వచ్చిన నీటిని వచ్చినట్టే తోడేస్తున్నారు! | TS Govt Slams Karnataka On Over Consuming Krishna Water | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 12 2018 1:36 AM | Last Updated on Sat, Aug 11 2018 5:02 PM

TS Govt Slams Karnataka On Over Consuming Krishna Water - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎగువన ఉన్నామన్న ఆధిపత్యమో.. దిగువన తెలియదన్న ధీమానో కానీ కర్ణాటక ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ఇప్పటికే కృష్ణా జలాలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న ఆ రాష్ట్రం ప్రస్తుతం వచ్చిన నీటిని వచ్చినట్లుగా వాడేస్తోంది. దిగువ రాష్ట్రాల హక్కులను తుంగలో తొక్కేస్తూ, ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రల ఎగువనే నీటినంతా దోచేస్తోంది. ప్రధాన ప్రాజెక్టుల నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడేస్తూ చెరువులు, కాలువలు చిన్నతరహా జలాశయాలను నింపుతోంది. దీంతో వర్షాకాలం మొదలై నెలన్నర దాటిపోయినా ఇప్పటికీ శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రాజెక్టులు ఖాళీ కుండలను తలపిస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోనే ఏకంగా 365 టీఎంసీల లోటు ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే సాగర్‌ పరిధిలోని 6.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు అక్టోబర్, నవంబర్‌నాటి నీరందడం గగనంగానే కనిపిస్తోంది.

నీళ్లను తరలిస్తోంది ఇలా..
జూన్, జూలైలో కురిసే సాధారణ వర్షాలకే ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రకు ప్రవాహాలు మొదలయ్యాయి. తుంగభద్రకు ఈ వాటర్‌ ఇయర్‌లో జూన్‌ నుంచి గరిష్టంగా రోజుకు 30 వేల క్యూసెక్కులకు మించి వరద కొనసాగుతోంది. అయినా ఇప్పటిదాకా ప్రాజెక్టుల్లో చేరిన కొత్త నీరు 43 టీఎంసీలే కావడం గమనార్హం. బుధవారం కూడా ఈ ప్రాజెక్టులోకి 38 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ప్రస్తుతం 50.07 టీఎంసీల నిల్వలే ఉన్నాయి. తుంగభద్ర ఎగువనే కర్ణాటక గరిష్టంగా నీటిని వినియోగిస్తోంది. తుంగ, భద్ర సబ్‌ బేసిన్‌లోని ప్రాజెక్టుల నుంచి విచ్చిలవిడిగా వినియోగిస్తోంది. తుంగభద్ర ప్రాజెక్టు ఎగువనే భద్ర, అప్పర్‌ తుంగ, భద్ర రిజర్వాయర్, మైనర్‌ ఇరిగేషన్‌లో ఇప్పటికే వినియోగం మొదలుపెట్టింది.

వేదవతి సబ్‌ బేసిన్‌లోనూ మైనర్‌ ఇరిగేషన్‌ ద్వారా 40 టీఎంసీలు, వాణివిలాస్‌ ప్రాజెక్టు ద్వారా 18 టీఎంసీల నీటి వినియోగానికి వీలుగా ఇప్పటికే చెరువులు నింపే పని మొదలు పెట్టినట్లుగా నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇలా నెలన్నర వ్యవధిలోనూ తుంగభద్ర ఎగువన కనిష్టంగా 10 టీఎంసీలు గరిష్టంగా 20 టీఎంసీలు వినియోగించినట్లు తెలుస్తోంది. రెండు మూడ్రోజులుగా తుంగభద్ర నుంచి కాల్వలకు నీటిని విడుదల చేస్తోంది. బుధవారం కాల్వల ద్వారా 448 క్యూసెక్కుల నీటిని వదిలినట్లుగా రికార్డులు చెబుతున్నా.. ఇది అంతకుమించి ఉంటుందన్నది తెలంగాణ అధికారులు పేర్కొంటున్నారు. తుంగభద్ర ఎగువనే ఇలా నీటిని వాడేస్తుండటంతో దిగువ శ్రీశైలానికి ప్రవాహాలు కరువయ్యాయి.

ఆల్మట్టి నుంచి ఎత్తిపోతలకు..
ఆల్మట్టి పరిధిలో ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని వినియోగిస్తున్నారు. ఈ ప్రాజెక్టులోకి ఇప్పటివరకు 38 టీఎంసీల కొత్తనీరు వచ్చింది. అప్పటికే ఉన్న నిల్వతో కలిపితే 58 టీఎంసీల నీరు ఉండాలి. కానీ గత 15 రోజులుగా దాదాపు 8 నుంచి 10 టీఎంసీల నీటిని అక్రమంగా తరలిస్తున్నారు. చెరువులు, చెక్‌డ్యామ్‌ల నిండా నీరు నింపేందుకు కర్ణాటక ఈ అక్రమాలకు పాల్పడుతోంది. వినియోగం ఇదే రీతిలో ఉంటే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నిండటం కష్టమే అవుతుంది. నారాయణపూర్‌ పరిధిలో గడిచిన రెండు మూడు రోజులుగా అధికారికంగానే 200 నుంచి 400 క్యూసెక్కుల నీటిని కాల్వల ద్వారా ఆయకట్టుకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ 4 టీఎంసీల మేర వినియోగం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే అక్కడ ఖరీఫ్‌ ఊపందుకుండటంతో నీటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే దిగువ తెలంగాణ పరిధిలోని శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాలకు అక్టోబర్‌ వరకు నీటి రాక గగనమే కానుంది.

ఖాళీగా శ్రీశైలం, సాగర్‌
ఎగువ నుంచి ప్రవాహాలు కరువవడంతో దిగువన జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీటి రాక కరువైంది. ఇప్పటికి జూరాలకు కేవలం 2.77 టీఎంసీలు మాత్రమే కొత్త నీరు వచ్చింది. 9.66 టీఎంసీల నీటి నిల్వలకుగానూ జూరాలలో ప్రస్తుతం 5.73 టీఎంసీల నీరే ఉంది. ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో జూరాల కింది లక్ష ఎకరాల ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక శ్రీశైలానికి గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా నెలన్నర వ్యవధిలో కేవలం 0.34 టీఎంసీల కొత్త నీరే వచ్చింది. దీంతో ప్రాజెక్టు బోసిపోయి కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29.06 టీఎంసీల నిల్వే ఉంది. 186.75 టీఎంసీల లోటు కనిపిస్తోంది.

నాగార్జునసాగర్‌లోనూ అదే పరిస్థితి. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. 133.37 టీఎంసీల నిల్వలే ఉన్నాయి. ఇందులో వినియోగార్హమైన నీరు 10 టీఎంసీలకు మించదు. ఇప్పటివరకు సాగర్‌లోకి కొత్తగా 3.20 టీఎంసీల నీరు వచ్చినట్టు కనిపిస్తున్నా.. అందులో శ్రీశైలం లీకేజీల ద్వారా వచ్చిన నీరే 2 టీఎంసీల దాకా ఉంటుంది. ఇక్కడ ఇంకా 178.68 టీఎంసీల లోటు ఉంది. అంటే.. రెండు ప్రాజెక్టుల పరిధిలోనే 365 టీఎంసీల లోటు ఉండంతో సాగర్‌ కింది 6.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు అక్టోబర్, నవంబర్‌ వరకు నీరందడం ప్రశ్నార్థంగా మారింది. అదే జరిగితే ఖరీఫ్‌ ఆశలు పూర్తిగా సన్నగిల్లినట్టే!!

తుంగభద్రలో ఇలా..
జూన్‌లోనే వానలు మొదలయ్యాయి.. తుంగభద్రకు భారీగా వరద వస్తోంది.. సగటున రోజుకు 30 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది.. ఈ లెక్కన 100 టీఎంసీల ఆ డ్యామ్‌లో ఇప్పటికి 75 టీఎంసీల నీరుండాలి.. కానీ 50టీఎంసీలే ఉంది.. ఎందుకంటే తుంగభద్రకు ఎగువనే వచ్చిన నీటిని వచ్చినట్టు పక్కకు మళ్లిస్తోంది.. దీంతో దిగువన ఉన్న శ్రీశైలానికి చుక్క నీరు రావడం లేదు!

ఆల్మట్టిలో అలా..
ఈ జలాశయానికీ భారీగానే వరదొస్తోంది..
ఈ సీజన్‌లో ఇప్పటికే 38 టీఎంసీల నీరొచ్చింది.. ఇప్పటికే నిల్వ ఉన్న నీటితో కలిపితే 58 టీఎంసీలు ఉండాలి.. కానీ గత 15 రోజుల్లో దాదాపు 8–10 టీఎంసీల నీటిని అక్రమంగా చెరువులు, చెక్‌డ్యామ్‌లకు తరలించారు.. దిగువకు చుక్క రావడం లేదు.. ఇక నారాయణపూర్‌ ఎప్పుడు నిండాలి? అది నిండి జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు ఎప్పుడు నీళ్లు రావాలి..? వాటి పరిధిలోని లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇంకెప్పుడు నీరందాలి??

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement