
మిన్నంటిన విషాదం
అలంపూర్ : తుంగభద్రనదిలో ఇద్దరు గల్లంతైన సంఘటనతో అలంపూర్‌లో విషాదం అలుముకుంది. అలంపూర్-ర్యాలంపాడు గ్రామాల మధ్య తుంగభద్రనదిలో నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద ఈనెల 4వ తేదీన చేపలవేటకు వెళ్లిన వేణు(26), కు మార్(11)లు గల్లంతైన విషయం తెలిసిందే. మూడ్రోజులుగా మత్స్యకారులు, అధికారులు మృతదేహాలను వెలికితీయడానికి తీవ్ర ప్రయత్నమేచేశారు. గురువారం తెల్లవారుజామున మృతదేహాలు నీటిలో ఒడ్డుకు తేలియాడాయి. వారిని చూసి బాధిత కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. గుండెలు బాదుకుం టూ రోధించడంతో తుంగభద్ర తీరంలో విశాద వాతావరణం కనిపించింది.
సంఘటన ఇలా..
మూడ్రోజుల కిందట అలంపూర్‌కు చెందిన చిన్న మద్దిలేటి తన కొడుకు కుమార్‌ను వెంటతీసుకొని మత్స్యకారులు వేణు, శంకర్, రాజులతో కలిసి పుట్టిలో చేపలవేటకు వెళ్లాడు. పనులు ముగిసిన తర్వాత కుమార్, వేణులు మరబోటులో వస్తామంటూ ఒడ్డున ఉండిపోయారు. కాసేపటి తర్వాత బ్రిడ్జి పనులు చేసే కూలీలతోపాటు బోటులో ప్రయాణమయ్యారు.
కొద్దిదూరం వెళ్లిన తర్వాత బోటు బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం ఏర్పా టు చేసిన తీగను తాకి బోల్తాపడింది. ముగ్గురు కూలీలు ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా ఈతరాని వేణు, కుమార్‌లుమాత్రం గల్లంతయ్యారు. రెండ్రోజులు వారి కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. మూడోరోజు గురువారం తెల్లవారుజామున మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చా యి. సమాచారం అందుకున్న తహశీల్దార్ మంజుల, ఎస్‌ఐ వెంకటేష్‌లు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్థానికుల సహాయంతో బయటికి తీయిం చారు.
అక్కడే ఒడ్డుకు చేర్చి పంచనామ నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు అప్పగిం చారు. బాధితులకు పరిహారం అందించాలని మత్స్యకారులు కాసేపు అధికారుల తో వాగ్వాదం చేశారు. తహశీల్దార్ పక్కా హామీనివ్వడంతో ఆందోళన విరమించారు.