
మరో తొంభైటీఎంసీలు!
ఎగువన ఉన్న కర్ణాటక ప్రాజెక్టులు నిండేందుకు అవసరమైన నీరు ఇది
ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రలకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
అక్కడ 60 టీఎంసీలు వచ్చినా మనకు నీరొచ్చే అవకాశం
హైదరాబాద్: కృష్ణా నది ఎగువన కర్ణాటకలోని ప్రధాన ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరడంతో అవన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. మూడు ప్రాజెక్టుల వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం 268.22 టీఎంసీలు కాగా అందులో 177.90 టీఎంసీల నీటి నిల్వలు ప్రస్తుతం ఉన్నాయి. మరో 90 టీఎంసీల మేర నీరు చేరితే అవి నిండిపోతాయి. ఇందులో 60 టీఎంసీల మేర నీరొచ్చినా దిగువన తెలంగాణకు ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర నీటి పారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. కృష్ణా బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నీటి మట్టాలు గణనీయంగా పడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లో లేని కారణంగా నాగార్జునసాగర్ , శ్రీశైలం, జూరాలలో నీటిమట్టాలు పూర్తిగా అడుగంటాయి. ఇప్పటికే సాగర్‌లో కనీస మట్టం కిందకు నిల్వలు పడిపోవడంతో శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్నారు. గత మూడు రోజులుగా శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేయడంతో శ్రీశైలంలో నీటిమట్టం 800 అడుగులకు చేరింది. ఒక్క జూరాలలో మాత్రం కాస్త ఆశాజనకంగా 11.9 టీఎంసీలకు గాను 6.26 టీఎంసీల నీరుంది. దిగువన రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి నీరు చేరాలంటే ఎగువ కర్ణాటక ప్రాజెక్టులు నిండాల్సి ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్‌లు నిండితేనే దిగువకు ఇన్‌ఫ్లో ఉంటుంది. అక్కడ ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇన్‌ఫ్లో పెరగడంతో ఆల్మట్టిలో ప్రస్తుతం 129.72 టీఎంసీలకు గాను 69.06 టీఎంసీలు నిల్వ ఉంది.
నారాయణపూర్‌లో 37.64 టీఎంసీలకుగాను 32.1 టీఎంసీల నీరుండగా, తుంగభద్రలో 100.86 టీఎంసీలకు 76.74 టీఎంసీల నీరు ఉంది. మొత్తంగా 90 టీఎంసీల మేర లోటు కనబడుతున్నా, అందులో 50-60 టీఎంసీలు చేరితే దిగువకు ఇన్‌ఫ్లో కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆల్మట్టిలో మరో 30-40 టీఎంసీల నీరు చేరితే దిగువ నారాయణపూర్‌కు వదులుతారు. అక్కడ ఇప్పటికే పుష్కలంగా నిల్వలు ఉన్నందున, ఆల్మట్టి నుంచి వచ్చే నీటిని నేరుగా దిగువ రాష్ట్రానికే వదిలే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సైతం ఆల్మట్టి, నారాయణపూర్‌లకు తగిన రీతిలో ఇన్‌ఫ్లో ఉందని, ఇది ఇలాగే కొనసాగితే సెప్టెంబర్ రెండోవారానికి పూర్తిస్థాయిలో ప్రాజెక్టులు నిండుతాయి. అలా జరిగితే రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు అంచనావేస్తున్నాయి.