కేసీకి సాగు నీరు బంద్
Published Sat, Oct 8 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
కర్నూలు సిటీ: కర్నూలు–కడప కాలువకు నీటి విడుదలను నిలిపేశారు. తుంగభద్ర నది నుంచి సుంకేసుల బ్యారేజ్‌కు ఇన్‌ఫ్లో లేకపోవడంతో శనివారం..అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఇటీవల నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు కురవడంతో కొంత నీటి ప్రవాహం వచ్చింది. దీంతో కేసీ కాల్వ 0కి.మీ నుంచి 120 కి.మీ వరకు సాగు చేసిన ఆయకట్టుకు నీరు ఇచ్చారు. అలగనూరు జలాశయంలోకి కూడా కొంత నీటిని నిల్వ చేశారు. కేసీ కింద ఈ ఖరీఫ్‌లో 40 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. కాల్వకు నీరు బంద్ కావడంతో వరి సాగుకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
దిగువ కాల్వపై గస్తీకి కలెక్టర్ అనుమతి...
తుంగభద్ర దిగువ కాలువపై పోలీసు గస్తీ ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ అనుమతులు ఇచ్చారు. కాలువపై 135 కి.మీ నుంచి 250 కి.మీ వరకు గస్తీ నిర్వహించేందుకు పోలీసులకు అవసరమైన వాహనాలు, తాత్కాలిక విడిది ఏర్పాట్లకు సుమారు 6 లక్షలు ఖర్చు అవుతుందని ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు వేసి కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. దీంతో పాటు ఎస్పీ ఆకే రవికృష్ణ దృష్టికి తుంగభద్ర దిగువ కాలువపై గస్తీ ఏర్పాటుకు అనుమతించాలని ఇంజినీర్లు కోరారు. దసరా ఉత్సవాల తరువాత పోలీస్ బంద్ బస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ హామీనిచ్చారు.
Advertisement