తెలుగు రాష్ట్రాల 'కృష్ణా' పంచాయితీ: కేంద్రం కీలక నిర్ణయం
- కృష్ణా బోర్డు నుంచి ఆర్‌కే గుప్తాను తొలిగించిన కేంద్రం
- గోదావరి బోర్డు సభ్య కార్యదర్శికి అదనపు బాధ్యతలు
- తెలంగాణ అభిప్రాయం కోరకుండానే ప్రాజెక్టుల నియంత్రణపై మొండిగా వ్యవహరించిన గుప్తా
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సభ్య కార్యదర్శి పదవి నుంచి ఆర్‌కే గుప్తాను తొలగిస్తూ కేంద్ర జల వనరుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుల నియంత్రణ అంశంలో గుప్తా వ్యవహార శైలి వల్లే తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించింది. గోదావరి బోర్డు సభ్య కార్యదర్శిగా ఉన్న సమీర్ ఛటర్జీని గుప్తా స్థానంలో నియమించింది.
కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న గుప్తా కృష్ణా బోర్డు తొలినుంచీ బోర్డు సభ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. దీంతో పాటే తుంగభద్ర బోర్డు ఛైర్మన్‌గా, ఆంధ్రప్రదేశ్‌లో నిర్మితమవుతున్న ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శిగా పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కృష్ణాజలాల నీటి వినియోగం, విడుదలకు సంబంధించిన ఎలాంటి అంశాల్లో అయినా గుప్తా తీసుకునే నిర్ణయాల ఆధారంగానే ఆదేశాలు వెలువడుతుంటాయి.
నీటి పంపకాల్లో ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తొలినుంచీ గుప్తాపై తెలంగాణ గుర్రుగా ఉన్నా, ఆయనపై నేరుగా కేంద్రానికి ఏనాడూ ఫిర్యాదు చేయలేదు. అయితే ఇటీవల కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చుకునే అంశంలో గుప్తా కొంత మొండిగా వ్యవహరించారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేనందున, ప్రాజెక్టులపై బోర్డు నియంత్రణ అవసరం లేదని పలు వేదికలపై తెలంగాణ పదేపదే విన్నవిస్తున్నా, వాటిని పట్టించుకోకుండా ఢ్రాప్ట్ నోటిఫికేషన్‌ను తయారు చేసి, దాన్ని ఆమోదించాలంటూ గుప్తా నేరుగా కేంద్రానికి లేఖ రాశారు.