మళ్లీ గప్‘చిప్’ దోపిడీ!
పెట్రోల్ బంకుల్లో మొదటికొచ్చిన మోసాలు
దాడుల నిలిపివేతతో రెచ్చిపోతున్న యజమానులు
అడుగడుగునా కొలతల్లో కోత
అక్రమార్కులకు సర్కారు అండ
సిటీబ్యూరో: మీరు వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకునేందుకు బంకుకు వెళ్తున్నారా...అయితే లీటర్ పెట్రోల్ పోయిస్తే పావు లీటర్ కోత...పది లీటర్ల డీజిల్ పోయిస్తే...లీటర్ కోత తప్పదు. ఇదేదో అధికారిక కోత కాదు సుమా. అడ్డంగా దోపిడీ పర్వం. నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో మోసాలు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. పంపింగ్ యంత్రాల్లో ప్రత్యేక ‘చిప్’లు అమర్చి రీడింగ్‌ను మార్చేస్తూ బంకు యజమానులు నిత్యం లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. గతేడాది బంకులపై దాడులు జరిపి మోసాలకు అడ్డుకట్ట వేయగా.. కొద్దికాలం గప్‌చుప్‌గా ఉన్న బంకు యజమానులు తిరిగి ఇప్పుడు మళ్లీ అదే తంతు కొనసాగిస్తున్నారు. ఇందుకు అధికారయంత్రాంగం సైతం సహకరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నగరంలోని వందలాది బంకుల్లో ప్రతి రోజు లక్షలాది మంది వినియోగదారులు పెట్రోమాఫియా అక్రమాలకు జేబులు గుల్ల చేసుకుంటున్నారు. చాపకింద నీరులా కొనసాగుతున్న ఈ అక్రమ తంతు ద్వారా కోట్లాది రూపాయలు బంకు యజమానుల ఖజానాలోకి చేరిపోతున్నాయి. మరోవైపు ఈ అక్రమాలకు ప్రభుత్వంలోని కొందరు పెద్దల అండందండలు సైతం బలంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాదిన్నర క్రితం ఎస్‌ఓటీ పోలీసులు, తూనికలు కొలత ల శాఖ అధికారుల తనిఖీల్లో అడ్డంగా పట్టుబడిన అనేక బంకులు సర్కార్ నుంచి క్లీన్‌చిట్ పొంది తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగించడమే ఇందుకు ఉదాహరణ. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రత్యేక చిప్‌లను తయారు చేసి, వినియోగదారులకు ఏ మాత్రం అనుమానం రాకుండా వాటిని ఫిల్లింగ్ యంత్రాల్లో అమర్చి మోసాలకు పాల్పడిన విషయం అప్పట్లో సంచలనం కలిగించింది. ఇప్పుడు తిరిగి అదేవిధమైన మోసాలను తిరిగి కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. అప్పట్లో పదుల సంఖ్యలో పెట్రోల్ బంకుల్లో ఇలాంటి మోసాలను పోలీసులు కనిపెట్టారు. ఈ ఉదంతంలో తమ అక్రమాలను బట్టబయలు చేసిన అధికారులపై పెట్రో మాఫియా హత్యాయత్నాలకు సైతం పాల్పడింది. ఓ అధికారిపై సస్పెన్షన్ వేటు వేయించింది. మరోవైపు అక్రమ బంకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవలసిన ప్రభుత్వం వాటికి క్లీన్‌చిట్ ఇవ్వడమే కాకుండా, సదరు బంకుల్లోని ప్రామాణికంలేని యంత్రాలకు సైతం స్టాంపింగ్ చేయమని ఆదేశించడం విస్మయానికి గురిచేస్తోంది.
అదే చేతివాటం....
రాష్ట్రంలో పెట్రో, డీజిల్ వినియోగంలో హైదరాబాద్‌దే అగ్రస్థానం. గ్రేటర్‌లో సుమారు 447 పెట్రోల్, డీజిల్ బంకులు ఉన్నాయి.ప్రతిరోజు సగటున 30 లక్షల లీటర్ల పెట్రోల్, 33 లక్షల డీజిల్ విక్రయిస్తారు. చాలా బంకులు నాణ్యతా ప్రమాణాలకు, కొలతల్లో పారదర్శకతకు తిలోదకాలు ఇచ్చి అడ్డూ అదుపు లేకుండా తమ మోసాలను కొనసాగిస్తున్నాయి. డిస్‌ప్లేలో కనిపించే రీడింగ్‌కు, ట్యాంకులో వేసే పెట్రోల్‌కు సంబంధం ఉండడం లేదు. పంపింగ్ చేసే సమయంలో డెలివరీ బాయ్‌లు చాకచక్యంగా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. విడిగా బాటిళ్లలో కొనుగోలు చేసే వారికి మాత్రం కచ్చితమైన కొలతల్లో విక్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డీలర్లు నేరుగా రిమోట్, కీ ప్యాడ్, హ్యాండిల్ టర్మినేషన్, మ్యానువల్ విధానాల ద్వారా ధరల మార్పు విషయంలో హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. హబ్సిగూడ, బర్కత్‌పురా, నల్లకుంట, సికింద్రాబాద్, ఉప్పల్, కోఠి, నారాయణగూడ తదితర ప్రాంతాల్లోని అనేక బంకుల్లో మోసాల పర్వం కొనసాగుతోంది. తనిఖీలపై వెనుకడుగు
ఇలా ఉండగా అక్రమాలకు పాల్పడే బంకులపై చర్యలు తీసుకొనేందుకు అధికారులు జంకుతున్నారు. పెట్రో మాఫియా బెదిరింపులు, దౌర్జన్యంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో పెట్రోమోసాలపై పెద్దఎత్తున దాడులు చేసి అక్రమాలను బయటపెట్టిన అసిస్టెంట్ కంట్రోలర్ ఎన్.భాస్కర్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన తూనికలు, కొలతలు శాఖ అధికారుల్లో కలవరం రేపింది.
అక్రమ స్టాంపింగ్!
మరోవైపు సర్కార్‌ను పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకున్న కొందరు బంకుల యజమానులు కేంద్ర ప్రభుత్వ అమోదం లేని మోడల్ పంపులకు సైతం ప్రభుత్వం నుంచి స్టాంపింగ్ (అనుమతి) పొందడం గమనార్హం. గతంలో తూనికలు, కొలతల శాఖ కేంద్రం అమోదం లేని పలు మోడల్ పంపులను గుర్తించి సీజ్ చేసింది. దీనిపై సదరు యజమానులు ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో ఆ పంపులన్నింటికీ తనిఖీలు నిర్వహించి స్టాంపింగ్ కొనసాగించాలని అధికారులు ఆదేశిస్తూ ప్రభుత్వం సర్కులర్ ( మెమో నెంబర్ 36/సీఎస్‌ఐ-ఎల్‌ఎమ్/2014) విడుదల చేయడం గమనార్హం. దీనికంటే ముందే ప్రధాన ఆయిల్ కంపెనీలు తూనికల కొలతల శాఖపై ఫిల్లింగ్ మిషన్ల మోడల్స్‌ను తప్పు బట్టి సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించాయి.
ఈ బంకుల్లో మోసాలుండవ్...
పౌరసరఫరాలశాఖ స్వయంగా నిర్వహించే కొన్ని బంకుల్లో మాత్రమే పారదర్శకత, నాణ్యత కనిపిస్తున్నాయి. చర్లపల్లి, చంచల్‌గూడ జైలు, సెక్రేటేరియట్, ఎల్‌బీనగర్‌లలోని ప్రభుత్వ బంకుల్లో మాత్రమే కచ్చితమైన కొలతల్లో పెట్రోల్, డీజిల్ లభిస్తోంది. జైళ్ల శాఖ నిర్వహణలోని చంచల్‌గూడ పెట్రోల్ బంక్‌లో ప్రతి రోజు 22 వేల నుంచి 24 వేల లీటర్ల పెట్రోల్, 13 వేల నుంచి నుంచి 15 వేల లీటర్లు డీజిల్ విక్రయాలు జరగడమే ఇందుకు ఉదాహరణ. సెక్రటేరియట్ బంకులోనూ అనూహ్యమైన డిమాండ్ కనిపిస్తుంది.