టీబీ బోర్డులోకి రాజోలిబండనా?
Published Fri, Aug 19 2016 12:25 AM | Last Updated on Thu, Aug 9 2018 8:15 PM
– ఎజెండా నుంచి తొలగించాల్సిందే
– సీడబ్ల్యూసీ చైర్మన్‌తో మాట్లాడిన ఎంపీ బుట్టా, డిప్యూటీ సీఎం
– ఈ నెల 20న తుంగభద్ర బోర్డు సమావేశం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాజోలిబండ డైవర్షన్ పథకాన్ని(ఆర్‌డీఎస్) తుంగభద్ర బోర్డులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. తద్వారా ఆర్‌డీఎస్‌కు నీటి విడుదల వ్యవహారంలో తన పట్టు పెంచుకోవడంతో పాటు ఆధునీకరణ పనులను కూడా మొదలు పెట్టేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన జరగనున్న తుంగభద్ర బోర్డు సమావేశంలో ఎజెండా అంశంగా ముందుకు తెచ్చింది. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక నేరుగా కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్లు్యసీ) చైర్మన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లో టీబీ బోర్డులోకి రాజోలిబండను చేర్చవద్దని... సమావేశపు ఎజెండా నుంచి కూడా ఈ అంశాన్ని తొలగించాలని కోరారు. ఇదే విషయాన్ని రాష్ట్ర జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ)కి కూడా వివరించారు. ఒకవేళ సమావేశంలో తెలంగాణ ప్రతినిధులు ఈ అంశాన్ని లేవనెత్తితే.. వెంటనే కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని కూడా ఈఎన్‌సీకి సూచించారు. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి కూడా ఈఎన్‌సీకి ఫోన్ చేశారు. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో సుంకేసుల కూడా బోర్డు పరిధిలోకి పోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది.
ఇదీ వివాదం...!
వాస్తవానికి రాజోలిబండ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య తాజాగా వివాదం తలెత్తింది. రాజోలిబండ ఆధునీకరణ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య కొద్దిరోజుల క్రితం గొడవ జరిగింది. ఆర్‌డీఎస్ ఎత్తు పెంపును మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన రైతులు వ్యతిరేకించారు. ఈ మేరకు ఆర్‌డీఎస్ ఆనకట్ట వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నేతత్వంలో అక్కడే బైఠాయించారు. ఆనకట్ట ఎత్తు పెంచితే తమకు నీళ్లు రావనేది ఇక్కడి రైతుల భావనగా ఉంది. మరోవైపు ఆర్‌డీఎస్ ఎత్తు పెంపు పనులను నిలిపివేస్తున్నారని.. ఇందుకు అనుగుణంగా పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అప్పట్లో మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆర్‌డీఎస్‌ను టీబీ బోర్డు పరిధిలోకి తెస్తే.. సులభంగా ఆధునీకరణ పనులను కొనసాగించవచ్చనేది తెలంగాణ ప్రభుత్వ భావన. ఇందుకు అనుగుణంగా టీబీ బోర్డు సమావేశంలో ఎజెండా అంశంగా తెరమీదకు తీసుకొచ్చారు. దీనిని అడ్డుకోకపోతే జిల్లాలోని పశ్చిమ ప్రాంతం మరింత నీటి కరువుతో సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే బోర్డు పరిధిలో ఉన్న ఎల్‌ఎల్‌సీలకు సరిపడినన్ని నీళ్లు రాక పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇదే కోవలో రాజోలిబండ ఆయకట్టు ప్రాంతం కూడా ఇబ్బందులు ఎదురవుతాయనే భయాందోళన ఇక్కడి రైతుల్లో వ్యక్తమవుతోంది.
Advertisement
Advertisement