క‘న్నీటి’ తడి
క‘న్నీటి’ తడి
Published Sun, Feb 12 2017 11:02 PM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM
- కర్షకులకు తప్పని సాగునీటి కష్టాలు
- కేసీ కాల్వ కింద ఎండుతున్న పంటలు
- పైరును కాపాడేందుకు రైతుల పాట్లు
- ఆర్థికభారంతో నష్టపోతున్న అన్నదాతలు
- అమలుకాని అధికార పార్టీ నేతల హామీలు
ఎండిన పంటను అడిగితే అన్నదాత గుండె కోత ఏమిటో చెబుతుంది
అడుగంటిన కాలువలను ప్రశ్నిస్తే టీడీపీ నేతల నయవంచన బయటపడుతుంది
మొరాయిస్తున్న ఆయిల్ ఇంజన్లను నిలదీస్తే అధికారుల ఉదాసీనత తేటతెల్లమవుతుంది
నెర్రలిచ్చిన నేలను కదిలిస్తే.. నీటి కోసం భూమి పుత్రుడు పడుతున్న ఆరాటమేమిటో తెలుస్తుంది
ఒట్టిపోయిన తూములను పలకిరిస్తే..జారిపోతున్న రైతు కన్నీళ్లెన్నో వివరిస్తుంది!!
అధికార పార్టీ నేతల మాట విని రెండో పంట సాగు చేసిన రైతుల కన్నీటి గాథ ఇది..
- మహానంది/బండి ఆత్మకూరు
రెండు పంటలకు సాగునీరు అందిస్తాం. తెలుగుగంగ, కేసీ కెనాల్ కింద రైతులు నిర్భయంగా వరి సాగుచేసుకోవచ్చు.
..టీడీపీ నేతలు రైతులకు ఇచ్చిన హామీ ఇది.
శ్రీశైలం జలాశయంలో నీరు సమృద్ధిగా ఉంది. ఒక పంటకే కాదు రెండు, మూడు, నాలుగు పంటలకైనా సాగు నీరు ఇస్తాం.
- ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ఇది.
టీడీపీ నేతల హామీ అమలు కాలేదు. స్వయంగా సీఎం చేసిన ప్రకటనకూ దిక్కులేకుండా పోయింది. వేలాది ఎకరాల్లో సాగు చేసిన వరిపైరు నీరు లేక నిట్టనిలువునా ఎండిపోతోంది.
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో కేసీ కెనాల్, తెలుగుగంగ కాల్వ కింద సుమారు 25 వేల ఎకరాల్లో వరిపంటను సాగు చేశారు. గత నెలలో కేసీ కెనాల్, తెలుగుగంగకు సాగునీరు దాదాపు 15రోజులు నిలిచిపోవడంతో రైతులు అధికార పార్టీ నేతలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వారం రోజుల క్రితం కేసీ కెనాల్‌కు, తెలుగుగంగకు సాగునీరు అధికారులు విడుదల చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వరిపంట పూర్తయ్యే వరకు సాగునీరు విడుదల చేయిస్తామని చెప్పుకున్నారు. అంతేగాక కలెక్టర్ కూడా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి.. రెండు పంప్‌లు, మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి రెండు పంపులు సాగునీరు విడుదల చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం విడుదల చేసిన నీరు కేసీ కెనాల్‌లో ఈనెల 25వ తేదీ వరకు వస్తుందని కలెక్టర్ వివరించారు. తర్వాత విడత కేసీ కెనాల్ మార్చినెలలో విడుదల చేస్తామని చెప్పడంతో రైతులు హర్షించారు.
కేసీకి నిలిచిన నీరు..
శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం 844 అడుగులకు చేరడంతో పోతిరెడ్డిపాడు నుంచి సాగునీరు కేసీ కెనాల్‌కు రావడం నిలిచి పోయింది. ఈ క్రమంలో గోరుచుట్టుపై రోకలిపోటు అన్నచందంగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కూడా నీటి విడుదలను నిలిపి వేశారు. దీంతో కేసీ కెనాల్‌లో సాగునీరు రావడం పూర్తిగా నిలిచి పోయింది. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య.. సొంత ఊరు బండిఆత్మకూరు చిన్నదేవళాపురం గ్రామం కావడంతో రైతులు ఆయన దృష్టికి సమస్యను తెచ్చారు. నందికొట్కూరు, శ్రీశైలం నియోజకవర్గాల్లోని రైతుల కోసం ఆయన కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించే ప్రయత్నం ఇటీవల చేశారు. అయితే కలెక్టర్.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సందర్భంగా కనీసం ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో రైతులకు తమ సమస్యను ఏ విధంగా అధికారులకు తెలియజేయాలో తెలియని సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది.
అడుగడుగునా కట్టలు..
కేసీ కెనాల్‌తో పాటు తెలుగుగంగలో కూడా వారం రోజుల నుంచి సాగునీరు విడుదల చేయడం నిలిపి వేశారు. దీంతో రైతులు కాలువలో అడుగున ఉన్న నీటిని పొలాలకు పారించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. కేసీ కెనాల్, టీజీపీ ప్రధాన కాల్వల్లో కట్టలు వేసి ఉన్న కొద్దిపాటి నీటిని పొలాలకు పారించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అధికారులు కాల్వల్లో కట్టలు వేస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. దీంతో రైతులు తమ పొలాలకు సాగునీరు విడుదల చేస్తే ఎందుకు కట్టలు వేసుకుంటామని అధికారులను నిలదీస్తున్నారు.
తూములకు అందని నీరు..
కేసీ కేనాల్‌లో నీరు పూర్తిగా అడుగంటి పోవడంతో తూములకు నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయి. కళ్లముందు పంటను వదులుకోలేక ట్రాక్టర్లకు మోటార్లను ఏర్పాటు చేసుకొని ఉన్న కొద్దిపాటి నీటిని పొలాలకు పారిస్తున్నారు. కొందరు డీజిల్ ఇంజన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎకరా వరి పంటకు నీరు అందించుకునేందుకు సుమారు 8లీటర్ల డీజిల్ అవసరం. ఇందుకు రూ. 700 వరకు ఖర్చు అవుతుంది. అదనంగా శ్రమించాల్సి ఉంది. మహానంది మండలం ఉల్లిగడ్డల బొల్లవరం, తమ్మడపల్లె గ్రామాల పరిధిలో సుమారు 5వేల ఎకరాల వరి పంటను రైతులు సాగు చేశారు. అలాగే నంద్యాల మండలం పెద్దకొట్టాల, బిల్లలాపురం, కొత్తపల్లె పరిధిలో కేసీ కాల్వ నీటితో వేలాది ఎకరాల్లో వరి పంట వేశారు. కేసీలో నీళ్లు అడుగంటడంతో రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం.
మోసపోయాం: రాజేశ్వరయ్యాచారి, బొల్లవరం
రెండు పంటలకు నీరిస్తామని టీడీపీ నాయకులు చెప్పడంతో వరి వేశాం. వారు చెప్పిన మాటలు విని మోసపోయాం. తీరా పైర్లు ఒక దశలో వచ్చాక నీరు ఇవ్వకపోడంతో ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా స్పందించి నీరు ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యం.
రైతులను ఆదుకోవాలి: మురళీ, వరి రైతు
నేను ఏడెకరాల్లో కేసీ కాల్వ కింద వరి వేశాను. నీళ్లు అందక పంట ఎండిపోతుంది. ఇంజన్ల ద్వారా రోజూ నీళ్లు అందించలేకపోతున్నాం. అ«ధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పంటలకు నీరుఅందేలా చర్యలు తీసుకోవాలి.
టీడీపీ నాయకులు మొహం చాటేయడం తగదు: ఉస్మాన్, బండిఆత్మకూరు
టీడీపీ నేతలు గ్రామాల్లోకి వచ్చే రోజు ముందు సాగునీరు విడుదల చేస్తున్నారు. వారు వెళ్లిన తర్వాత సాగునీరు నిలిచి నిలిచిపోతోంది. నీరు విడుదల చేయాలని టీడీపీ నాయకులను కోరుతుంటే వారు మొహం చాటేస్తూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు బుద్ధి చెప్పేరోజులు దగ్గరలోనే ఉన్నాయి.
Advertisement
Advertisement