RK Gupta
-
నేడు కృష్ణా బోర్డు చైర్మన్ పదవీవిరమణ
సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు చైర్మన్ ఎ.పరమేశం సోమవారం పదవీ విరమణ చేయనున్నారు. బోర్డు చైర్మన్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్కే గుప్తాను 2019 మార్చి 31న కేంద్ర జల్ శక్తి శాఖ బదిలీ చేసి.. సభ్య కార్యదర్శిగా పనిచేస్తున్న పరమేశంను 2019 ఏప్రిల్ 1న పదోన్నతిపై కృష్ణా బోర్డు చైర్మన్‌గా నియమించింది. తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేటకు చెందిన పరమేశం కృష్ణా బోర్డు చైర్మన్‌గా 25 నెలల పాటు పనిచేశారు. పరమేశం పదవీ విరమణ నేపథ్యంలో కృష్ణా బోర్డు కొత్త చైర్మన్‌గా ఎంపీ సింగ్‌ను కేంద్ర జల్ శక్తి శాఖ నియమించే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎన్‌టీబీవో (నర్మదా తపతి బేసిన్ ఆర్గనైజేషన్) సీఈగా పనిచేస్తున్న ఎంపీ సింగ్ సర్దార్ సరోవర్ కన్స్ట్రక్షన్ అడ్వయిజరీ కమిటీ (ఎస్‌ఎస్‌సీఏసీ) చైర్మన్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. జూన్ 1న ఎంపీ సింగ్ ఒక్కరికే అదనపు కార్యదర్శిగా పదోన్నతి లభించనుంది. విభజన చట్టం ప్రకారం అనదపు కార్యదర్శి హోదా ఉన్న కేంద్ర జల్ శక్తి శాఖ అధికారినే కృష్ణా బోర్డు చైర్మన్‌గా నియమించాలి. ఈ నేపథ్యంలో ఎంపీ సింగ్‌ను కృష్ణా బోర్డు చైర్మన్‌గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నర్మదా నదిపై గుజరాత్లో నిర్మించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు పనుల్లో కీలక భూమిక పోషించిన ఎంపీ సింగ్‌కే పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుందని సీడబ్ల్యూసీ వర్గాలు వెల్లడించాయి. -
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తొలగింపు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) తాజాగా మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.పి.మరాఠే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.కె.గుప్తాలను పదవుల నుంచి తొలగించింది. బ్యాంక్ బోర్డు డైరెక్టర్లు శుక్రవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.సి.రౌత్.. మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారని బ్యాంక్ పేర్కొంది. పుణే పోలీసుల ఆర్థిక నేరాల విభాగం మరాఠే, గుప్తాలను రూ.2,043 కోట్ల స్కామ్‌కు సంబంధించి చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు బెయిల్ మీద బయటకు వచ్చారు. -
అవినీతి ఉచ్చులో మరో బ్యాంకరు
పుణె: కార్పొరేట్ కంపెనీల రుణాల ఎగవేత కుంభకోణంలో ప్రభుత్వ రంగ బ్యాంకర్ల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా డీఎస్ కులకర్ణి గ్రూప్ డిఫాల్ట్ కేసుకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) ఎండీ, సీఈవో రవీంద్ర మరాఠేతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే గుప్తాను పుణెలోని ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం (ఈవోడబ్ల్యూ) అరెస్ట్ చేసింది. బ్యాంకు మాజీ సీఎండీ సుశీల్ మునోత్‌ను కూడా అదుపులోకి తీసుకుంది. డీఎస్కే గ్రూప్‌తో కుమ్మక్కైన బీవోఎం అధికారులు మోసపూరిత లావాదేవీల ద్వారా రుణాలిచ్చారని ఆరోపణలున్నాయి. బ్యాంకు సిబ్బంది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, రుణాల కింద మంజూరు చేసిన నిధులు దారి మళ్లాయని ఈవోడబ్ల్యూ ఒక ప్రకటనలో పేర్కొంది. దాదాపు రూ. 3,000 కోట్ల రుణాల ఎగవేత కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ చీటింగ్, ఫోర్జరీ, క్రిమినల్ కుట్ర తదితర అభియోగాలపై ఈవోడబ్ల్యూ అరెస్ట్ చేసింది. సుమారు రూ.2,892 కోట్ల బ్యాంకు రుణాల నిధులను మళ్లించడం, 4,000 మంది పైచిలుకు ఇన్వెస్టర్లను రూ. 1,154 కోట్ల మేర మోసగించడం తదితర ఆరోపణలపై బిల్డరు డీఎస్ కులకర్ణి, ఆయన భార్య హేమంతి ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టయ్యారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రస్తుత, మాజీ అధికారులతో పాటు డీఎస్కే గ్రూప్‌కి చెందిన మరో ఇద్దరిని కూడా ఈవోడబ్ల్యూ అదుపులోకి తీసుకుంది. ఇందులో చార్టర్డ్ అకౌంటెంట్ సునీల్ ఘట్పాండే, ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ నిత్యానంద్ దేశ్‌పాండే ఉన్నారు. ఇన్వెస్టర్లను మోసగించినందుకు కులకర్ణి, ఆయన భార్యతో పాటు డీఎస్కే గ్రూప్‌లోని ఇతర కీలక అధికారులకు చెందిన 124 ప్రాపర్టీలు, 276 బ్యాంకు ఖాతాలు, 46 వాహనాలు జప్తు చేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. -
తుంగభద్ర బోర్డు ముందుకు ఆర్డీఎస్
- ఈనెల 20న బోర్డు సమావేశం - ఆర్డీఎస్ పనుల అడ్డగింతపై ఏపీని నిలదీయనున్న తెలంగాణ సాక్షి, హైదరాబాద్ తుంగభద్ర నదీ జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు ఉన్న వాస్తవ నీటి వాటా వినియోగానికి వీలుగా చేపట్టాల్సిన కాల్వల ఆధునికీకరణ పనుల పురోగతిపై తుంగభద్ర బోర్డు సమావేశంలో గట్టిగా ప్రశ్నించాలని తెలంగాణ నిర్ణయించింది. ఈ కాల్వల ఆధునికీకరణ పనుల్లో జాప్యాన్ని నివారించి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు ఆదేశాలివ్వాలని కోరేందుకు సిధ్దమైంది. ఈ నెల 20న బోర్డు కీలక సమావేశం హైదరాబాద్‌లో జరుగుతుందని బోర్డు ఛైర్మన్ ఆర్కే గుప్తా మంగళవారం తెలంగాణకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో బోర్డు ముందు ప్రస్తావించాల్సిన అంశాలను తెలంగాణ సిధ్దం చేసుకుంది. వాస్తవానికి ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాలోని 87,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది. ఈ నీటిలో కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 7టీఎంసీలు, పరివాహకం నుంచి మరో 8టీఎంసీల మేర నీటి లభ్యమవుతోంది. అయితే కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేరు నీరు రావడం లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ ఆనకట్ట పొడవును మరో 5 అంగుళాల మేర పెంచాలని నిర్ణయించగా, ఇందుకు కర్ణాటక సైతం అంగీకరించింది. ఈ కాల్వల ఆధునికీకరణ కోసం కర్ణాటకకు రాష్ట్రం రూ.72కోట్ల మేర డిపాజిట్ సైతం చేసింది. ఇందులో ప్యాకేజీ-1 పనులను 24శాతం, ప్యాకేజీ-2పనులను మరో 54శాతం వరకు పూర్తి చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునికీకరణ పనులకు అడ్డు తగులుతుండటంతో పనులన్నీ నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రానికి ఏటా 4 టీఎంసీలు కూడా రాష్ట్రానికి రావడం లేదు. దీంతో కేవలం 30వేల ఆయకట్టుకు మాత్రమే అంతంతమాత్రంగా సాగునీరందుతోంది. ఈ అంశమై కర్ణాటక ప్రభుత్వం చర్చలు జరిపి పనుల కొనసాగింపుకు వారిని ఒప్పంచినా, మళ్లీ ఏపీ పనులను అడ్డగించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పనులు కొనసాగించరాదని కర్ణాటక ను ఏపీ అధికారులు హెచ్చరించడంతో పనులు నిలిచిపోయాయి. దీనిపై బోర్డు సమావేశంలో రాష్ట్రం ఏపీని నిలదీసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
తెలుగు రాష్ట్రాల 'కృష్ణా' పంచాయితీ: కేంద్రం కీలక నిర్ణయం
- కృష్ణా బోర్డు నుంచి ఆర్కే గుప్తాను తొలిగించిన కేంద్రం - గోదావరి బోర్డు సభ్య కార్యదర్శికి అదనపు బాధ్యతలు - తెలంగాణ అభిప్రాయం కోరకుండానే ప్రాజెక్టుల నియంత్రణపై మొండిగా వ్యవహరించిన గుప్తా సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సభ్య కార్యదర్శి పదవి నుంచి ఆర్కే గుప్తాను తొలగిస్తూ కేంద్ర జల వనరుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుల నియంత్రణ అంశంలో గుప్తా వ్యవహార శైలి వల్లే తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించింది. గోదావరి బోర్డు సభ్య కార్యదర్శిగా ఉన్న సమీర్ ఛటర్జీని గుప్తా స్థానంలో నియమించింది. కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న గుప్తా కృష్ణా బోర్డు తొలినుంచీ బోర్డు సభ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. దీంతో పాటే తుంగభద్ర బోర్డు ఛైర్మన్‌గా, ఆంధ్రప్రదేశ్‌లో నిర్మితమవుతున్న ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శిగా పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కృష్ణాజలాల నీటి వినియోగం, విడుదలకు సంబంధించిన ఎలాంటి అంశాల్లో అయినా గుప్తా తీసుకునే నిర్ణయాల ఆధారంగానే ఆదేశాలు వెలువడుతుంటాయి. నీటి పంపకాల్లో ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తొలినుంచీ గుప్తాపై తెలంగాణ గుర్రుగా ఉన్నా, ఆయనపై నేరుగా కేంద్రానికి ఏనాడూ ఫిర్యాదు చేయలేదు. అయితే ఇటీవల కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చుకునే అంశంలో గుప్తా కొంత మొండిగా వ్యవహరించారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేనందున, ప్రాజెక్టులపై బోర్డు నియంత్రణ అవసరం లేదని పలు వేదికలపై తెలంగాణ పదేపదే విన్నవిస్తున్నా, వాటిని పట్టించుకోకుండా ఢ్రాప్ట్ నోటిఫికేషన్‌ను తయారు చేసి, దాన్ని ఆమోదించాలంటూ గుప్తా నేరుగా కేంద్రానికి లేఖ రాశారు. -
కుదరని ఏకాభిప్రాయం!
హైదరాబాద్: కృష్ణా నదీజలాలు, విద్యుత్ ఉత్పత్తి అంశాలపై తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సుదీర్ఘంగా మూడు గంటలపాటు జరిగిన కృష్ణా నదీజలాల నిర్వహణ మండలి(కెఆర్ఎంబి-కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సమావేశం ముగిసింది. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టంపై ఇరు ప్రాంతాల అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండాలని ఏపీ అధికారులు పట్టుబట్టారు.834 అడుగులే ఉండాలని తెలంగాణ అధికారుల వాదన. విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తామని తెలంగాణ అధికారులు చెప్పారు. ఆపాల్సిందేనని ఏపీ అధికారులు వాదించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై కూడా వాదోపవాదాలు జరిగాయి. విద్యుత్ ఉత్పత్తి కోసం 3వ తేదీ వరకు 3 టీఎంసీల నీటిని వాడుకోవాలని బోర్డు సూచించింది. అందుకు తెలంగాణ అధికారులు అంగీకరించారు. పూర్తి స్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ అధికారులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కెఆర్ఎంబి చైర్మన్ ఎస్కేజీ పండిత్, గోదావరి నదీజలాల నిర్వహణ మండలి చైర్మన్ అగర్వాల్, తెలంగాణ, ఏపి రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, సానుకూల వాతావరణంలో సమావేశం జరిగినట్లు కెఆర్ఎంబి సభ్య కార్యదర్శి ఆర్కే గుప్త చెప్పారు. నదీజలాల వివాదాలకు సంబంధించి సాంకేతిక అంశాలపై క్షుణ్ణంగా చర్చించినట్లు తెలిపారు. సమావేశం వివరాలతో పూర్తి ప్రకటన రేపు విడుదల చేస్తామని చెప్పారు. **