Rajolibanda
-
టీబీ బోర్డులోకి రాజోలిబండనా?
– ఎజెండా నుంచి తొలగించాల్సిందే – సీడబ్ల్యూసీ చైర్మన్‌తో మాట్లాడిన ఎంపీ బుట్టా, డిప్యూటీ సీఎం – ఈ నెల 20న తుంగభద్ర బోర్డు సమావేశం సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాజోలిబండ డైవర్షన్ పథకాన్ని(ఆర్డీఎస్) తుంగభద్ర బోర్డులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. తద్వారా ఆర్డీఎస్కు నీటి విడుదల వ్యవహారంలో తన పట్టు పెంచుకోవడంతో పాటు ఆధునీకరణ పనులను కూడా మొదలు పెట్టేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన జరగనున్న తుంగభద్ర బోర్డు సమావేశంలో ఎజెండా అంశంగా ముందుకు తెచ్చింది. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక నేరుగా కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్లు్యసీ) చైర్మన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లో టీబీ బోర్డులోకి రాజోలిబండను చేర్చవద్దని... సమావేశపు ఎజెండా నుంచి కూడా ఈ అంశాన్ని తొలగించాలని కోరారు. ఇదే విషయాన్ని రాష్ట్ర జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)కి కూడా వివరించారు. ఒకవేళ సమావేశంలో తెలంగాణ ప్రతినిధులు ఈ అంశాన్ని లేవనెత్తితే.. వెంటనే కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని కూడా ఈఎన్సీకి సూచించారు. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి కూడా ఈఎన్సీకి ఫోన్ చేశారు. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో సుంకేసుల కూడా బోర్డు పరిధిలోకి పోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. ఇదీ వివాదం...! వాస్తవానికి రాజోలిబండ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య తాజాగా వివాదం తలెత్తింది. రాజోలిబండ ఆధునీకరణ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య కొద్దిరోజుల క్రితం గొడవ జరిగింది. ఆర్డీఎస్ ఎత్తు పెంపును మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన రైతులు వ్యతిరేకించారు. ఈ మేరకు ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నేతత్వంలో అక్కడే బైఠాయించారు. ఆనకట్ట ఎత్తు పెంచితే తమకు నీళ్లు రావనేది ఇక్కడి రైతుల భావనగా ఉంది. మరోవైపు ఆర్డీఎస్ ఎత్తు పెంపు పనులను నిలిపివేస్తున్నారని.. ఇందుకు అనుగుణంగా పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అప్పట్లో మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆర్డీఎస్ను టీబీ బోర్డు పరిధిలోకి తెస్తే.. సులభంగా ఆధునీకరణ పనులను కొనసాగించవచ్చనేది తెలంగాణ ప్రభుత్వ భావన. ఇందుకు అనుగుణంగా టీబీ బోర్డు సమావేశంలో ఎజెండా అంశంగా తెరమీదకు తీసుకొచ్చారు. దీనిని అడ్డుకోకపోతే జిల్లాలోని పశ్చిమ ప్రాంతం మరింత నీటి కరువుతో సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే బోర్డు పరిధిలో ఉన్న ఎల్ఎల్సీలకు సరిపడినన్ని నీళ్లు రాక పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇదే కోవలో రాజోలిబండ ఆయకట్టు ప్రాంతం కూడా ఇబ్బందులు ఎదురవుతాయనే భయాందోళన ఇక్కడి రైతుల్లో వ్యక్తమవుతోంది. -
తుంగభద్ర బోర్డు ముందుకు ఆర్డీఎస్
- ఈనెల 20న బోర్డు సమావేశం - ఆర్డీఎస్ పనుల అడ్డగింతపై ఏపీని నిలదీయనున్న తెలంగాణ సాక్షి, హైదరాబాద్ తుంగభద్ర నదీ జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు ఉన్న వాస్తవ నీటి వాటా వినియోగానికి వీలుగా చేపట్టాల్సిన కాల్వల ఆధునికీకరణ పనుల పురోగతిపై తుంగభద్ర బోర్డు సమావేశంలో గట్టిగా ప్రశ్నించాలని తెలంగాణ నిర్ణయించింది. ఈ కాల్వల ఆధునికీకరణ పనుల్లో జాప్యాన్ని నివారించి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు ఆదేశాలివ్వాలని కోరేందుకు సిధ్దమైంది. ఈ నెల 20న బోర్డు కీలక సమావేశం హైదరాబాద్‌లో జరుగుతుందని బోర్డు ఛైర్మన్ ఆర్కే గుప్తా మంగళవారం తెలంగాణకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో బోర్డు ముందు ప్రస్తావించాల్సిన అంశాలను తెలంగాణ సిధ్దం చేసుకుంది. వాస్తవానికి ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాలోని 87,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది. ఈ నీటిలో కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 7టీఎంసీలు, పరివాహకం నుంచి మరో 8టీఎంసీల మేర నీటి లభ్యమవుతోంది. అయితే కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేరు నీరు రావడం లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ ఆనకట్ట పొడవును మరో 5 అంగుళాల మేర పెంచాలని నిర్ణయించగా, ఇందుకు కర్ణాటక సైతం అంగీకరించింది. ఈ కాల్వల ఆధునికీకరణ కోసం కర్ణాటకకు రాష్ట్రం రూ.72కోట్ల మేర డిపాజిట్ సైతం చేసింది. ఇందులో ప్యాకేజీ-1 పనులను 24శాతం, ప్యాకేజీ-2పనులను మరో 54శాతం వరకు పూర్తి చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునికీకరణ పనులకు అడ్డు తగులుతుండటంతో పనులన్నీ నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రానికి ఏటా 4 టీఎంసీలు కూడా రాష్ట్రానికి రావడం లేదు. దీంతో కేవలం 30వేల ఆయకట్టుకు మాత్రమే అంతంతమాత్రంగా సాగునీరందుతోంది. ఈ అంశమై కర్ణాటక ప్రభుత్వం చర్చలు జరిపి పనుల కొనసాగింపుకు వారిని ఒప్పంచినా, మళ్లీ ఏపీ పనులను అడ్డగించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పనులు కొనసాగించరాదని కర్ణాటక ను ఏపీ అధికారులు హెచ్చరించడంతో పనులు నిలిచిపోయాయి. దీనిపై బోర్డు సమావేశంలో రాష్ట్రం ఏపీని నిలదీసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
కర్నూలులో ఆర్డీఎస్ వద్ద ఉద్రిక్తత
కర్నూలు : రాజోలిబండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీఎస్) వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. దాంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పోలీసులు భారీగా మోహరించారు. కర్ణాటక ప్రభుత్వం ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కుట్రపన్నడంతో ఇటీవల మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, కోసిగి మండలం రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక సర్కార్ మరమ్మత్తు పనులకు సిద్ధం అవటంతో... కర్ణాటక తీరుపై కర్నూలు జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆర్డీఎస్ వద్ద ఎలాంటి ఆధునికీకరణ పనులు చేపట్టకుండా, ఇరు రాష్ట్రాల ప్రజలు గొడవలకు దిగకుండా ముందు జాగ్రత్తగా ఆదోని డీఎస్పీ శివరామిరెడ్డి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరితో పాటు ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సిబ్బంది ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద కాపలా ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు మద్దతుగా నిలిచారు. -
సీఐఎస్ఎఫ్ బలగాలను మొహరించైనా సరే...
హైదరాబాద్: ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) గేట్ల ఎత్తు పెంపును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గేట్ల ఎత్తు పెంపుపై ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ణయం జరిగిందని గుర్తు చేశారు. నిర్మాణ పనులు పూర్తి చేసి తెలంగాణకు 15.9 టీఎంసీల నీటిని తెలంగాణకు ఇవ్వాలన్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కూడా మాట్లాడానని చెప్పారు. సీడబ్లూసీ జోక్యం చేసుకోని సీఐఎస్ఎఫ్ బలగాలను మొహరించైనా సరే ఈ పనులు పూర్తిచేయించాలని హరీశ్‌రావు కోరారు.