పెడపల్లి అంగన్‌వాడీ కేంద్రం వద్ద తాగి పడేసిన కర్ణాటక మద్యం బాటిళ్లు, ప్యాకెట్లు
పుట్టపర్తి అర్బన్: నియోజకవర్గంలోని గ్రామాల్లో కర్ణాటక మద్యం ఏరులై పారుతోంది. పలు గ్రామాల్లో కొందరు యువకులు రాత్రిళ్లు ద్విచక్ర వాహనాల్లో తీసుకువచ్చి, గుట్టుచప్పుడు కాకుండా అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ అక్రమ దందాను యువకులు ఆదాయవనరుగా మార్చుకున్నారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది దాడులు చేస్తున్నా.. మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
అడ్డదారుల్లో అక్రమ రవాణా..
కర్ణాటక నుంచి కొంత మంది ప్రత్యేక వాహనాల్లో పుట్టపర్తి మండల సరిహద్దు గ్రామాలకు మద్యాన్ని చేరవేస్తున్నారు. అక్కడి నుంచి అన్ని గ్రామాలకు కాలిబాట, ద్విచక్ర వాహనాల ద్వారా యువకులు మద్యం రవాణా చేస్తున్నారు. గ్రామాల్లోకి నేరుగా వీటిని తీసుకెళ్లకుండా.. చుట్టుపక్కల ఉన్న పంట పొలాల్లో దాచి ఉంచి, తమకు నమ్మకమైన మద్యం ప్రియులకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, బ్రిడ్జిల వద్ద, చెట్లు కింద, తోపుల్లోనూ, గ్రామ శివారున ఖాళీగా ఉన్న ఇళ్ల వద్ద మద్యం విక్రయాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పుట్టపర్తి మండలంలో పెడపల్లి, వెంగళమ్మచెరువు, బొంతలపల్లి, బత్తలపల్లి, సాతార్లపల్లి, గంగిరెడ్డిపల్లి, కొట్లపల్లి, నిడిమామిడి, నగర పంచాయతీలో బ్రాహ్మణపల్లి, ఎనుములపల్లి, కర్ణాటక నాగేపల్లి, కోవెలగుట్టపల్లి, రాయలవారిపల్లి ఇలా చాలా గ్రామాల్లో కర్ణాటక మద్యం అమ్మకాలు విపరీతంగా సాగుతున్నాయి.
రవాణాదారులకూ మంచి ఆదాయం..
కర్ణాటక నుంచి ఒక్కో మద్యం టెట్రా పాకెట్‌ను మండలంలోని గ్రామాలకు చేర్చితే రూ.70 నుంచి రూ.80 చొప్పున యువకులకు విక్రయదారులు అందజేస్తున్నారు. ఈ మొత్తాన్ని మద్యం ప్రియులపై రుద్ది అధిక ధరకు విక్రయిస్తున్నారు. రూ.35 ఎమ్మార్పీ ధర ఉన్న ఒక్కొ టెట్రా ప్యాకెట్‌ను రూ. 200 చొప్పున తాగుబోతులకు కట్టబెడుతున్నారు. దీంతో ఒక్కో ప్యాకెట్‌పై ఎంత లేదన్న రూ. 100 నుంచి రూ.130 ఆదాయం గడిస్తున్నట్లు సమాచారం. రోజూ పది ప్యాకెట్ల మద్యం అమ్ముకుంటే కనీసంగా రూ.1,300 వరకు మిగులుబాటు ఉంటోంది. ఈ మొత్తం తంతు కేవలం ఒక గంట లోపు మద్యం అక్రమ విక్రయదారులు ముగించేస్తున్నారు. దీంతో నెలకు రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకూ ఆర్జిస్తున్నట్లు బహిరంగంగా పలువురు చర్చించుకుంటున్నారు.
సిబ్బందికీ గిట్టుబాటే!..
కర్ణాటక మద్యం అక్రమ రవాణా, అమ్మకాలను చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న సిబ్బందికి సైతం మంచి గిట్టుబాటు ఉంటోందని మద్యం విక్రేతలు చెబుతున్నారు. మద్యం అమ్ముతున్నప్పుడు చూసినా.. లేదా రవాణా చేస్తున్న సమయంలో పట్టుకున్నా.. ప్రతిసారీ రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ చేతులు తడపాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. అక్రమ దందాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ సమాచారం వెంటనే అక్రమ మద్యం వ్యాపారులకు చేరిపోతుంది. ఈ సమాచారం అందజేసినందుకూ ప్రత్యేక ధరను పోలీసులకు చెల్లించుకోవాల్సి వస్తోందని వ్యాపారులు అంటున్నారు. దీంతో ఈ మొత్తం అక్రమ వ్యాపారంపై తమకు గిట్టుబాటు అవుతుండడంతో కర్ణాటక మద్యం అక్రమ రవాణా, విక్రయాలకు పోలీసులు అడ్డుకట్ట వేయలేకపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment