కుదరని ఏకాభిప్రాయం!
హైదరాబాద్: కృష్ణా నదీజలాలు, విద్యుత్ ఉత్పత్తి అంశాలపై తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సుదీర్ఘంగా మూడు గంటలపాటు జరిగిన కృష్ణా నదీజలాల నిర్వహణ మండలి(కెఆర్ఎంబి-కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సమావేశం ముగిసింది. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టంపై ఇరు ప్రాంతాల అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండాలని ఏపీ అధికారులు పట్టుబట్టారు.834 అడుగులే ఉండాలని తెలంగాణ అధికారుల వాదన. విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తామని తెలంగాణ అధికారులు చెప్పారు. ఆపాల్సిందేనని ఏపీ అధికారులు వాదించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై కూడా వాదోపవాదాలు జరిగాయి.
విద్యుత్ ఉత్పత్తి కోసం 3వ తేదీ వరకు 3 టీఎంసీల నీటిని వాడుకోవాలని బోర్డు సూచించింది. అందుకు తెలంగాణ అధికారులు అంగీకరించారు. పూర్తి స్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ అధికారులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కెఆర్ఎంబి చైర్మన్ ఎస్‌కేజీ పండిత్, గోదావరి నదీజలాల నిర్వహణ మండలి చైర్మన్ అగర్వాల్, తెలంగాణ, ఏపి రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, సానుకూల వాతావరణంలో సమావేశం జరిగినట్లు కెఆర్ఎంబి సభ్య కార్యదర్శి ఆర్కే గుప్త చెప్పారు. నదీజలాల వివాదాలకు సంబంధించి సాంకేతిక అంశాలపై క్షుణ్ణంగా చర్చించినట్లు తెలిపారు. సమావేశం వివరాలతో పూర్తి ప్రకటన రేపు విడుదల చేస్తామని చెప్పారు.
**