అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు ఈ ఏడాది నీటి కోటాను ఒకట్రెండు టీఎంసీలు పెంచనున్నారు. కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురవడంతో తుంగభద్ర జలాశయం నీటితో కళకళలాడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తుంగభద్రకు వరదలు పోటెత్తుతున్నాయి. ఇది హెచ్చెల్సీ ఆయకట్టుదారులకు వరంగా మారుతోంది. డ్యాంలో ప్రస్తుత నీటి లభ్యతను బట్టి హెచ్చెల్సీ కోటా పెంచే యోచన ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
ఈసారి హెచ్చెల్సీకి కాస్త మెరుగ్గానే నీటి కేటాయింపులు చేశారు. గతేడాది 18 టీఎంసీలు మాత్రమే కేటాయించగా... ఈసారి జూలైలో నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుని 22.999 టీఎంసీలు కేటాయించారు. ఇందులో తాగునీటి అవసరాలకు 8.5 టీ ఎంసీలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇది గతేడాది కంటే 0.5 టీఎంసీలు అధికం. ఇదిలావుండగా కర్ణాటక ఎగువ ప్రాంతం నుంచి ఇప్పటికీ వరద నీరు భారీగా డ్యాంలోకి వచ్చి చేరుతోంది. 18,048 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఈ కారణంగా హెచ్చెల్సీకి కేటాయింపులు పెంచే యోచన ఉన్నట్లు సమాచారం. ప్రతి రెండు నెలలకొకసారి నిర్వహించే తుంగభద్ర బోర్డు సమావేశంలో నీటి కేటాయింపులపై చర్చిస్తారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేటాయింపులు పెంచడం, తగ్గించడం చేస్తారు.
గతేడాది తొలుత 22 టీ ఎంసీలు కేటాయించిన అధికారులు... నీటి ల భ్యత పడిపోయిందని సాకుగా చూపించి చివరకు 18 టీఎంసీలు ఇచ్చారు. దీంతో గతేడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే... ఈ ఏడాది ఆశాజనకమైన వాతావరణం నెలకొనడంతో రైతు ల్లో ఉత్సాహం కన్పిస్తోంది. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని తుంగభద్ర బోర్డు అధికారులపై ఒత్తిడి తెస్తే జిల్లాకు నీటి కేటాయింపులు పెరుగుతాయని అధికారులు కూడా సూచిస్తున్నారు.
నీటి విడుదలలో పిసినారితనం
తుంగభద్ర డ్యాంలో నీరు సమృద్ధిగా ఉన్నా హెచ్చెల్సీకి ఆ మేరకు విడుదల చేయడంలో బోర్డు అధికారులు పిసినారి తనాన్ని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హెచ్చెల్సీ మెయిన్ కెనాల్, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌తో పాటు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని ఏకకాలంలో సరఫరా చేయాలంటే కనీసం 1,800 క్యూసెక్కులు విడుదల చేయాలి. అయితే.. ప్రస్తుతం 1,200 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది. అన్నింటికీ సరఫరా చేయలేక హెచ్చెల్సీ అధికారులు చేతులెత్తేస్తున్నారు. పంటల సాగుకు అదను దాటిపోతున్నా హెచ్చెల్సీ సౌత్, నార్త్ కెనాళ్లకు నీరివ్వలేకపోతున్నారు. డ్యాం వద్ద అవసరాల మేరకు నీటిని విడుదల చేస్తే సరఫరా చేయడం సులభతరంగా ఉంటుందని అధికారులు అంటున్నారు.
కోటా పెరగవచ్చు: ధనుంజయరావు,
ఈఈ, లోకలైజేషన్
తుంగభద్ర డ్యాంలోకి ప్రస్తుతం వరద నీరు ఆశాజనకంగా చేరుతోంది. దీంతో హెచ్చెల్సీకి కేటాయింపులు పెరగవచ్చని భావిస్తున్నాం. ఏ మేరకు పెంచుతారన్నది త్వరలో జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయిస్తారు. కేటాయింపులు పెరిగితే రైతులకు ఊరట కలుగుతుంది.
పెరగనున్న హెచ్చెల్సీ కోటా!
Published Mon, Sep 9 2013 5:47 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement