- ఈనెల 20న బోర్డు సమావేశం
- ఆర్డీఎస్ పనుల అడ్డగింతపై ఏపీని నిలదీయనున్న తెలంగాణ
సాక్షి, హైదరాబాద్
తుంగభద్ర నదీ జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు ఉన్న వాస్తవ నీటి వాటా వినియోగానికి వీలుగా చేపట్టాల్సిన కాల్వల ఆధునికీకరణ పనుల పురోగతిపై తుంగభద్ర బోర్డు సమావేశంలో గట్టిగా ప్రశ్నించాలని తెలంగాణ నిర్ణయించింది. ఈ కాల్వల ఆధునికీకరణ పనుల్లో జాప్యాన్ని నివారించి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు ఆదేశాలివ్వాలని కోరేందుకు సిధ్దమైంది.
ఈ నెల 20న బోర్డు కీలక సమావేశం హైదరాబాద్‌లో జరుగుతుందని బోర్డు ఛైర్మన్ ఆర్‌కే గుప్తా మంగళవారం తెలంగాణకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో బోర్డు ముందు ప్రస్తావించాల్సిన అంశాలను తెలంగాణ సిధ్దం చేసుకుంది. వాస్తవానికి ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాలోని 87,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది. ఈ నీటిలో కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 7టీఎంసీలు, పరివాహకం నుంచి మరో 8టీఎంసీల మేర నీటి లభ్యమవుతోంది. అయితే కర్ణాటక నుంచి ఆర్డీఎస్‌కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేరు నీరు రావడం లేదు.
ఈ దృష్ట్యా ఆర్డీఎస్ ఆనకట్ట పొడవును మరో 5 అంగుళాల మేర పెంచాలని నిర్ణయించగా, ఇందుకు కర్ణాటక సైతం అంగీకరించింది. ఈ కాల్వల ఆధునికీకరణ కోసం కర్ణాటకకు రాష్ట్రం రూ.72కోట్ల మేర డిపాజిట్ సైతం చేసింది. ఇందులో ప్యాకేజీ-1 పనులను 24శాతం, ప్యాకేజీ-2పనులను మరో 54శాతం వరకు పూర్తి చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునికీకరణ పనులకు అడ్డు తగులుతుండటంతో పనులన్నీ నిలిచిపోయాయి.
దీంతో రాష్ట్రానికి ఏటా 4 టీఎంసీలు కూడా రాష్ట్రానికి రావడం లేదు. దీంతో కేవలం 30వేల ఆయకట్టుకు మాత్రమే అంతంతమాత్రంగా సాగునీరందుతోంది. ఈ అంశమై కర్ణాటక ప్రభుత్వం చర్చలు జరిపి పనుల కొనసాగింపుకు వారిని ఒప్పంచినా, మళ్లీ ఏపీ పనులను అడ్డగించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పనులు కొనసాగించరాదని కర్ణాటక ను ఏపీ అధికారులు హెచ్చరించడంతో పనులు నిలిచిపోయాయి. దీనిపై బోర్డు సమావేశంలో రాష్ట్రం ఏపీని నిలదీసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.