– ఘనంగా దుర్గామాత నిమజ్జనం
– దుర్గాఘాట్ వద్ద ఆధ్యాత్మిక పరిమళం
– నగరంలో కలశాలతో మహిళల ఊరేగింపు
కర్నూలు(కల్చరల్) : దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా పది రోజులుగా విశిష్ట పూజలందుకున్న దుర్గామాత బుధవారం తుంగభద్రమ్మ ఒడికి చేరింది. రమ్యకపర్దిని... మోక్షదాయని... శిష్టసంరక్షిణి... దుష్ట సంహారిణి... దయ చూడవమ్మా.. అంటూ నగరంలోని వివిధ ప్రాంతాలలో దుర్గామాత విగ్రహాలకు పూజలు చేశారు. అనంతరం విగ్రహాలను ఊరేగింపుగా దుర్గా ఘాట్‌కు తీసుకెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు నగరంలోని చిన్నమార్కెట్ సమీపంలో నేతాజీ వీధిలో దుర్గామాత విగ్రహానికి టీజీవి ట్రస్ట్ నిర్వాహకులు, యువ పారిశ్రామికవేత్త టి.జి.భరత్ ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపును ప్రారంభించారు. చిన్న మార్కెట్ నేతాజీ వీధి నుంచి ప్రారంభమైన విగ్రహాల ఊరేగింపు చిత్తారి వీధి, జొహరాపురం, రాంభొట్ల ఆలయం, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, పూలబజార్, మించిన్ బజార్, తెలుగు తల్లి సర్కిల్, మున్సిపల్ పాఠశాల గ్రౌండ్, కోట్ల సర్కిల్, ఎస్‌బీఐ సర్కిల్ మీదుగా సంకల్‌బాగ్‌లోని దుర్గా ఘాట్‌ను చేరుకున్నాయి. కృష్ణానగర్, బుధవారపేట, ఆర్‌ఎస్ సర్కిల్ తదితర ప్రాంతాల నుంచి ఊరేగింపుగా తరలివచ్చిన విగ్రహాలు సంకల్‌బాగ్‌లోని దుర్గాఘాట్‌ను చేరుకున్నాయి.
దుర్గా ఘాట్ వద్ద ఆధ్యాత్మిక పరిమళం...
నగరంలోని దుర్గాఘాట్ వద్ద 67 దుర్గామాత విగ్రహాలు తరలిరావడంతో ఆధ్యాత్మిక పరిమళం అలుముకుంది. తుంగభద్ర తీరంలో విద్యుత్ దీపకాంతులతో చేసిన అలంకరణలు చూపరులను ఆకట్టుకున్నాయి. ట్రాక్టర్లలో తరలివస్తున్న విగ్రహాల ముందు పరాశక్తి భక్తబృందం చేసిన భజనలు, పాడిన ఆధ్యాత్మిక గీతాలు అలరించాయి. ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై విద్యార్థులు దుర్గామాతను స్తుతిస్తూ చేసిన నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టీజీవి ట్రస్ట్, గీతా ప్రచార సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సాయంత్రం 5:30 గంటలకు దుర్గా ఘాట్ వద్ద నిమజ్జనోత్సవం ప్రారంభమయ్యింది.
దుర్గమ్మ ఆశీస్సులతో సుఖశాంతులు...
దుర్గమ్మ ఆశీస్సులతో జిల్లాలో సుఖశాంతులు విలసిల్లుతాయని రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్ తెలిపారు. సంకల్‌బాగ్‌లోని దుర్గాఘాట్ వద్ద జరిగిన నిమజ్జనోత్సవ ప్రారంభ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఏటా దుర్గా విగ్రహాల సంఖ్య పెరుగుతోందని, మహిళలు పెద్ద ఎత్తున నిమజ్జనోత్సవంలో పాల్గొంటున్నారని తెలిపారు. దుర్గా నిమజ్జనోత్సవ కార్యక్రమంలో మహిళలు పాల్గొని తమ భక్తిప్రపత్తులు చాటుకోవడం అభినందనీయని కలెక్టర్ విజయమోహన్ అన్నారు.
పరాశక్తి విగ్రహానికి తొలి నిమజ్జనం...
దుర్గా ఘాట్ వద్ద చిన్నమార్కెట్ నుంచి తరలివచ్చిన పరాశక్తి విగ్రహానికి పూజలు చేసి తొలి నిమజ్జనం నిర్వహించారు. తలపై కలశాలతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత, కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, మార్కెట్ యార్డు చైర్మన్ శమంతకమణి, బీజేపీ నాయకులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, టీడీపీ పాణ్యం నియోజకవర్గ ఇన్‌చార్జి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, డోన్ టీడీపీ ఇన్‌చార్జి కె.ఇ.ప్రతాప్, కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ ఆకే రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.