టీబీ డ్యాం నుంచి నీటి విడుదల బంద్
– ఇండెంట్ గడువుకు ముందే నిలుపుదల
– హంద్రీనీవా నుంచి మళ్లింపునకు అనుమతించని సర్కారు
– కేసీ ఆయకట్టు రైతుల ఆందోళన
కర్నూలు సిటీ: మూడు రోజులు ముందుగానే తుంగభద్ర డ్యాం నుంచి నీటి విడుదల శనివారం నిలిచిపోయింది. కేసీ ఆయకట్టును కాపాడేందుకు డ్యాం నుంచి గత నెల 29న నీటి విడుదల ప్రారంభించారు. 3వేల క్యుసెక్కుల చొప్పున 5 రోజులు, 1500 క్యుసెక్కుల చొప్పున 10 రోజులపాటువిడుదల చేయాలని టీబి బోర్డుకు జల వనరుల శాఖ ఇంజినీర్లు ఇండెంట్ పెట్టారు. డ్యాం నుంచి విడుదల చేసిన నీరు ఈ నెల 3న సుంకేసుల బ్యారేజీకి చేరుకుంది. కాల్వ ద్వారా డ్యాం నుంచి 120 కి.మీ. వరకు కూడా చేరకముందే నీరు బంద్ కావడంతో ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా ఈ నెల 13 వరకు డ్యాం నుంచి నీరు రావాల్సి ఉన్నా ఎలాంటి సమాచారం లేకుండానే బోర్డు అధికారులు నీటిని బంద్ చేశారు. ఈ కారణంగా కేసీకి మరో మూడ, నాలుగు రోజుల్లో నీటిని బంద్ చేసే అవకాశం ఉన్నట్లు అధికార యంత్రాంగం చెబుతోంది.
ఆదిలోనే అడ్డంకులు..
కేసీ ఆయకట్టుకు సాగునీరు అందించడం కోసం హంద్రీనీవా మొదటి లిఫ్ట్ మల్యాల నుంచి ప్రత్యామ్నాయంగా నీటి మళ్లించేందుకు రెండు పైపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రతిపాదన 2013 నుంచి పెండింగ్‌లోనే ఉంది. అయితే ఇటీవల దీని కోసం రైతులు డిమాండ్ చేయడంతో పనులు మొదలు పెట్టి పూర్తి చేసే దశకు చేరుకున్నారు. ఒక పంపు పనులు పూర్తి చేసి రెండు రోజుల క్రితమే ట్రయల్ రన్ చేశారు. మరో పైపు పనులు రెండు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే నీటి మళ్లింపునకు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ట్రయల్‌రన్ చేసిన వెంటనే బంద్ చేసినట్లు తెలిసింది.
కేసీకి నీరు మరో నాలుగు రోజులే..
టీబీ డ్యాం నుంచి ఎలాంటి సమాచారం లేకుండానే నీటి విడుదల నిలిపేశారు. అయితే పై నుంచి వస్తున్న నీరు కేసీకి మరో నాలుగు రోజులు సరిపోతుంది. హంద్రీనీవా నుంచి నీరు మళ్లించేందుకు ప్రస్తుతం ఒక పైపు పనులు పూర్తయ్యాయి. అవసరం మేరకు హంద్రీనీవా నీరు వాడుకుంటాం. అనుమతుల విషయం తెలియదు.
– ఎస్.చంద్రశేఖర్‌రావు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్