం లేదని, దీనికి తోడు బిందెలు పట్టుకుని వచ్చే వారిపై రైతులు చీదరించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement